పచ్చ పత్రికలవి పచ్చి అబద్ధాలు

2007లోనే విశాఖలో అపార్ట్‌మెంట్‌ నిర్మించాను

ఆశ్రమ స్థలాన్ని ఆక్రమించినట్లు ఆధారాలు ఉంటే చూపండి

ఆశ్రమానికి ఫోన్‌ చేసిన బెదిరించిన వారి వివరాలిస్తే చర్యలు తీసుకుంటాం

వైయస్ఆర్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

తాడేపల్లి: పచ్చ పత్రికలు పచ్చి అబద్ధాలు రాస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ పేర్కొన్నారు. తాను ఆశ్రమ స్థలాన్ని ఆక్రమించినట్లు వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. వార్తలు రాసే ముందు వివరణ కోరాలని, సాక్ష్యాధారాలు లేకుండా కథనాలు రాయడం దారుణమన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు రాయడం సరైంది కాదన్నారు. వార్త రాసే ముందు సంబంధిత వ్యక్తులపై వివరణ తీసుకోవాల్సిన బాధ్యత ఆ పత్రికలకు ఉంది. రాసిన వార్తలకు ఎలాంటి సాక్ష్యాధారలు తీసుకోకపోవడం దారుణం. ఒక రిటైర్డు పోలీసు అధికారి, ఓ రెవెన్యూ అధికారి వాళ్ల వద్దకు వెళ్లి బెదిరించినట్లు వార్తలు రాశారు. ఆ అధికారులు ఎవరో చెబితే చర్యలు తీసుకుంటాం. అవాస్తవాలు రాయడం దారుణం. దేవాదాయ శాఖ నుంచి ఓ అధికారి ఫోన్‌ చేశారని రాశారు. ఆ అధికారి ఎవరో చెప్పండి. కాల్‌ రికార్డు ఇస్తే చర్యలు తీసుకుంటాం. దొంక తిరుగుడు రాతలు ఎందుకో అర్థం కావడం లేదు. ఆశ్రమ స్థలంలో తాను అపార్ట్‌మెంట్‌ కట్టానని అవాస్తవాలు చెబుతున్నారు.  తాను 2007లో అపార్ట్‌మెంట్‌ కట్టాను. అపార్ట్‌మెంట్‌ కట్టినప్పుడు ఆశ్రమం నిర్వాహకులు 13 ఏళ్లలో ఏ రోజు కూడా నాపై ఫిర్యాదు చేయలేదు.  ఇవాళ అధికార పార్టీ నుంచి ఎంపీగా ఉన్నానని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నా స్థలానికి, అశ్రమ స్థలానికి ఎలాంటి సంబంధం లేదు. మీ స్థలంలో అపార్ట్‌మెంట్‌ కట్టినట్లు ఏదైనా సర్టిఫికెట్‌ ఉంటే చూపించండి. అశ్రమానికి ఎవరు భూమి ఇచ్చారో తెలియదు. ఆ స్వామిజీలు ఎవరో తెలియదు. అశ్రమ స్థలాలపై తనకు ఎలాంటి ఆశలు లేవు. అవాస్తవాలతో వార్తలు రాయడం మానుకోవాలని సత్యనారాయణ హితవు పలికారు.

తాజా వీడియోలు

Back to Top