ఓటీఎస్ ను అడ్డుకోవాల‌నుకోవ‌డం ప్ర‌తిప‌క్షాల అవివేకం

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి
 

నెల్లూరు: పేద‌ల ఇంటిపై స‌ర్వ‌హ‌క్కులు క‌లిగే వ‌న్ టైం సెటిల్‌మెంట్ ప‌థ‌కాన్ని అడ్డుకోవాల‌నుకోవ‌డం ప్ర‌తిప‌క్షాల అవివేక‌మ‌ని నెల్లూరు రూర‌ల్ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి అన్నారు.  నెల్లూరు జ‌న‌శ‌క్తి న‌గ‌ర్‌లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ప్ర‌జాబాట కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. స్థానికుల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకొని..వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షం అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తోందని మండిప‌డ్డారు. పేదలకు 1983 నుంచి ప్రభుత్వాలు ఇంటి స్థలం ఇచ్చి పట్టాలు పంపిణీ చేశాయన్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓ మంచి ఆలోచనతో జగనన్న సంపూర్ణ గృహ హక్కు–వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీం తెచ్చారన్నారు. ఈ పథకం కింద రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే లబ్ధిదారుడికి తన ఇంటిపై సర్వహక్కులు వస్తాయన్నారు. దీని వల్ల ఇంటిని అమ్ముకోవచ్చని, వారసత్వంగా అందివ్వడంతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలు ఉంటే తనఖా పెట్టుకుని బ్యాంకుల ద్వారా రుణం తీసుకోవచ్చని చెప్పారు. గతంలో ఇలాంటి సదుపాయం ఉండేది కాదన్నారు. ఈ పథకంపై కూడా టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఓటీఎస్‌ చేసుకోకుంటే పథకాలు రద్దు అవుతాయని అసత్య ప్రచారాన్ని చేస్తున్నారన్నారు. లబ్ధిదారులు తమకు ఇష్టమైతేనే ఓటీఎస్‌ చేయించుకోవాలని స్పష్టం చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేదల కోసం చేసింది శూన్యమన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉండి ఓటీఎస్‌ను అసలు పట్టించుకోలేదన్నారు. గతంలో ప్రభుత్వాలు ఓటీఎస్‌ స్కీం కింద వడ్డీ మాఫీ చేస్తుంటే.. చంద్రబాబు వచ్చాక అది కూడా చేయలేదన్నారు. ప్రజలు టీడీపీ నేతల ప్రచారాన్ని నమ్మొద్దని, ఓటీఎస్‌ చేయించుకుని స్థలంపై సంపూర్ణ హక్కు పొందాలని కోరారు.  ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలకు అడ్డుతగిలితే ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని కోటంరెడ్డి శ్రీ‌ద‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. 

Back to Top