స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోండి 

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి

స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాల నేతలతో కలిసి కేంద్రమంత్రితో భేటీ 

న్యూఢిల్లీ: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను ప్రైవేటీకరణ నిర్ణ‌యాన్ని ఉపసంహరించుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆయన ఆర్థిక మంత్రితో భేటీ అయ్యారు. ప్రైవేటీకరణను ఆపేయాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా.. అనేక ఏళ్ల పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాల అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కల నెరవేరిందని, ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలలో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కే ఆభరణం వంటిదని, 35 వేల మంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌పై ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ కారణంగానే విశాఖపట్నం నగరం మహా నగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా భాసిల్లుతోందని ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థికశాఖ మంత్రికి వివరించారు.

ఇటీవల దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించిన సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను రైళ్ల ద్వారా తరలించి లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన విషయాన్ని ఆయన కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో ఉత్పతి అయ్యే స్టీల్‌ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుందని చెప్పారు. 

అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలను చవిచూడాల్సి వస్తోందన్నారు. కేవలం ఇనుప ఖనిజాన్ని మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేయడం కోసమే ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఏటా 300 కోట్ల రూపాయలను అదనంగా భరించాల్సి వస్తోందని, ఈ పరిస్థితుల దృష్ట్యా ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే విశాఖ ఉక్కు తిరిగి లాభాల బాట పడుతుందన్నారు. తద్వారా ఆ లాభాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రికి అందించిన వినతి పత్రంలో వివరించారు. 

 

తాజా వీడియోలు

Back to Top