కాల్వల సామర్ధ్యం పెంపును సీమ ప్రజలు స్వాగతిస్తున్నారు  

వరద జలాలను మళ్లించేందుకే కాల్వల సామర్థ్యం పెంపు
 

నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌

కర్నూలు:  సముద్రంలో కలుస్తున్న వరద జలాలను మళ్లించడం ద్వారా రాయలసీమ కరువును కడతేర్చడానికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాలువల సామర్థ్యాన్ని పెంచుతోందని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ పేర్కొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న కాల్వల సామర్థ్యం పెంపును రాయలసీమ ప్రజలంతా స్వాగతిస్తున్నారని వెల్లడించారు. బుధవారం ఆర్థర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జలాల వినియోగంలో బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలకు కట్టుబడి సీఎం వైఎస్‌ జగన్‌ పోతిరెడ్డిపాడు జలాశయం నుంచి 80 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి ప్రణాళిక రూపొందించారన్నారు.  రాయలసీమ దాహార్తి తీర్చడానికి, కనీసం నాలుగేళ్లకు ఒక్కసారైనా పంటలకు నీళ్లందించి పేదరికాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాలువల సామర్థ్యం పెంపునకు తెలంగాణ సర్కార్‌ సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. గతేడాది వరదలు వచ్చినప్పుడు జలాశయం నిండి గతేడాది 800 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వృధాగా వదిలామన్నారు. వృధా నీరు సముద్రం పాలు కాకుండా, వరదలు వచ్చినప్పుడు మన జలాశయాల సామర్ధ్యం పెంచుకునేందుకు, ప్రాజెక్టులు నింపుకునేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.  దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆప్పట్లో పొతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారన్నారు. ఈ రోజు 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కుల సామర్ధ్యం పెంచి ప్రాజెక్టులు నింపేందుకు సీఎం జగన్‌ చర్యలు తీసుకున్నారని చెప్పారు. దీని వల్ల ఎవరికి నష్టం లేదని, కృష్ణా బోర్డు ఆదేశాల ప్రకారమే ఏపీ ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్షాలు దీన్ని రాద్ధాంతం చేయకుండా అందరం కలిసి అన్నదమ్ముల్లా మెలుగుదామన్నారు. వరదలు వచ్చిన్నప్పుడు వృధా అవుతున్న నీటిని మాత్రమే తరలించాలని ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. చుట్టు ప్రక్కల ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు వీలవుతుందన్నారు. నీటిని సకాలంలో తరలించకపోవడంతో ఈ ప్రాంతంలోని పొలాలు నీట మునిగేవన్నారు. రాయలసీమ రైతులంతా 80 వేల సామర్ధ్యం పెంపును స్వాగతిస్తున్నారని చెప్పారు. రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్న వైయస్‌ఆర్‌ ఆశయాల మేరకు వైఎస్‌ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కేసీ కెనాల్‌ ఆధునీకీకరణ పనులు కూడా మొదలుపెట్టారని ఎమ్మెల్యే ఆర్థర్‌ పేర్కొన్నారు. 

Back to Top