అంబ‌టి చెప్పిన దొంగ‌ల క‌థ‌

అమరావతి : అవినీతి రహితమైన, పారదర్శకతతో కూడిన పాలనను అందించడానికే ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన  జ్యుడిషియల్‌ బిల్లుపై జ‌రిగిన చ‌ర్చ‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అస‌క్తిక‌ర‌మైన దొంగ‌ల క‌థ చెప్పారు.  చంద్రబాబు దోపిడీని దొంగల కథ ద్వారా వివరించి ఆకట్టుకున్నారు. ‘ఓ దేశంలో కొంత మంది దొంగలు బ్యాంకును దోచుకోవడానికి వెళ్లగా.. అక్కడి ఉద్యోగులు అడ్డుకుంటారు. అనవసరంగా మీ ప్రాణాలు పోతాయి.. ఇది ప్రజల సొమ్ము మీకెందుకు? అని హెచ్చరించగానే వారు అడ్డు తప్పుకుంటారు. దొంగలు కొంత సొమ్మును దోచుకునేసరికి పోలీసులు వస్తారు. వారి చెర నుంచి కొంత సొమ్ముతో ఎలాగోలా బయటపడతారు. ఎంత సొమ్ము దోచామో లెక్కిద్దామని దొంగల్లోని ఒకడనగా.. రేపు ప్రభుత్వం చెబుతుందిలే.. పడుకుందామంటాడు ఇంకొకడు. దొంగలంతా ఆ రాత్రికి విశ్రాంతి తీసుకుంటారు. ఉద్యోగులు పోలీసులకు రూ.20 కోట్ల లూటీ జరిగిందని చెబుతారు. అయితే రూ.40 కోట్లు పోయిందని చెబుదాం.. మిగతా 20 కోట్లు మనం తీసుకుందామని బ్యాంకు అధికారులు, పోలీసులు నిశ్చయించుకుంటారు. ఈ విషయాన్ని మంత్రికి తెలియజేయగా.. రూ.20 కోట్లు నొక్కెద్దామని ఆయన రూ.60 కోట్లని చెప్పమంటాడు. రూ.60 కోట్లు దోపిడీ జరిగిందని  ఆ దేశ ప్రధాని దగ్గరకు వెళ్లగా ఆయన ఏకంగా రూ.100 కోట్లు పోయాయని చెప్పమంటాడు. ఇది చూసిన దొంగలు.. సొమ్మును లెక్కించగా రూ.20 కోట్లే ఉంటుంది. మనం 20 కోట్లు దొంగలిస్తే.. వీరు మనపేరు చెప్పుకొని రూ. 80 కోట్లు నొక్కేశారు. దొంగలు వీరా? మనమా? అని ఆవేదనకు లోనవుతారు.’ అయితే ఆ దేశ ప్రధాని ఎవరో కాదు చంద్రబాబు నాయుడేనని అంబటి వివరించారు. ఇరిగేషన్‌కు వేల కోట్లు ఖర్చు చేసినట్లు చంద్రబాబు చూపించాడని, కానీ ఫలితం మాత్రం లేదన్నారు. దొంగల కథ మాదిరిగానే ఈ డబ్బులు కూడా పక్కదారి పట్టాయన్నారు. ఇలాంటి దోపిడీ జరగకుండా ఉండేందుకే ఈ జ్యుడిషియల్‌ బిల్లని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

Back to Top