ప్రధాన ప్రతిపక్షం రెండు సభల్లోనూ దారుణంగా ప్రవర్తించింది

వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు 
 

అమరావతి: ప్రధాన ప్రతిపక్షం రెండు సభల్లోనూ దారుణంగా ప్రవర్తించిందని వైయ‌స్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమ‌ర్శించారు.  ఆంధ్రప‍్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్టాడారు. 

అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..
తెలుగుదేశం పార్టీ తీరు అప్రజాస్వామ్యకంగా ఉంది. శాసనసభ, మండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన వైఖరి అత్యంత జుగుప్సాకరంగానూ, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్య వాదులు సిగ్గుపడేలా ఉందని చెప్పడంలో ఏవిధమైన సందేహం లేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి అకారణంగా ఏదోకటి సృష్టించుకుని శాసన సభకు రానని భీష్మ ప్రతీజ్ఞ చేశారు. ఆయన శపథం చేసి సభకు రావడంలేదు. వాళ్ల అబ్బాయ్‌ లోకేష్ మాత్రం శాసన మండలికి వస్తాడు. మరోవైపు వాళ్ల పార్టీ సభ్యులు మాత్రం అన్ని సభలకు హాజరు అవుతారు. ఏమిటీ ద్వంద్వ వైఖరి?. ఏంటీ విధానం? ఏంటి మూడు విధానాలు? ఆ పార్టీ సభ్యులు వస్తారు, ఆయన కొడుకు వస్తాడు.. చంద్రబాబు మాత్రం రాడు.ఏమిటీ రాజకీయం..?

అసెంబ్లీకి వచ్చిన టీడీపీ సభ్యులు క్రియశీలకంగా సమావేశాల్లో పాల్గొంటారా అంటే అదీ చేయరు. తొలిరోజే గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకుని చివరికి మార్షల్స్‌ను ప్రయోగించాల్సిన అనివార్యమైన పరిస్థితిని స్పీకర్‌కు కల్పించారు. ఆ తర్వాత నుంచి వరుసగా రోజూ అసెంబ్లీలో ఏదో ఒక వింత కార్యక్రమం చేయడం, సభ నుంచి సస్పెండ్ కావడం చేశారు. ఈ సెషన్‌ మొత్తం టీడీపీ వాళ్లకు ఉన్న ఒకే ఒక్క డైలాగ్‌ ఏంటంటే.. "జంగారెడ్డిగూడెం నాటు సారా మరణాలు ప్రభుత్వ హత్యలే.." అనేది వాళ్ల బ్రాండింగ్‌. నాటు సారా లేదు, నాటు సారా వలన మరణాలు లేవు. సహజ మరణాలు అయితే ఉన్నాయి. పలు కారణాలతో మరణాలు జరిగితే నాటు సారా మరణాలు అంటూ చిత్రీకరించి  ప్రభుత్వంపై బురద చల్లేందుకు ఇవన్నీ టీడీపీ- ఎల్లో మీడియా ప్రయత్నాలే తప్ప మరొకటి కాదు అని అసెంబ్లీ సాక్షిగానే ఆధారాలతో సహా ముఖ్యమంత్రి వివరించారు.  అప్పుడన్నా చర్చలో పాల్గొన్నారా.. అంటే అదీ చేయలేదు.  శాసనసభలో అనేక అంశాలపై చర్చ జరిగింది. ఎక్సైజ్‌ పాలసీపై సుదీర్ఘ చర్చ జరిగితే టీడీపీ ఎందుకు పాల్గొనలేదు. ఎందుకు పారిపోయారు? మద్యం పాలసీపై ముఖ్యమంత్రి సభలో చాలా స్పష్టంగా చెప్పారు. చర్చలో పాల్గొనే ధైర్యం లేదు. బయటకు వెళ్లి మీడియాతో మాట్లాడతారు. 

శాసన సభ అంటే టీడీపీ సభ్యులకు హేళన, ఎగతాళిగా మారింది.  గతంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా సభలోనే ఉన్నారుగా? చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా? వాళ్లు సభలో లేకపోతే ఎగతాళా? రెండు సభల్లో టీడీపీ సభ్యులు విజిల్స్‌ ఊదారు. అంటే వాళ్ల నోళ్లు పడిపోయాయా? అందుకే విజిల్స్‌ ఊదారా? అలా చేసినందుకు సభనుండి సస్పెండ్‌ చేస్తే.. తర్వాత రోజు సభలో తాళాలు కొట్టడం. ఇదేమైనా శాసన సభా? లేక భజన చేసే కార్యక్రమమా? మీకంతగా ఈలలు, తాళాలు కొట్టుకోవాలంటే టీడీపీ కార్యాలయానికి వెళ్లి కొట్టుకోవచ్చుగా? జీవితాంతం తాళాలు కొట్టుకునే మార్గాన్ని రాబోయే ఎన్నికల్లో మేము మీకు చూపిస్తాం. దాంతో ఇక రోజు బాబుకొడుకులు ఎదురుబొదురూ కూర్చొని తాళాలు కొట్టుకోవచ్చు. సభకు వచ్చి తాళాలు కొట్టుకునే దౌర్భాగ్యపు ఆచారాన్ని తెచ్చారు సరే. 

ఇవాళ అయితే ఏకంగా మంగళసూత్రాలే తీసుకువచ్చారు. ఏం పోయేకాలం వచ్చింది. నారా లోకేష్‌ మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత ఉన్నది కూడా పోయింది. ఒళ్లు తగ్గింది కానీ బుర్ర పెరగలేదు. మంగళసూత్రాలు తీసుకువచ్చారు సరే..  బుర్రలేని వాడు కదా దగ్గరకు రానిస్తే మగవాళ్లకు కూడా మంగళసూత్రాలు కట్టేస్తాడేమో అని భయపడ్డారు. లోకేష్ తో జాగ్రత్త.. ఎవరూ దగ్గరకు రానివ్వకండి. బాబుగారి ఆదేశంతో చినబాబు  శాసనసభకు మంగళసూత్రాలు పట్టుకువచ్చి గందరగోళం చేశారు. ఇదంతా ఏంటనేది ప్రజలు ఆలోచించాలి. గౌరవప్రదంగా నడవాల్సిన సభల్లో ఈ వెకిలి చేష్టలు ఏంటి?

ప్రతి అంశంలోనూ టీడీపీ ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోంది. పెగాసస్‌ మీద సభలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. కల్తీ సారా, మద్యం పాలసీ, పోలవరం ప్రాజెక్ట్‌ మీద సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. వీటిపై సభలో మాట్లాడరు కానీ బయటకు వెళ్లి వారికి కావాల్సిన టీవీ ఛానల్స్‌ ముందు మాట్లాడతారు. అక్కడ అయితే బాగా చూపిస్తారని కాబోలు. టీవీ5, ఈటీవీ, ఎబీఎన్‌ చానల్స్‌నే టీడీపీ ఎమ్మెల్యేలు చట్టసభలు అనుకుంటున్నారేమో. తనకు అధికారం పోయిందనే ఫ్రస్టేషన్‌తో చంద్రబాబు నాయుడు ఇలా దుష్ట సంప్రదాయాన్ని తెర తీశారు. అసహనంతో చంద్రబాబు వ్యవస్థలు నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ తీరు అప్రజాస్వామ్యకంగా ఉంది. శాసనసభ, మండలిలో టీడీపీ వ్యవహరించిన వైఖరి రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్య వాదులు సిగ్గుపడేలా ఉందని చెప్పడంలో ఏవిధమైన సందేహం లేదు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top