తాడేపల్లి: కరోనా కారణంగా ఎక్కడ ప్రాణాలు పోతాయోనన్న భయంతో పిరికిపందలా హైదరాబాద్‌లో దాక్కున్న చంద్రబాబు మా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యంపై మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, అంబులెన్స్‌ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని టీడీపీ నేతలు నిసిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రూ.200 కోట్లకు కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తే..రూ.300 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. వీటిపై టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని పార్థసారధి సవాలు విసిరారు. గురువారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కోసం సీఎం వైయస్ జగన్ కొత్తగా 1088 కొత్త అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. 104, 108 వాహనాలను ఒకేసారి ప్రజలకు సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం అందించడం గర్విస్తున్నాం. ఈ కార్యక్రమాలను చూసిన తెలుగు ప్రజలు సీఎం వైయస్ జగన్‌ను మనసార అభినందిస్తున్నారు. ప్రతి మండలానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి, అర్బన్ ఏరియాలో కేవలం 15 నిమిషాల్లో అందుబాటులో ఉంటుంది. రూరల్ ఏరియాలో 20 నిమిషాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. ఈ వాహనాలు అత్యంత అధునిక పరికరాలను ఏర్పాటు చేయడమే కాకుండా, ఫ్యామిలీ డాక్టర్ ను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడే రక్త పరీక్షలు చేస్తున్నారు. గతంలో కేవలం ఘగర్, రక్తపరీక్షలు మాత్రమే పరీక్షలు చేసేవారు. ప్రస్తుతం అన్ని టెస్టులు చేయడమే కాకుండా 72 రకాల మందులు అందజేస్తున్నాం. హెల్త్‌కార్డులు అందజేసి, ఎక్కడైనా చూపించుకునే ఏర్పాటు చేశాం. ఈ ప్రభుత్వం ఒట్టి మాటలు చెప్పి మాయలు చేసే ప్రభుత్వం కాదు. ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడేవిధంగా ఈ వాహనాలు ఏర్పాటు చేశాం. సరైన సమయానికి వైద్యాన్ని అందించే ఏర్పాటు చేశాం. ఇంత గొప్ప కార్యక్రమం సీఎం వైయస్ జగన్ చేస్తే..నిసిగ్గుగా, ఉక్రోషంతో ఏదో అవినీతి జరిగినట్లు గగ్గోలు పెడుతున్నారు. మంచి పనులను మెచ్చుకోలేని దౌర్భగ్య పరిస్థితిలోకి టీడీపీ దిగజారింది. అంబులెన్స్‌లు కొనుగోలు చేసేందుకు రూ.200 కోట్లు ఖర్చు అయితే ..రూ.300 కోట్లు అవినీతి అంటున్నారు. ఒపెన్ టెండర్ ద్వారా వాహనాలు సేకరించాం. కేవలం పెద్దలకు మాత్రమే కాకుండా నియోనాటల్ అంబులెన్స్ ఏర్పాటు చేశాం. శిశు మరణాలు అరికట్టే విధంగా ప్రతి జిల్లాకు రెండు వాహనాలు ఏర్పాటు చేశాం. ప్రాణం పొతుందనో, ఏదో నష్టం జరుగుతుందోనని పిరికిపందలా హైదరాబాద్‌లో కూర్చొని నిసిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారు. గతంలో 1800 వాహనాలు సేకరించామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ మాటలు చెప్పడానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలి. 1800 వాహనాలు మీరు ఏర్పాటు చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. టీడీపీ నేతలకు సవాల్ చేస్తున్నాం. 108 , 104 వాహనాలను ఏర్పాటు చేసింది దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి. ఈ వాహనాలు బయట తిరిగితే ఎక్కడ వైయస్ఆర్ గుర్తుకు వస్తారో అని వాటికి మరమ్మతులు చేయించకుండా షెడ్డుకే పరిమితం చేశారు. సీఎం వైయస్ జగన్ కొత్త వాహనాలను కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఆరోగ్య రంగం గురించి చంద్రబాబు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎలుకలు కరిచి చిన్నపిల్లలు చనిపోయారు. ఈ ప్రభుత్వం 16 మెడికల్ కాలేజీలను కొత్తగా ఏర్పాటు చేస్తోంది. గత ప్రభుత్వంలో ఏ ఆసుపత్రికి వెళ్లినా డాక్టర్లు, నర్సులు ఉండేవారు కాదు. మా ప్రభుత్వం డాక్టర్లను నియమించడమే కాకుండా ఆరోగ్య రంగంలో ఉన్న వాహనాలను అధునాతనంగా తీర్చిదిద్దుతున్నాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు దిగజార్చారు. పేదవారికి అండగా ఉండాలనే ఆలోచన చంద్రబాబుకు ఉండేది కాదు. ఆసుపత్రులకు బకాయిలు పెట్టిన ఘనుడు చంద్రబాబు. దాదాపు రూ.640 కోట్లు బకాయిలను సీఎం వైయస్ జగన్ చెల్లించారు. ఆరోగ్యశ్రీలో గతంలో 800 రకాల జబ్బులకు మాత్రమే పరిమితం కాగా, సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక మొట్ట మొదట పశ్చిమ గోదావరి జిల్లాలో 2059 రోగాలను చేర్చారు. అన్ని జిల్లాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. రూ.5 లక్షలు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామంటే ఆరోగ్యానికి మా ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవాలి. జనవరి 2020 నుంచి జూన్ వరకు ఈ 6 నెలల కాలంలో దాదాపు రూ.28 వేల కోట్లు వివిధ పథకాల పేరుతో పేదలకు నేరుగా అందించాం. చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునేవాడు. గల్లిగల్లీకి ఓ హుండీ పెట్టి నిధులు స్వాహా చేసేవారు. అలా కాకుండా కోవిడ్-19 సమయంలో పేదలు భోజనాలకు ఇబ్బంది పడుతున్నారని గమ నించి, వారికి ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి ఆశావర్కర్ల ద్వారా వైద్యసేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే పార్థసారధి పేర్కొన్నారు.