నిరుద్యోగులను దగా చేస్తున్న చంద్రబాబు సర్కార్

16,346 పోస్ట్ ల భర్తీకి నిర్వహించాల్సిన మెగా డీఎస్సీకి మంగళం

విద్యావాలంటీర్ల నియామకానికి చంద్రబాబు కసరత్తు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ 
రెడ్డి ధ్వజం

పదేపదే డీఎస్సీ వాయిదాతో నిరుద్యోగుల్లో నిరాశ

టీచర్ పోస్ట్ ల భర్తీపై కొరవడిన చిత్తశుద్ది

విద్యారంగం కోసం రూ.73,417 కోట్లు ఖర్చు చేసిన వైయస్ జగన్

దేశంలోనే ఎపిని అగ్రస్థానంలో నిలబెట్టిన వైయస్ జగన్ కృషి

2014-19 మధ్య చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు 10,313 మాత్రమే

వైయస్ జగన్ హయాంలో భర్తీ చేసిన టీచర్ పోస్టులే 14,219

వైయ‌స్ జగన్ గారు 2,13,662 పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు

45,000 కాంట్రాక్ట్, 3,71,000 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు 

ఎంఎస్ఎంఇ ల ద్వారా 29.65 ఉద్యోగాలు కల్పించారు. 

వైయస్ జగన్ పాలనలో మొత్తం 31 లక్షల ఉద్యోగాలు కల్పించారు. 

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి

తాడేపల్లి: మెగా డీఎస్సీ ద్వారా ఒకేసారి 16,347 టీచర్ పోస్ట్ లు భర్తీ చేస్తానంటూ సీఎంగా తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు మరోసారి మెగా దగాకు సిద్దమయ్యారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో అనేక హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారని, ఆయన గత పాలనలోని చీకటి రోజులను పరిచయం చేస్తున్నారని ద్వజమెత్తారు. విద్యావాలంటీర్ల నియామకం ద్వారా టీచర్ పోస్ట్ ల భర్తీకి మంగళం పాడేందుకు సిద్దమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఎమన్నారంటే…

విద్యావాలంటీర్ల నియామకం దేనికి సంకేతం?

ఈరాష్ట్రంలో 5 లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచిఉన్నారు. తాను అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన ఉంటుందంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సీఎంగా నిరుద్యోగులకు ఒక షాక్ ఇచ్చారు. టీచర్ పోస్ట్ లు ఖాళీగా ఉన్న స్కూళ్ళలో విద్యావాలటీర్ల వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించడం దారుణం.  

మెగా డీఎస్సీ కాదు… చంద్రబాబు దగా

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జూన్ 14న చంద్రబాబు తొలి సంతకంను 16,347 ఉపాధ్యాయ పోస్ట్ ల భర్తీ ఫైలుపై చేశారు. అంతుకు ముందే ఈ ఏడాది ఫిబ్రవరిలో వైయస్ జగన్ గారి ప్రభుత్వం టెట్ నిర్వహించింది. జూన్ 25వ తేదీన టెట్ ఫలితాలు ప్రకటించారు. వీరికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పించాలంటూ చంద్రబాబు తన మనుషులతో అభ్యంతరాలు వ్యక్తం చేయించారు. దీనితో జూన్ 14న ప్రభుత్వం ఇచ్చిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను వాయిదా వేసింది.
 
భర్తీ చేయడం ఇష్టం లేక పదేపదే డీఎస్సీ వాయిదా

 టెట్ పరీక్ష నిర్వహించి అర్హలైన నిరుద్యోగులు మెగా డీఎస్సీ రాసేందుకు వీలు కల్పిస్తామంటూ ప్రభుత్వం తన డీఎస్సీ వాయిదాను సమర్థించుకుంది. తరువాత అక్టోబర్ 4వ తేదీన టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 4వ తేదీన ఫలితాలను ప్రకటించారు. వీరందరూ డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని, నవంబర్ 6న డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. మళ్ళీ ఎస్సీ వర్గీకరణ బిల్లును చూపి మరోసారి డీఎస్సీ నోటిఫికేషన్ ను చంద్రబాబు ప్రభుత్వం  వాయిదా వేసింది.  దీనిపై కమిటీ వేస్తాము, నివేదికవచ్చిన తరువాత నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ మాట మార్చారు. ఈ నివేదిక ఎప్పుడు వస్తుందో… డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు జారీ అవుతుందో తెలియక నిరుద్యోగులు అల్లాడుతున్నారు. 

విద్యావాలంటీర్ల నియామకం ప్రకటనతో బయటపడ్డ బాబు దగా

వరుసగా డీఎస్సీ నోటఫికేషన్ ను వాయిదా వేయడం వెనక చంద్రబాబు నిరుద్యోగులకు చేస్తున్న దగా బయటపడింది. తాజాగా విద్యావాలంటర్లతో పోస్ట్ లను భర్తీ చేయాలనే చంద్రబాబు కుట్ర వెలుగులోకి వచ్చింది. ఖాళీ పోస్ట్ లను విద్యావాలంటీర్లతో భర్తీ చేసిన తరువాత, డీఎస్సీ ద్వారా పర్మినెంట్ టీచర్లను నియమిస్తారా? విద్యావాలంటీర్లు తమ పరిస్థితిపై కోర్ట్ కు వెడితే ఏం జరుగుతుంది? దీనిని వివాదంగా మార్చడం వెనుక ప్రభుత్వ వ్యూహం ఏమిటీ? టీచర్ పోస్ట్ లను భర్తీ చేయకుండా ఎగ్గొట్టేందుకు జరుగుతున్న కుట్ర కాదా? నిరుద్యోగుల బతుకులతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోంది.

తెలంగాణను చూసి అయినా నేర్చుకోవాలి
నిరుద్యోగులతో టీచర్ పోస్ట్ లను భర్తీ చేయాలనే చిత్తశుద్ది ఉంటే కనీసం పక్కనే ఉన్న తెలంగాణలో ప్రభుత్వం అనుసరించిన విధానంను చూసి చంద్రబాబు నేర్చుకోవాలి. ఆ రాష్ట్రప్రభుత్వం ఫిబ్రవరి 29న డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అక్టోబర్ 9న డీఎస్సీ ఫలితాలను ప్రకటించింది. 10వ తేదీ నుంచి జీతాలు కూడా తీసుకునే పరిస్థితి కల్పించింది. ఎపీలో మాత్రం ప్రభుత్వం ఎందుకు డీఎస్సీ వరుస వాయిదాలు? ఎందుకు ప్రత్యామ్నాయంగా విద్యావాలంటీర్లను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది? 

విద్యారంగంలో వైయస్ జగన్ విప్లవాత్మక మార్పులు

దేశంలోనే విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు గడిచిన అయిదేళ్ళలో సీఎంగా వైయస్ జగన్ రూ.73,417 కోట్లు ఖర్చు చేశారు. అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ఇంగ్లీష్ మీడియం , సిబిఎస్ఇ, టోఫెల్ శిక్షణ, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు, ఫ్లాట్ ఇంటరాక్టీవ్ ప్యానెల్స్, బైజూస్ ట్యాబ్ లు, డిజిటల్ బోధనతో విద్యారంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్ట్ లను పెద్ద ఎత్తున భర్తీ చేశారు. 

ప్రైవేటీకరణకే చంద్రబాబు మొగ్గు

చంద్రబాబుకు మొదటి నుంచి ప్రైవేటీకరణ అంటేనే మోజు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో మనసులో మాట అనే పేరుతో రాసిన పుస్తకంలో ప్రజలకు విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంది కాదు అంటూ నిస్సిగ్గుగా తనవైఖరిని చాటుకున్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతోనే విద్యను అందించాలంటూ తన ఆలోచనా దోరణిని వెల్లడించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, గెస్ట్ ఉద్యోగులు, పార్టైం ఉద్యోగులు అంటూ మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేశారు. 

చంద్రబాబు పాలనలో మొదటి నుంచి నిరుద్యోగులకు నిరాశే

చంద్రబాబు పాలనలో మొదటి నుంచి నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా అయిదేళ్ళ పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు 10,313 మాత్రమే. అదే వైయస్ జగన్ గారి హయాంలో రెండేళ్ళు కోవిడ్ సంక్షోభం కొనసాగినప్పటికీ మొత్తం 14,219 టీచర్ పోస్ట్ లను భర్తీ చేశారు. ఇందులో చంద్రబాబు హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి,  పోస్ట్ లను భర్తీ చేయకుండా నిలిపివేసినవి కూడా జగన్ గారు తన హయాంలో భర్తీ చేశారు. జగన్ గారు దేశంలోని మరే ప్రభుత్వం ఇవ్వలేనంత ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు. అయిదేళ్ళలో 2,13,662 ప్రభుత్వ ఉద్యోగాలు, 45,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు, 3,71,000 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించారు. అంటే మొత్తం 6,31,000 ఉద్యోగాలు ఇచ్చిన  ఘనత వైయస్ జగన్ కే దక్కుతుంది. ఎంఎస్ఎంఇ ల ద్వారా 29.65 ఉద్యోగాలు కల్పించారు. మొత్తం జగన్ గారి అయిదేళ్ళ పాలనలో నిరుద్యోగులకు 31 లక్షల ఉద్యోగాలు కల్పించారు. 

మోసం చేయడం చంద్రబాబు నైజం
మోసం చేయడం చంద్రబాబు నైజం. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు అంటూ అందరినీ నమ్మించారు. ఆయన సీఎం కాగానే 2.66 లక్షల మంది వాలంటీర్లను రోడ్డున పడేశారు. ఎన్నికలకు ముందు వారికి ఏకంగా రూ.10 వేలు ఇస్తామంటూ ప్రకటించారు. బేవరేజ్ కార్పోరేషన్ లోని పదిహేను వేల మంది ఉద్యోగులను, వైద్యరంగంలోని డాక్టర్లు, ఇతర సిబ్బందిని పెద్ద ఎత్తున తొలగించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 3.50 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన ఘనత చంద్రబాబుది. 

ఆనాడు జన్మభూమి కమిటీలతో టీచర్లకు అవమానాలు

ఆనాడు జన్మభూమి కమిటీల పేరుతో టీచర్లను ఎంత దారుణంగా అవమానించారో టీచర్లు మరిచిపోలేదు. పదోతరగతి పాస్ కాని వ్యక్తులతో టీచర్లపై ఎన్నో అర్థంలేని ఆరోపణలు చేయించి, వారి జీవితాలతో చెలగాటం ఆడారు. అనంతపురం జిల్లాలో జరిగిన జన్మభూమి సభలో గూగూడు హెచ్ఎంను నూరుశాతం విద్యార్ధులు ఉత్తీర్ణులు అవుతారా అని ఆనాడు చంద్రబాబు ప్రశ్నించారు. స్కూల్ లో టీచర్ల కొరత ఉందని, నూరుశాతం ఉత్తీర్ణత తీసుకురాలేమని హెచ్ఎం నిజాయితీగా జవాబు చెప్పారు. జన్మభూమి మీటింగ్ లో చంద్రబాబు ఆగ్రహంతో సదరు హెచ్ఎంను యూజ్ లెస్ ఫెలో, అతడిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆదేశించారు. అదే చంద్రబాబు కేబినెట్ లోని ఒక మంత్రి ఏకంగా టీచర్ సమయానికి బడికి రాకపోతే చెట్టుకు కట్టేసి కొట్టాలంటూ బహిరంగంగా పిలుపునిచ్చారు. ఇలాంటి చీకటి రోజులను మళ్ళీ చంద్రబాబు తీసుకువస్తున్నారు. 

ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేసిన వైయస్ 

వైయస్ జగన్ గారు ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేశారు. మొదటి కేబినెట్ లోనే ఐఆర్ ఇచ్చారు. తరువాత 23 శాతం పిఆర్సి ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మంచి ఐఆర్ ఇస్తాను, పీఆర్సీ కోసం కమిటీని వేస్తానని హామీ ఇచ్చారు. ఇంత వరకు దానిపైన దృష్టి సారించలేదు. ఇప్పటికి ఎన్ని కేబినెట్ మీటింగ్ లు జరిగినా దీనిపై చర్యలు లేవు. ఆరునెలలు గడిచింది. ఉద్యోగులు అంతా దీనికోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Back to Top