అసెంబ్లీ: సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి భావించారని, పోలవరం ప్రాజెక్టు అంటే మహానేత వైయస్ఆర్ గుర్తుకువస్తారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. రాష్ట్ర ప్రజల దశాబ్దాల కలకు వైయస్ఆర్ శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. తండ్రి శంకుస్థాపన చేసిన పోలవరం ప్రాజెక్టు.. తనయుడు సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా ప్రజలకు అంకితమవుతుందన్నారు. పోలవరంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడారు.
‘ప్రజాప్రస్థానం పాదయాత్ర ద్వారా మా ప్రాంతానికి వచ్చిన వైయస్ఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టు కట్టిస్తానని మాటిచ్చారు. వైయస్ఆర్ కలల స్వప్నం పోలవరం. సాగునీటి ప్రాజెక్టులను వైయస్ఆర్ ఆధునిక దేవాలయాలుగా భావించారు. వ్యవసాయం, తాగునీటికి ఆధారం నీరు.. ఆ నీరు వృథాగా సముద్రం పాలవుతుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. అందుకనే దివంగత వైయస్ఆర్ పోలవరం ప్రాజెక్టును మొదలుపెట్టారు. తెలుగు నేల ఉన్నంతకాలం వైయస్ఆర్ పేరు గుర్తిండిపోతుంది.
పోలవరాన్ని గత ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో అందరం చూశాం. ప్రతి సోమవారం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వచ్చి పనులకు ఆటంకం కలిగించడం, మనవడితో వచ్చి ఫొటో, కొడుకుతో వచ్చి భోజనం చేయడం తప్ప చేసిందేమీ లేదు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ చెప్పారు. కాసులకు కక్కుర్తిపడి పోలవరాన్ని పాడికుండగా చంద్రబాబు మార్చుకున్నాడు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, రైతులు అంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదు. పోలవరంలో ఏం చేయకపోయినా.. తానే పూర్తిచేస్తున్నట్టు ప్రజల్లో భ్రమ కల్పించాడు. నేడు పోలవరం పూర్తయితే టీడీపీ గోదావరిలో కలిసిపోతుందని అనేక అడ్డంకులు సృష్టిస్తున్నాడు. దుష్ప్రచారాలు చేయిస్తున్నాడు.
సీఎం వైయస్ జగన్కు చిత్తశుద్ధి ఉంది కాబట్టే పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. నాడు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు.. నేడు సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా పూర్తవ్వనుంది. ఆనాడు వైయస్ఆర్తో పోలవర శంకుస్థాపనలో, తనయుడు సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా సాకారం అవుతున్నందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. పోలవరం రాష్ట్రానికి జీవనాడి లాంటిది. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసే అవకాశం కల్పించాలి.
పోలవరం ప్రాజెక్టు వల్ల 373 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దాదాపు లక్ష కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నారు. చంద్రబాబు 30 సార్లు పోలవరం వచ్చినా నిర్వాసితులను ఒక్కనాడూ కలవలేదు. పోలీసులతో గెంటేపించేవాడు. సీఎం వైయస్ జగన్ నాలుగైదుసార్లు వచ్చినా ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితులతో కూడా మాట్లాడి వారికి మేలు చేసేలా అధికారులను ఆదేశించారు. చంద్రబాబు హయాంలో నిర్వాసితులకు పిట్టగూడు లాంటి ఇళ్లు చూసి ఆనాడు ధర్నాలు చేశాం. ఈరోజున ప్రాజెక్టుఎంత ముఖ్యమో.. నిర్వాసితులు కూడా అంతే ముఖ్యమని సీఎం వైయస్ జగన్ భావించారు. నిర్వాసితులకు బ్రహ్మండమైన ఇళ్లు కట్టిస్తున్నారు. ప్యాకేజీని కూడా పెంచారు. చంద్రబాబు హయాంలో రూ.6.50 లక్షలు ఇస్తే.. దాన్ని రూ.10 లక్షలకు సీఎం వైయస్ జగన్ పెంచారు. వైయస్ఆర్ హయాంలో తక్కువ ధరలకు భూములు ఇచ్చిన రైతులకు రూ.5 లక్షల పరిహారం ఇస్తానని మాటిచ్చారు. నిర్వాసితులకు, రైతులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అండగా నిలబడ్డారు’’ అని తెల్లం బాలరాజు అన్నారు.