పదవి లేకపోతే చంద్రబాబు రాక్షసుడు

ఒక వర్గాన్ని కాపాడుకోవడం కోసం బాబు నీచ రాజకీయాలు

చంద్రబాబు కనుసన్నల్లోనే ప్రభుత్వ విప్‌ పిన్నెళ్లిపై హత్యాయత్నం

దీనికి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

గుంటూరు: పదవి కోల్పోయినప్పుడు చంద్రబాబు రాక్షసుడిలా మారిపోతాడు. పదవి కోసం వైశ్రాయ్‌ హోటల్‌ ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గుర్తుచేశారు. ప్రభుత్వ విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన దాడిని చంద్రబాబు బాధ్యత వహించాలని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజధాని పేరుతో కొన్ని రోజులుగా చంద్రబాబు ఒక వర్గం కోసం, ఆస్తులు కాపాడుకోవడం కోసం ఆందోళన చేయిస్తున్నాడు. సంస్కారహీనంగా మాట్లాడుతూ వారిని రెచ్చగొట్టి దాడులకు పాల్పడే స్థాయికి తీసుకువచ్చాడని మండిపడ్డారు. చంద్రబాబు కనుసన్నల్లోనే పిన్నెళ్లిపై హత్యాయత్నం జరిగిందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం వైయస్‌ జగన్‌ ప్రతిపాదనలను అందరూ స్వాగతిస్తుంటే చంద్రబాబు మాత్రం ఒక వర్గం కోసం వ్యతిరేకిస్తున్నాడన్నారు. తన వర్గాన్ని కాపాడుకోవడం కోసం అమాయక రైతుల జీవితాలతో చంద్రబాబు ఆటలాడుతున్నాడన్నారు.

గుంటూరులోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లారంటే.. ‘కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళన శృతిమించుతోంది. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నష్టం జరిగిందని భావించినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేయడం హక్కు. ఆ హక్కు ఇతరుల హక్కులను కాలరాసే విధంగా ఉద్యమాలు జరిగితే వాటిని అణచివేయాల్సిన అవసరం బాధ్యత కలిగిన ప్రభుత్వంపై ఉంటుంది. రాజధాని పేరుతో కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళన శృతిమించి వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే, విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై దాడి చేసే స్థాయికి రాళ్లు వేసి కారు అద్దాలు పగులగొట్టి గన్‌మెన్‌లపై దౌర్జన్యం చేసే స్థాయికి వెళ్లిందంటే చిన్న విషయంగా వైయస్‌ఆర్‌ సీపీ భావించడం లేదు.

గత కొన్ని రోజులుగా ఉద్యమం అంతా చంద్రబాబు పర్యవేక్షణ, నాయకత్వంలో జరుగుతుందని స్పష్టంగా చెప్పా. వారి కుటుంబం గాజులు, ధనం ఇచ్చి ఉద్యమాన్ని పెంచే కార్యక్రమం చేస్తున్నారు. కానీ, చంద్రబాబు ఇవాళ జరుగుతున్న దాడులకు, హింసాత్మకమైన ధోరణికి చంద్రబాబు బాధ్యత వహించాలి. ఇంతకు ముందు చాలా సందర్భాల్లో చూశాం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రజలు శాంతికాముకులు దానిలో సందేహం లేదు. రాజధాని పేరుతో జరుగుతున్న ఉద్యమంలో పది రోజులుగా సంస్కారహీనంగా మాట్లాడుతుంటే చంద్రబాబు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు.
ఒక ఐఏఎస్‌ అధికారిని పట్టుకొని వాడు అనే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడు. చంద్రబాబు లక్షణం ఒకటే ఆయన పదవికి, ఆయన ఆస్తులకు, ఆయన వర్గానికి నష్టం జరిగితే వెనుకా ముందు ఆలోచించకుండా ఎంత దారుణానికైనా ఒడిగడుతాడు.

పదవికి ముప్పు వచ్చినప్పుడు చంద్రబాబులోని రాక్షస నీతి బయటకు వస్తుంది. మహిళలను ముందు పెట్టి ఇష్టం వచ్చిన భాషతో మాట్లాడించిన చంద్రబాబు దీనికి బాధ్యత వహించాలి. పదవి కోసం వైశ్రాయ్‌ హోటల్‌ దగ్గర ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించాడు. అనేక భూతు పదాలను వాడించి ఉద్యమాన్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేశాడు. అది కేవలం ఆ ప్రాంతంలోని ఆస్తులు కోట్లాది రూపాయలకు ఎదిగిపోయిందని భ్రమించిన ఒక వర్గం మాత్రమే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వారికి సంబంధించిన కొన్ని పత్రికలు మొదటి పేజీల్లో మహా ఉద్యమం అని, సకల జనుల సమ్మె అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా ఆ ప్రాంతానికి చెందిన ఒక వర్గానికి మాత్రమే పరిమితమైంది.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో అందరూ సమానంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం. ఏదో ఒక వర్గానికి, ప్రాంతానికి దోచిపెట్టాలనే దుర్బుద్ధి, పక్షపాతం లేని మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. అందువల్లే రాష్ట్రమంతా హర్షిస్తున్నారు. కానీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఒక వర్గం మాత్రమే కొన్ని పత్రికల అండదండలు, చంద్రబాబు ప్రోద్బలంతో ఇదంతా చేస్తున్నారు. కానీ, ఇవాళ ఉద్యమం పెరగడం లేదని హైవేల దిగ్బంధం అని ఒక హింసకు దారి తీసే విధంగా ప్రయత్నం చేశారు. రైతులకు సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చంద్రబాబు మాటలు నమ్మి దౌర్జన్యాలకు పాల్పడితే బాబే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

హైదరాబాద్‌ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఈ రాష్ట్రమంతా ఉద్యమాలు చేసినప్పుడు ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడారా..? ఆ రోజు బంగారు గాజులు ఇచ్చారా..? ఆ రోజున బయటకు వచ్చారా..? అప్పుడు గోడ మీద పిల్లిలా వ్యవహరించాడు. ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని కొంత భాగం విశాఖకు, కొంత భాగం కర్నూలు వెళ్లిపోతుందంటే ఏంటో గందరగోళం అర్థం కావడం లేదు. ఆ ప్రాంతాల్లోని ప్రజలంతా మనవాళ్లు కాదా..? ఇది కేవలం కుట్ర పూరితంగా ఒక వర్గపు జనులు పాల్గొని సకల జనులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ టీవీ జర్నలిస్టు దీప్తి అనే మహిళలపై దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు. ఇవాళ ఒక ఎమ్మెల్యే కారుపై రాళ్లు రువ్వి గన్‌మెన్‌పై దాడి చేశారు. సమస్యలు పరిష్కారం కావాలా.. ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారా..? అధికారం పోయినప్పుడు హింసను ప్రేరేపించి అల్లకల్లోలం సృష్టించాలని వ్యవహరిస్తున్నాడు. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌ సీపీ తరుఫున డిమాండ్‌ చేస్తున్నాను. వంగవీటి రంగాను అతిదారుణంగా చంపినటువంటి వ్యక్తి చంద్రబాబు కుట్ర కాదా.. పింగళి దశరథరామ్‌ విషయంలో, ఒక ఐఏఎస్‌ విషయంలో ఏం చేశాడో తెలుసు. చంద్రబాబు అహం దెబ్బతిన్నప్పుడు దాడి చేసి హింసలు ప్రేరేపిస్తున్నాడు.  

ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించినప్పుడు ఎంతో బాధపడ్డాం.. ఆ రోజున హింసను ప్రోత్సహించామా..? వైయస్‌ఆర్‌ మరణం తరువాత ఆయన కుమారుడు వైయస్‌ జగన్‌ను 16 మాసాలు జైల్లో పెట్టారు.. దారుణంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు.. ఆ రోజున హింసను ప్రోత్సహించామా..? పాదయాత్ర సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టులో వైయస్‌ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ రోజున హింసను ప్రోత్సహించామా..? వినాశకాలే విపరీత బుద్ధి. పదవి కోల్పోయిన తరువాత చంద్రబాబుకు వినాశ కాలం వచ్చింది.. అందువల్లే విపరీత బుద్ధితో చంద్రబాబు హింసను ప్రేరేపిస్తున్నాడు’ అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

 

తాజా వీడియోలు

Back to Top