విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

2014లోనే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అడుగులు

2018లో ఫోక్సో ప్రతినిధులతో చంద్రబాబు భేటీ

స్టీల్‌ ప్లాంట్‌పై ఇప్పటికే సీఎం వైయస్‌ జగన్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు

చంద్రబాబు, లోకేష్‌ కేంద్రానికి లేఖ రాశారా?

ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం

విశాఖ: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారని గుర్తు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అడుగులు పడ్డాయని తెలిపారు. నారా లోకేష్‌ వ్యాఖ్యలను గుడివాడ అమర్‌నాథ్‌ తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.

అప్పట్లో చంద్రబాబు ఏం చేశారు..?
2014వ సంవత్సరంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తుంటే ముఖ్యమంత్రి స్థానంలో, ఎన్డీఏ కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు ఏం చేశారని గుడివాడ అమర్‌నాథ్‌ నిలదీశారు. చంద్రబాబు హయాంలోనే ఉక్కు ప్రైవేటీకరణకు అడుగు పడిందన్నారు. కేంద్ర నిర్ణయానిన నాడు చంద్రబాబు, ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన అశోక్‌ గజపతిరాజు వ్యతిరేకించలేదన్నారు.

చంద్రబాబు ఫోక్సో ప్రతినిధులతో సమావేశం కాలేదా?
2018వ సంవత్సరంలో చంద్రబాబు  పోక్సో ప్రతినిధులతో సమావేశం కాలేదా అని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. సీఎం వైయస్‌ జగన్‌తో పోక్సో ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిస్తే తప్పేంటని నిలదీశారు. వాస్తవాలు తెలుసుకుని నారా లోకేష్‌ మాట్లాడితే మంచిదని హితవు పలికారు. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడాలనే తపన చంద్రబాబుకు ఏ రోజు లేదన్నారు. 

స్టీల్‌ ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వ సంస్థ
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వ సంస్థ అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను విక్రయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా అని ప్రశ్నించారు. మెరిటేజ్‌ సంస్థను వేరే ఎవరో అమ్మితే మీరు ఊరికే ఉంటారా అని నిలదీశారు. చంద్రబాబు హయాంలో 52 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేశారని గుర్తు చేశారు.బీహెచ్‌పీవీని చంద్రబాబు అమ్మాలని చూస్తే..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కాపాడారని తెలిపారు. 

ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది మీ బాబే
విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను చంద్రబాబే కేంద్రానికి తాకట్టు పెట్టారని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన స్వార్థం కోసం, పోలవరం టెండర్ల కోసం ప్రత్యేక ప్యాకేజీకి ఆశపడి చంద్రబాబు ప్రత్యేక హోదాను వదులుకున్నారని మండిపడ్డారు. నాడు కేంద్రంతో నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలారన్నారు. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నట్లు నటిస్తున్నారని, ప్రజలు ఏవీ మరిచిపోలేదని, అందుకే టీడీపీకి ఓట్ల రూపంలో బుద్ధి చెప్పారని గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top