సీఎం వైయస్‌ జగన్‌కు సిన్సియర్‌ థ్యాంక్స్‌

అందరి అభిప్రాయాలు స్వీకరించి.. సంతృప్తికర సమాధానం చెప్పారు

ముఖ్యమంత్రికి సినీ హీరోలు మహేష్‌బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి కృతజ్ఞతలు

తాడేపల్లి: సినిమా టికెట్లు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చల అనంతరం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు సినీ పరిశ్రమ ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంతో సమావేశం తమకు రిలీఫ్‌ నిచ్చిందన్నారు. సినిమా ఇండస్ట్రీ పట్ల సీఎం వైయస్‌ జగన్‌కు ఉన్న సానుకూల దృక్పథానికి ధన్యవాదాలు తెలిపారు. సీఎంతో భేటీ అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి అనంతరం హీరోలు మహేష్‌బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. 

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రితో జరిగిన చర్చలు చాలా సంతృప్తినిచ్చాయన్నారు. ముఖ్యమంత్రికి సిన్సియర్‌ థ్యాంక్స్‌ చెప్పారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే మంచి శుభవార్త వింటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, మంత్రి పేర్ని నానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.  

దర్శకులు రాజమౌళి మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌కు చిన్న, పెద్ద సినిమాలు, నిర్మాతల కష్టాల గురించి చాలా అవగాహన ఉందని, చాలా ఓపిగ్గా అందరి అభిప్రాయాలు తెలుసుకొని, అర్థం చేసుకొని ఏ విధంగా ముందుకెళ్లాలని సీఎం వైయస్‌ జగన్‌ చేసిన దిశానిర్దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రితో చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఇంత పెద్ద సమస్యకు పరిష్కారం దిశగా తీసుకెళ్లిన చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. 

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇండస్ట్రీ సమస్యలను అర్థం చేసుకొని చాలా బాగా స్పందించారని, పరిశ్రమ తరఫున సీఎంకు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి థ్యాంక్స్‌ చెప్పారు.  

పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ.. చాలా పెద్ద మనసుతో సినిమా ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరిస్తున్న  సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా పేర్ని నానికి ధన్యవాదాలు తెలిపారు. నంది అవార్డుల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. 
 

తాజా వీడియోలు

Back to Top