వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట 

 బాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలే  
 
ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి

అనంతపురం  : వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్ట అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి విమ‌ర్శించారు. టీడీపీని, చంద్రబాబును గతంలో ప్రజలు ఆదరించారని, కానీ నేడు తిరస్కరించడంతో అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. గురువారం అనంతపురంలోని మారుతినగర్‌లో ఉన్న పాండురంగస్వామి కళ్యాణ మండపంలో ‘వైయ‌స్‌ఆర్‌ ఆసరా’ వారోత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

సొంత మామ‌కే వెన్నుపోటు..
చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలేనని.. సొంతమామకే వెన్నుపోటు పొడిచారని వెంక‌ట్రామిరెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేస్తుంటే తప్పించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారన్నారు. అనేక వ్యవస్థల్లో తన మనుషులను పెట్టుకున్న చంద్రబాబు ఎప్పుడు అవసరమొచ్చినా వారిని మేనేజ్‌ చేస్తుంటారని అన్నారు. ఇప్పటికే 18 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని, వ్యవస్థపై నమ్మకం ఉంటే స్టేలు తొలగించుకుని తన సచ్ఛీలతను నిరూపించుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులున్నాయన్నారు. అమరావతి కుంభకోణం విషయంలో కోర్టుల తీరు ఆక్షేపణీయమన్నారు. ఎఫ్‌ఐఆర్‌ను రిపోర్టు చేయొద్దనడం, మీడియా, సోషల్‌ మీడియాపై నిషేధం విధించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత దారుణమని, వీటిపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో వైయ‌స్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోర్టులు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అవినీతి పరుల ఆగడాలకు అడ్డే ఉండదని ఎమ్మెల్యే వెంక‌ట్రామిరెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top