ప్రధాని మోదీ పేరు ఎత్తడానికి చంద్రబాబుకు భయం

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖ:  ప్రధాని మోదీ పేరు ఎత్తడానికి చంద్రబాబుకు భయం పట్టుకుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. చంద్రబాబు మాటలు విని ప్రజలెవరూ మోసపోవద్దని సూచించారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రతి నాయకుడిగా చంద్రబాబు ఉండటం దురదృష్టకరమన్నారు. విశాఖకు మాయల ఫకీర్‌ వచ్చారని విమర్శించారు. ఇవాళ విశాఖ వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం చంద్రబాబుకు తగదన్నారు. చంద్రబాబు డ్రామాలు విశాఖ ప్రజలకు బాగా తెలుసు అన్నారు.  14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు విశాఖకు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించేలా చేశారా అని నిలదీశారు. హిందుస్థాన్‌ జింక్‌ పరిశ్రమకు మా కుటుంబాలు భూములు ఇచ్చాయని గుర్తు చేశారు. ఈ ప్రాంత బాగుకోసం పోరాటాలు చేసింది మేమని, ఇవాళ చంద్రబాబు వచ్చి రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అన్నారు. విశాఖ ప్రజలు పిరికివాళ్లు అంటూ ఇక్కడికి వచ్చి మాట్లాడటం దుర్మార్గమన్నారు. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే ఇక్కడి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
 

Back to Top