విశాఖ: సింహాచలం భూముల్లో అవకతవకలపై విచారణ జరుగుతోందని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఎస్టేట్ అబాల్షన్ యాక్ట్ అమలులోకి వచ్చిన నాటి నుంచి జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతుందన్నారు. విచారణ నివేదిక తరువాత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం విశాఖలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సింహాచలం దేవస్థానం గతంలో వదులుకున్న భూములపై మీడియాలో అసత్య కథనాలు వస్తున్నాయని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. 2016లో సింహాచలం దేవస్థానం వదులుకున్న భూమి 748 ఎకరాలని మీడియా గత రెండు రోజులుగా రాస్తోందని, అయితే నాడు సింహాచలం దేవస్థానం వదులుకున్నది ఐదు గ్రామాల్లో 840 ఎకరాలని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. మీడియా రాస్తున్న దానికంటే దాదాపు 100 ఎకరాలు ఎక్కువని వెల్లడించారు. "2010లో 11,118 ఎకరాలు ఉండగా, 2016 నాటికి 10,278 ఎకరాలే మిగిలాయి. అంటే 840 ఎకరాల భూములను దేవస్థానం తమవి కాదంటూ హక్కులు వదులుకుంటున్నట్టు రిజిస్టర్ లో రాసేశారు. దేవుడి సొమ్ము దోచుకున్నావు కదయ్యా పూసపాటి అశోకు!" అంటూ విమర్శించారు. కోర్టు ప్రపోజల్ అన్నది మీ అందరికి కూడా తెలుసు. ఎండోమెంట్‌కు సంబంధించి ఏ పని చేయాలన్నా..భూములను ఎవరికైనా లీజుకు ఇవ్వాలన్నా..పంపిణీ చేయాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరి. కోర్టులో పెండింగ్ ఉన్న కారణంగా ఆలస్యం జరుగుతుంది. పెండింగ్ అంశం క్లియర్ కాగానే ప్రపోజల్ ప్రకారం పట్టాలు ఇస్తామన్నారు. కోర్టు ఆదేశాలతో ఏది చేయడానికి లేదు. ఏది చేయాలన్నా కూడా కోర్టకు ప్రపోజల్‌ఇవ్వాలని, కోర్టు అనుమతి ఇస్తేనే ఏదైనా చేయగలం. 2005 నుంచి 2020 వరకు ఇప్పటి వరకు దేవస్థానం భూములకు పట్టాలు ఇచ్చిన వాటిపై విచారణ చేసి అవకతవలను వెలికి తీస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.