సంప్రదాయాల గురించి బాబు మాట్లాడడం సిగ్గుచేటు

శాసనసభలో టీడీపీ సభ్యుల తీరు ప్రజలు ఛీ కొట్టేలా ఉంది

ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా సభా సమయాన్ని వృథా చేస్తున్నారు

ఇప్పటికైనా టీడీపీ సభ్యులు గౌరవంగా వ్యవహరించాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

 

అమరావతి: చంద్రబాబు సభా సంప్రదాయాల గురించి మాట్లాడడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, పదవిని లాక్కొని కనీసం ఆయనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అసెంబ్లీ నుంచి ఎన్టీఆర్‌ ఏడ్చుకుంటూ వెళ్లేలా చేసిన చంద్రబాబు, కనీసం స్పీకర్‌ని కుర్చిలో కూర్చోబెట్టేందుకు సభా సంప్రదాయం ప్రకారం లేచిరావాలని తెలిసినా కూడా రాని అహంకారి చంద్రబాబు అని, ఆయన సభా సంప్రదాయం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. శాసనసభలో టీడీపీ సభ్యుల తీరు ప్రజలు ఛీ కొట్టేలా ఉంది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ‘అంతుచూస్తా.. నాతో పెట్టుకున్నారు బతికి బట్టకట్టలేదు’ అని ఎన్నో రకాలుగా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అచ్చెంనాయుడు అసెంబ్లీలో గింజుకుంటున్నాడు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మగాడివా అని మాట్లాడిన తీరు రాష్ట్రం అంతా చూసి అసహ్యించుకుంది. కేవలం వైయస్‌ జగన్‌పై ఉన్న నమ్మకంతో ప్రజలంతా 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు. చంద్రబాబును ఛీకొట్టి 23 సీట్లు ఇస్తే ఓడిపోయిన ఫ్రెస్టేషన్‌లో ఏం చేయాలో అర్థం కాక ప్రతి దానికి గొడవ చేస్తున్నారు. 

బడ్జెట్‌పై చర్చ జరిగితే కచ్చితంగా చంద్రబాబును రాష్ట్ర ప్రజలంతా అసహ్యించుకుంటారు. అనుభవం కలిగిన వ్యక్తి గతంలో ఏం బడ్జెట్‌ పెట్టాడు.. ఏ వర్గానికి న్యాయం చేశాడనే ఆలోచన ప్రజల్లో మొదలవుతుంది. చిన్న వయస్సు అయినా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్రలో ప్రజలందరి కష్టాలు విని వారందరికీ న్యాయం చేయాలని బడ్జెట్‌ రూపొందించారు. చంద్రబాబు తన ఐదు సంవత్సరాల పాలనలో రైతులను విస్మరించి కరువు సందర్భాల్లో ముందస్తు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పక్క రాష్ట్రాల నుంచి మూడున్నర లక్షల క్వింటాళ్ల విత్తనాలు కొనుగోలు చేసి రైతులకు పంపిణీ చేశారు. ఆ విషయాన్ని కప్పి పుచ్చి రైతులకు విత్తనాలే ఇవ్వన్నట్లుగా టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారు. రైతులు, కౌలు రైతులకు కూడా వర్తించేలా రైతు భరోసా పథకం ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. 

బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నాశనం చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టారు. ఆ పథకం చూసి భరించలేక దానిపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేయిస్తున్నారు. అసెంబ్లీ బ్రేక్‌ ఇచ్చే ముందు వాయిదా తీర్మానం అని రభస చేస్తున్నారు. ఓడిపోయిన ఫ్రెస్టేషన్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌ సీపీ నాయకులపై దాడులు చేస్తున్నారు. చంద్రబాబుకు సూటి ప్రశ్న వేస్తున్నా.. శాంతి భద్రతల విషయం ఇప్పుడే గుర్తుకు వచ్చిందా..? చింతమనేని ప్రభాకర్‌ మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే దానిపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తే ఎందుకు చర్చించలేదు.  నారాయణ కాలేజీల్లో పిల్లలు చనిపోతున్నారని వాయిదా తీర్మానం ఇస్తే దాని గురించి కూడా పట్టించుకోలేదు. శాంతిభద్రతల గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ సభ్యులు గౌరవంగా ప్రవర్తించాలి.

తాజా ఫోటోలు

Back to Top