అనురాధమ్మా.. రేషన్‌కార్డు సమస్య తీరిందా?

అర్జీదారుకు ఫోన్‌ చేసి తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత

 27వ సచివాలయంలో ఆకస్మిక తనిఖీ

 సిబ్బంది జవాబుదారీతనంతో పని చేయాలని సూచన

 పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం

 ప్రజల నుంచి ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

 సచివాలయ భవనం మార్పు చేసుకోవాలని సూచన

అనంతపురం  : ‘‘అనురాధమ్మా.. నేను ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డిని మాట్లాడుతున్నా.. రేషన్‌కార్డు స్ప్లిట్టింగ్ కు సంబంధించి సచివాలయంలో అర్జీ ఇచ్చారు కదా?.. మీ సమస్య తీరిందా’’ అంటూ ఎమ్మెల్యే అనంత నేరుగా అర్జీదారురాలికి ఫోన్‌ చేసి ఆరా తీశారు. సమస్య పరిష్కారమైందని ఆమె చెప్పడంతో సచివాలయం, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. శనివారం నగరంలోని రహమత్‌నగర్‌లో ఉన్న 27వ సచివాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా స్పందన అర్జీలపై సిబ్బందితో ఆరా తీసి రిజిస్టర్‌ పరిశీలించారు. రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ ప్రతి ఆర్జీకి సంబంధించి వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు.  ప్రకాశ్‌రోడ్డులోని రైల్వే ట్రాక్‌ వద్ద డ్రెయినేజీ సమస్య అధికంగా ఉన్నట్లు శానిటేషన్‌ సిబ్బంది చెప్పడంతో నగర పాలక సంస్థ ఈఈ రామ్మోహన్‌కు ఫోన్‌ చేసి తరచూ ఇక్కడ సమస్య ఉత్పన్నం అవుతోందని, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని తెలిపారు. సచివాలయం పరిధిలో ఎక్కడైనా రోడ్లు అవసరం ఉంటే రిపోర్ట్‌ ఇవ్వాలని సిబ్బందికి తెలియజేశారు. ఎక్కడా డ్రెయినేజీ సమస్య రాకూడదన్నారు. పారిశుద్ధ్యం మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల స్థలాల కోసం వచ్చిన ఆర్జీలపై ఆరా తీసి వాటి స్టేటస్‌ను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలకు సంబంధించి ఎక్కడా నిబంధనలు అతిక్రమించరాదని, సిబ్బంది క్షేత్రస్థాయి వెళ్లి పరిశీలించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ కారణాలతో ఏవైనా పింఛన్లు తొలగించారా? అని తెలుసుకుని ఒకవేళ అర్హత ఉంటే లబ్ధి చేకూరేలా చూడాలని తెలిపారు. రేషన్‌కార్డుల స్ప్లిట్టింగ్ ఆప్షన్‌ విషయంలో సమస్యలు వస్తున్నాయని సిబ్బంది చెప్పడంతో.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు పారదర్శకంగా లబ్ధిదారులకు అందాలని.. సిబ్బంది, వాలంటీర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయం పరిధిలో పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారని.. ప్రభుత్వ పథకాలు, అర్హతల గురించి అందరికీ తెలియజేయాలని సూచించారు. కార్యాలయాలకు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తామంటే కుదరని స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని తెలిపారు. ఇక సచివాలయ భవనం చిన్నదిగా ఉండడంతో ప్రజలు, సిబ్బందికి సౌకర్యవంతంగా ఉండేలా మరో భవనాన్ని చూడాలని సూచించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top