ప్రతిపక్షానికి నిధులు ఇస్తే.. దొంగకు డబ్బిచ్చినట్లే

తెలుగుదేశం తమ్ముళ్ల దోపిడీకి అధికారులు బలయ్యారు

టీడీపీ దోపిడీని ఆధారాలతో సహా నిరూపిస్తా

అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫైర్‌

 

అసెంబ్లీ: గ్రామీణ ఉపాధి హామీ నిధులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దొంగ బిల్లులు పెట్టి కాజేశారని, టీడీపీ పుణ్యాన అధికారులు సస్పెండ్‌ అయ్యారని ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ ఆడిట్‌లో టీడీపీ బండారం మొత్తం బయటపడిందని, ఆధారాలతో సహా నిరూపిస్తానని చెప్పారు. సభలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఉపాధి హామీకి సంబంధించి టీడీపీ చేస్తున్న నిరసన బాధాకరం. ప్రతిపక్షం సిగ్గుతో తలదించుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉపాధి హామీ నిధులు పార్టీ కార్యకర్తలకు ముట్టజెప్పారు. ఈ పాపానికి 417 మంది అధికారులు సస్పెండ్‌ అయ్యారు. 250 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు అయ్యాయి. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో మరుగుదొడ్లు నిర్మాణాలను కాంట్రాక్టర్‌కు ఇచ్చారు. ఒక గ్రామంలో 190 ఇళ్లు ఉంటే 217 మందికి మరుగుదొడ్లు కట్టినట్లుగా నకిలీ బిల్లులు సృష్టించి నిధులు కాజేశారు. చివరకు సోషల్‌ ఆడిట్‌ జరిగి విచారణ జరిగితే కేవలం 70 మందికే మరుగుదొడ్లు నిర్మించారని తేలితే ఆ మండల ఎంపీడీఓను సస్పెండ్‌ చేశారు. ఆ కాంట్రాక్టర్‌ తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు.. అరెస్టు చేస్తారని పరారయ్యాడు. పాత గుంతలను కొత్త గుంతలని చూపించి బిల్లులు చేసుకున్న ఆధారాలు సోషల్‌ ఆడిట్‌లో తేలాయి.

సాలిడ్‌ బేస్‌ ప్రాసెస్‌ యూనిట్లు పెట్టి అడవుల్లో పెట్టి డబ్బులు డ్రా చేసుకున్నారు. గ్రామాల్లో ఉన్న వ్యర్ధాలు అడవుల్లోకి తీసుకెళ్లి వేయగలరా..? పాత చెక్‌ డ్యామ్‌ కొత్తవిగా చూపించి బిల్లులు చేసుకున్నారు. చెరువుల్లో పాత గుంతల మధ్య కొంత తవ్వకాలు చేసి పెద్ద గుంతలు అని చూపించి డబ్బులు డ్రా చేసుకున్నారు. ఫాంపాండ్స్‌ను మిషనరీతో చేసి వాటికి బిల్లులు డ్రా చేసుకున్నారు. వీటన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. పనులు చేయకున్నా చేసినట్లు చూపించి నిధులను కాజేశారు. టీడీపీ పుణ్యాన్న 417 మంది అధికారులు సస్పెండ్‌ అయితే 250 మంది అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఎన్‌ఆర్‌ఐఈజీఎస్‌ నిధులు చెల్లించాలని అడుగుతున్నారు.. ఆ రోజున బెదిరించి చేపించుకున్న ఎం బుక్‌లతో ఆ డబ్బులు దోచేసి లోకల్‌ బాడీ ఎన్నికల్లో ఖర్చు చేయాలనే దుర్మార్గుపు ఆలోచన. వీళ్లకు డబ్బులు ఇవ్వడం అంటే దొంగకు డబ్బులు ఇచ్చినట్లేనని ఎమ్మెల్యే చెవిరెడ్డి అన్నారు.

Back to Top