అనంతపురం: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడికి చంద్రబాబు, లోకేష్ ఎబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజిరావు, టివి–5 సాంబ బాధ్యత వహించాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం అనంతపురంలో ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తమ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని, విలేకరులపై దాడులకు తెగబడుతోందంటూ చంద్రబాబు, పచ్చమీడియా ప్రచారం చేయడాన్ని ఖండించారు. వైయస్ఆర్‌సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్యవాదులు. చాలా సహనం, ఓర్పు కల్గిన వాళ్లు. ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని తప్పుడు కూతలు కూసినా, ఎల్లోమీడియా, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినా, ఎంత దుర్మార్గంగా బురద జల్లినా, నీతిమంతులపై అవినీతి కథనాలు రాస్తూ దొంగలను వెనకేసుకొస్తున్నా కూడా ఓర్పుగానే ఉంటున్నారు. ఈనాడు, ఏబీఎన్, టీవీ–5 మీడియాను వైయస్ఆర్‌సీపీ బ్యాన్ చేసింది. తమ పార్టీ ప్రెస్‌మీట్‌లు, మీటింగ్‌లకు రావద్దని స్పష్టం చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా 10 లక్షల మంది వైయస్ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు వచ్చిన రాప్తాడు ‘సిద్ధం’ సభకు ఏబీఎన్ లోగో పట్టుకుని ఫొటోగ్రాఫర్ ఎందుకొచ్చారు. ఆయనను ఎవరు పంపించారని ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఈటీవీ, ఏబీఎన్, టీవీ–5, ఐ–టీడీపీ, టీడీపీ సోషల్ మీడియా ఇవన్నీ ఒక ముఠా. రాధాకృష్ణ, రామోజీరావు, టీవీ–5 సాంబ అనే వారు, చంద్రబాబు, లోకేష్ వీరందరూ ఒకటే. గతంలో పవన్‌కళ్యాణ్ విడిగా పోటీ చేసినప్పుడు ఆయనపై కూడా బురదజల్లినవారే. పెద్ద ఎత్తున విమర్శలు చేశారు, హేళనగా మాట్లాడారు. చివరకు నరేంద్రమోదీని కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడారు. నరేంద్రమోదీని హిందూపురం ఎంఎల్‌ఎ బాలకృష్ణ అనరాని బూతులు మాట్లాడితే వాటిని కూడా ప్రచారం చేశారు కదా అని ఎమ్మెల్యే నిలదీశారు. వాస్తవాలు రాయండి, వైఫల్యాలను ఎండగట్టండి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సూచించారు. మీడియా సాధనాలు ప్రభుత్వంలో తప్పులను వెతకాలి. అలాకాకుండా వ్యక్తిత్వ హరిణానికి పాల్పడుతుండడం బాధాకరం. జర్నలిజం వృత్తిని ఫ్యాషన్‌గా తీసుకుని చాలామంది పని చేస్తున్నారు. జీతాలు లేకుండా కూడా పని చేసేవాళ్లు ఉన్నారు. ఆత్మకూరు మండలానికి చెందిన వైయస్ఆర్‌సీపీ నాయకుడు బాలపోతన్న రాప్తాడు మీటింగ్‌లో స్టేజీపై ఉన్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత మా వాహనాల్లో బయలుదేరాడు. ఇంతలో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ అన్నా...ఈ జనంలో ఇబ్బంది పడతాను నేను కూడా మీవాహనంలో వస్తానని చెబితే ఆయనను ఎక్కించుకున్నాం. ఈ క్రమంలో బాలపోతన్న వాహనం దిగి తాను నడుచుకుంటూ వస్తానని చెప్పాడు. సాయంత్రం దాదాపు 6 గంటల సమయంలో బాలపోతన్నపై దాడి చేశారు. ఆరుకుట్లు పడ్డాయి. 10 లక్షల మంది జనాభా వచ్చిన మీటింగ్ చూసి ఓర్వలేక ఆసూయతో పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తిపై దాడి చేశారు. ఇది ఆంధ్రజ్యోతి వాళ్లు దాడి చేశారా? ఈనాడు వాళ్లు దాడి చేయించారా? లేక చంద్రబాబు దాడి చేయించారా? లేదంటే స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు దాడి చేయించారా? దాడి జరుగుతుంటే మరో ఏబీఎన్ ఉద్యోగి అక్కడి నుంచి జారుకోవడం అనుమానాలు కల్గిస్తున్నాయి. దాడి జరుగుతుంటే రక్షించే ప్రయత్నం చేయకుండా వీడియోలు తీయడం వెనుక ఉద్దేశం ఏంటో పోలీసులు వెలికి తీయాలి. దాడి చేయడాన్ని ఎవరూ సమర్థించరు. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? తప్పెవరిది. రాప్తాడులో ఏబీఎన్ ఫొటోగ్రాఫర్‌పై దాడి జరిగినా, కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి జరిగినా అందుకు పూర్తిబాధ్యత వహించాల్సింది ఏబీఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, టీవీ–5 సాంబ, చంద్రబాబు. మీరు దుర్మార్గాలు చేసి, ఇచ్చిన హామీలు అమలు చేయక అధికారాన్ని కోల్పోయారు. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వాన్ని పలుచన చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ఎల్లో మీడియా, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. తొమ్మిది పథకాలు వచ్చిన కుటుంబానికి పదో పథకం రాకపోయే సరికి చూశారా.. చూశారా మీకు పథకాలు రాలేదు. తాము వస్తే ఇస్తామంటున్నారు. మీ వైఫల్యాల వల్ల అధికారం కోల్పోతే మీకోసం తప్పుడు రాతలు రాస్తూ ఏబీఎన్, ఈనాడు, టీవీ–5 విలేకరులు ఎందుకు దెబ్బలు తినాలి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ విలువలు లేకుండా వ్యవహరిస్తోంది. చంద్రబాబుతో లబ్ధి పొందిన రామోజీరావు, రాధాకృష్ణ, సాంబ. మీకోసం మీ సంస్థలో పని చేస్తున్న విలేకరులను ఎందుకు బలిచేస్తున్నారు. ఇంకా నలుగురు విలేకరులు చనిపోతే బాగుండు...దీన్ని చూపించి రాష్ట్ర వ్యాప్తంగా విష ప్రచారం చేసి అధికారాన్ని దక్కించుకునేందుకు శవరాజకీయాలకు టీడీపీ వెనుకాడదు. మీడియా మిత్రులారా...మీరూ ఆలోచించండి. ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ కృష్ణపై దాడికి పూర్తి బాధ్యత రామోజీ, రాధాకృష్ణ, సాంబ, చంద్రబాబు, లోకేష్. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి 2 వేల కోట్లు సంపాదించాడని చంద్రబాబు మాట్లాడితే అన్ని పత్రికలు, మీడియా పతాకశీర్షికలో రాశాయి. కనీసం ఏమి ఆధారం ఉందనేది కూడా ఆలోచించలేదు. నాలుగు నెలల తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్, ఏబీఎన్ చానెల్‌లో 500 కోట్లు ఉన్నాయని రాశారు. మరి 1500 కోట్లు ఎక్కడికి పోయాయి. ఇవేనా మీపత్రికా విలువలు. బురద జల్లుతాం కడుక్కోవడానికి అవకాశం ఇవ్వం అనే విధంగా వ్యవహరిస్తుండడం బాధాకరం. ఇతర చానెళ్లు, పత్రికల విలేకరులపై దాడులు జరిగినా, ఫోన్లలో బెదిరింపులు చేసినా వీరందరూ ఎందుకు స్పందించడం లేదు. ఎస్పీని ఎందుకు కలవలేదు. పొట్టకూటి కోసం దుర్మార్గాలు చేయాల్సిన అవసరం ఉందా?. తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించడానికి మీరు త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందా? ప్రాణాల మీదికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? మీడియా మిత్రులారా ఒకసారి ఆలోచించండి. విలువలతో కూడిన జర్నలిజం చేయండి. కవ్వింపు చర్యలపై విచారణ జరిపించాలి. అంతేకాని పార్టీలకు ఆపాదించడం సరికాదు. తప్పుడు కథనాలు రాస్తూ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని భావిస్తే అది వారి అమయాకత్వమే. అమాయకులపై జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లపై దాడులు చేస్తే తాముకూడా ఖండిస్తాం. విపరీతమైన ధోరణితో వైయస్ఆర్‌సీపీపై బురదజల్లే కథనాలకు స్వస్తి పలికి విలువలతో కూడి జర్నలిజంతో ముందుకు పోవాలని ఎమ్మెల్యే కోరారు. మా పార్టీకి చంద్రబాబు అనే వ్యక్తి పోటీనే కాదు. దుష్టచతుష్టయంతోనే మా పోటీ అని మా అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు. మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు కథనాలు రాయిస్తున్న వారిపైనే పోటీ. వారి నుంచి ప్రజల ఆలోచన విధానాన్ని కాపాడుకోవాలని మా ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వంపై ఎంత దుర్మార్గంగా, వాస్తవాలను వక్రీకరించి కథనాలు రాస్తున్నా రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరగలేదు. పది లక్షల మంది జనాభా కల్గిన సభకు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ లోగో పట్టుకుని వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఏమన్నాడో...కార్యకర్తలు ఎందుకు రియాక్ట్ అయ్యారో తెలీదు. వాస్తవాలు విచారణలో తేలతాయి. అయితే ఈ ఘటనను ముఖ్యమంత్రికి అపాదించడం చంద్రబాబు దిగుజారుతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.