స్వర్ణాల చెరువును పునరుద్ధరించాలి 

ఆనం రామనారాయణరెడ్డి
 

అమరావతి: నెల్లూరులోని స్వర్ణాల చెరువును పునరుద్ధరించాలని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి డిమాండు చేశారు. బుధవారం సభలో ఆయన చెరువు సమస్యను ప్రస్తావించారు.  చారిత్రక ప్రసిద్ధిగాంచిన సింహపూరి పట్టణానికి దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి చెరువు ఉందన్నారు. రైత్వారిగా అక్కడ తాగునీటికి ఉపయోగపడేలా ఉన్న నెల్లూరు చెరువును స్వర్ణాల చెరువు అంటారని చెప్పారు. ఈ చెరువును 1250వ సంవత్సరంలో కాకతీయ రాజులు ఏర్పాటు చేశారని తెలిపారు. చరిత్ర కలిగిన ఆ చెరువును ప్రతి ప్రభుత్వం కాపాడుకుంటూ వచ్చిందన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరానికి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు కావాలని ఆనం వివేకానందరెడ్డి కోరితే ప్రత్యేక నిధులు కేటాయించారన్నారు. బ్రిటీష్‌ ఇంజినీర్లు కూడా ఈ చెరువును డెల్టా ప్రాంతంగా తీర్చిదిద్దేవిధంగా నిర్మించారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత  అనే పథకం తెచ్చిందని, ఈ చెరువుకు కూడా నిధులు కేటాయించి నెల్లూరు వైపు ఉన్న సర్‌ఫ్లస్‌ వేర్‌ను తీసేశారని చెప్పారు. మరోక వేర్‌ను పెన్నానదికి వెళ్లేలా ఏర్పాటు చేశారన్నారు. ఆ చెరువు కింద ఇంకా ఆయకట్టుదారులు ఉన్నారని, సర్‌ఫ్లస్‌ వేర్‌లు తీసేశారని, ఆయకట్టుదారుల అనుమతి లేకుండా చెరువు స్వరూపాన్ని మట్టితో కప్పి పూడ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కారణంగా స్వర్ణాల చెరువును కాలకూటవిషంగా మార్చారని మండిపడ్డారు. ఈ చెరువు విషయంలో తప్పు చేసిన వారిని శిక్షించాలని కోరారు.
 

Back to Top