ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం

గొలగమూడిలో లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి

ఆనందయ్య కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా నిలుస్తాం

నెల్లూరు: కరోనా బాధితుల కోసం ఆనందయ్య తయారు చేసిన మందును కోరినవారందరికీ పంపిణీ చేస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం గొలగమూడిలో ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాకాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి ఇచ్చిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్లు సూచించిన మెడిసిన్‌ తీసుకుంటూనే ఆనందయ్య మందు తీసుకోవాలని కరోనా బాధితులకు సూచించారు.   

ఆనందయ్య మందుతో పది మందికి మేలు జరగాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే కాకాణి అన్నారు. ఏ మనిషి అయినా స్వార్థంతో తన కుటుంబానికి మందు అందించాలని ఆశపడతారో.. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నా కుటుంబ సభ్యులు కాబట్టే ముందుగా ఆనందయ్య మందును నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్నామన్నారు. కేవలం సర్వేపల్లితోనే ఈ కార్యక్రమం ఆగిపోదని, త్వరలోనే ఇతర జిల్లాలకూ ఆనందయ్య మందు పంపిణీ చేస్తామన్నారు. 

ఎవరూ ఆత్రుతపడాల్సిన అవసరం లేదని, ప్రతీ ఇంటికి, ఉద్యోగికి, బయట నుంచి వచ్చే వారికి మందు పంపిణీ చేస్తామన్నారు. సర్వేపల్లిలో పూర్తయిన తరువాత ప్రతి జిల్లాకూ పంపిణీ చేస్తామని, రాష్ట్రం, దేశం, ఇతర దేశాల్లో కూడా కోరుకున్న వారికి మందు అందిస్తామన్నారు. ఆనందయ్య, వారి కుటుంబ సభ్యులకు భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top