సున్నిపెంట గ్రామ సచివాలయాల్లో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలి

శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
 

అమరావతి: శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట గ్రామ సచివాలయాల్లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో సున్నిపెంట గ్రామ పంచాయతీ సమస్యలను ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి ప్రస్తావించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..   30వేల జనాభా ఉన్న సున్నిపెంట గ్రామం గతంలో పంచాయతీ కాదు..ఏ మున్సిపాలిటీలో లేదు.   గత 40 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ గ్రామాన్ని సీఎం వైయస్‌ జగన్‌  దృష్టికి రెండెళ్ల క్రితం తీసుకెళ్లగా గ్రామ పంచాయతీగా మార్చేందుకు హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీగా మార్చారు. ఆ తరువాత ఈ గ్రామంలో 4 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఇందులో 44 మంది ఉద్యోగులను నియమించారు. 160 మంది గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేశాం. ఇది మారుమూల ప్రాంతంలో ఉండటంతో ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు ముందుకు రావడం లేదు. శ్రీశైలం నియోజకవర్గ హెడ్‌క్వార్టర్‌ ఆత్మకూరుకు ఈ గ్రామం 110 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంత వరకు ఈ గ్రామంలో ఎంపీడీవో కార్యాలయం లేదు. ఏదైనా సమస్యను చెప్పుకోవాలంటే గ్రామస్థులు వ్యయప్రయాసలు పడుతున్నారు. సచివాలయాల్లో 44 మంది ఉద్యోగుల్లో ప్రస్తుతం 22 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 22 మంది సిబ్బంది కావాలి. సున్నిపెంటకు చెందిన యువకులు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారినే డిప్యూటేషన్‌పై గ్రామ సచివాలయ సిబ్బందిగా నియమిస్తే బాగుంటుంది. వీఆర్‌వో, ఏఎన్‌ఎం, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లను నియమించాల్సి ఉంది. 

సున్నిపెంట పంచాయతీగా మారినప్పటికీ ఇంతవరకు ల్యాండ్‌ కన్వర్షన్‌ కాలేదు. ఇరిగేషన్‌ ల్యాండ్‌ను పీఆర్‌ ల్యాండ్‌గా మార్చాల్సి ఉంది. 1400 ఎకరాల్లో 1200 ఎకరాలు పీఆర్‌కు అప్పగించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రతిపాదనలు త్వరగా పూర్తి చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.మా నియోజకవర్గం అటవీ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. చెక్‌ పోస్టు ఆదాయాన్ని పీఆర్‌కు డైవర్ట్‌ చేయాలని ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి కోరారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top