విశాఖ: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని, విశాఖ పరిపాలన రాజధాని కావడం ఖాయమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మండిపడ్డారు. శనివారం విశాఖపట్నంలో గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. వైయస్ జగన్ సీఎం అయ్యాక అన్నిప్రాంతాలు అభివృద్ధి జరగాలని చర్యలు తీసుకుంటున్నారన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన ఎల్లో వైరస్ ప్రతిపక్షనేత చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన ఎల్లో వైరస్ అని గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ప్రతిపక్ష నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర టీడీపీ, సీపీఐ నేతలు విశాఖ అభివృద్ధికి అడ్డుపడటంపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు.చంద్రబాబు విశాఖ పరిపాలన రాజధాని కాకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. సొంత జిల్లా చిత్తూరులోనే చంద్రబాబు నమ్మకం కోల్పోయారని, రాయలసీమ ప్రజలకు కూడా ఆయన అన్యాయం చేశారన్నారు. కనీసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అయినా టీడీపీ ప్రాతినిధ్యం ఉందా అని ప్రశ్నించారు. బాధితులను పరామర్శించడానికి తీరిక లేదా? చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌కు ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు కూడా తీరిక లేదా అని గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. అవినీతికేసులో అచ్చెన్నాయుడు అరెస్టు అయితే హుటాహుటిన పలకరించిన లోకేష్‌కు ఎల్జీ పాలిమర్స్ బాధితులు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. చంద్రబాబు, లోకేష్ కుట్రలను ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ తొత్తుగా మారారని విమర్శించారు.