శ్రీకాళహస్తి: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని, అక్కడికక్కడే వివరాలు నమోదు చేసుకుని, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు మండల స్థాయిలో "జగనన్నకు చెబుదాం" అర్జీలు నేరుగా స్వీకరిస్తున్నారని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో కలెక్టర్ వెంకటరమణారెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలన్న సంకల్పంతో జగనన్నకు చెబుదాం 1902 కాల్ సెంటర్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని, మండలాల వారీగా జేకేసీ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కరించే వీలుంటుందని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం జగనన్న అనునిత్యం శ్రమిస్తున్నారని అందులో భాగంగానే గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి పేద ప్రజలపై తనకున్న ప్రేమను చాటుకున్నారని తెలిపారు. కరోనా సమయంలో వాలంటీర్ల సేవలు మరువలేనిదని వాలంటీర్లు అందరూ దేవుడితో సమానమని తెలిపారు. అలాగే సచివాలయ సిబ్బంది కూడా ప్రజలతో ప్రేమగా మాట్లాడుతూ సమస్యలను పరిష్కరిస్తున్నారని మునుముందు కూడా వారు ఎంతో ప్రజాసేవ చేయాలని ప్రజాసేవ చేయడం ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, పగడాల రాజు,ముత్యాల పార్థసారథి, నాని,కొల్లూరు హరి నాయుడు అలాగే ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, శ్రీకాళహస్తి ఎంపీడీవో, రెవెన్యూ, భూ సంబంధ, హౌసింగ్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.