పాలన మెచ్చి ప్రజలిచ్చిన అద్భుత విజయమిది

ఘ‌న విజ‌యాన్ని అందించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు

మా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేశారు

ఓడిపోయినా నాదే పైచేయి అనుకునే చంద్ర‌బాబును ఆ భగవంతుడే రక్షించాలి

ఎన్నికల్లో ఓడిన ప్రతిసారీ.. ఏదో ఒక సాకు చెప్పడం బాబుకు అలవాటు

మీడియా రాసిందే ప్రజావాణి అనుకోవడం పొరపాటు

మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ నాయ‌క‌త్వంలోని వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వ పరిపాలనను మెచ్చి ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు అద్భుతమైన విజయాలను అందిస్తూ.. ప్రభుత్వ పనితీరుకు నూటికి 98 నుంచి 99 శాతం మార్కులు వేసి ఆశీర్వదించారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వరుస ఎన్నికల్లో ఓడిపోయినా.. చంద్రబాబు ఆత్మపరిశీలనగానీ, ఎందుకు ఓడానన్న సమీక్షగానీ చేసుకోకుండా ఓడినా.. తనదే పై చేయి అంటూ మీడియా ముందు కేకలు వేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఓడిన ప్రతిసారీ ఏదో ఒక సాకు చెప్పే చంద్రబాబు మాటలు వింటుంటే.. ఆయనను ఇక ఆ భగవంతుడే రక్షించాలన్నారు. ప్రజావాణి ప్రకారం మీడియా ఉండాలే తప్పితే.. మీడియా రాసిందే ప్రజావాణి అనుకోవడం పొరపాటు అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గుర్తెరగాలని హితవు పలికారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే..

రెండున్నరేళ్ల మా ప్రభుత్వ పరిపాలనను చూసి వైయస్ఆర్ సీపీని, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ ప్రతి ఎన్నికల్లో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎన్నికల ఫలితాలు చూశాక చాలా సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఎన్నో ఎన్నికలు, ఫలితాలు, పరిపాలనను చూశాం. ఇటువంటి విజయాలు, ఫలితాలు ఎప్పుడూ చూడలేదు. సీఎం వైయ‌స్‌ జగన్‌ నాయకత్వంలో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని.. ఇవాళ వచ్చిన ఫలితాలు ఇవి. 

ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పరిపాలనను మెచ్చి, ఈ ప్రభుత్వానికి ప్రజలు నూటికి 98-99శాతం మార్కులు వేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లు పూర్తి అయిన తర్వాత..  ప్రభుత్వం పరిపాలనా విధానం పట్ల, పార్టీ పరంగా నాయకుడి విధానం పట్ల, ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధానం పట్ల, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ- అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు నూటికి 98శాతం సంతృప్తితో ఉన్నారనేది ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం, తార్కాణం.

తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలికే కొన్ని పత్రికలు, టీవీలు, చంద్రబాబు లాంటి వ్యక్తులు ప్రతిరోజూ ప్రభుత్వం మీద అవాకులు, చెవాకులు పేలుతూ.. బురదచల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు వారిని విశ్వసించలేదు, వారి మాటలను నమ్మడం లేదనడానికి నిదర్శనమే ఈ ఫలితాలు. చంద్రబాబు, టీడీపీ నేతల మాటలు పట్టించుకోనక్కరలేదు. 2009 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి చవిచూసినప్పుడు.. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరిగిందంటూ నిస్సిగ్గుగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. తాను ఎందుకు ఎన్నికల్లో ఓడిపోయాడో, ప్రజలు ఎందుకు ఓడించారో.. పాలనలో లోపాలను సరిదిద్దుకుంటానని చెప్పకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్‌ల వల్లే తాము ఓడిపోయామని, మరొకటని సాకులు చెప్పడం చంద్రబాబుకు అలవాటే. 

కుప్పంలో దొంగ ఓట్లు వేశారని చంద్రబాబు చెబుతున్నారు. ఓటమికి కారణాలను విశ్లేషించుకోకుండా, ఇంకా ఇటువంటి మాటలు మాట్లాడుతున్న ఆయనను ఇక భగవంతుడే కాపాడాలి. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలంతా కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయిన తర్వాత కూడా సాధారణ ఎన్నికల్లో చూపించిన ఆదరణకు మించి ఇప్పుడు చూపించారు. ఈ ఫలితాలు ఇచ్చినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సమన్వయంగా పని చేయడంవల్లే ఈ ఫలితాలు వచ్చాయి. ప్రజలు మా మీద నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ ఫలితాలను చూశాక, మరింత ఎక్కువగా ప్రజా సేవకు పునరంకితం అవుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలుపుతున్నాం.

ఇప్పటికైనా చంద్రబాబుకు వత్తాసు పలికే పత్రికలు, చానల్స్‌ వాస్తవాలు గ్రహిస్తే మంచిది. ప్రజావాణి ప్రకారం మీడియా ఉండాలి తప్పితే.. మీడియా చెప్పినట్టు ప్రజావాణి ఉండదన్న సత్యాన్ని గుర్తెరగాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీకి వత్తాసు పలికే మీడియా ఎంత ఊదరగొట్టినా.. ప్రజలు మావైపే ఉన్నారు.  మా ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుంది. ఇచ్చిన మాటను నెరవేర్చడానికి పట్టుదలతో, కృతనిశ్చయంతో పనిచేస్తూ, సమస్యలు అధిగమించి ముందుకు వెళుతున్నాం. ప్రజలు ఇచ్చిన ఈ ఫలితాలతో రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తాం.

తన ఓటమికి మరొకర్ని కారణంగా  చూపిస్తూ పబ్బం గడువుకోవడం చంద్ర‌బాబుకు బాగా అలవాటైంది.  2009 ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరిగిందని చంద్రబాబు ఎలా చెప్పారో.. ఇవాళ ఈ ఎన్నికల్లోనూ  దొంగ ఓట్లు వేశారని చెబుతున్నారు. అప్పుడు.. ఇప్పుడూ చంద్రబాబు వైఖరి ఒకటే. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడు అనేవారు లోపాలను సమీక్షించుకుని ముందుకు వెళ్లాలే కానీ చంద్రబాబులా టక్కుటమార విద్యలు ప్రదర్శించడం సరికాదు. బీజేపీ, జనసేన పార్టీలతో మాకు సంబంధం లేదు. ఆ పార్టీలు రాష్ట్రానికి చేసిందేముంది. ఆ పార్టీలకు స్పష్టమైన వైఖరి లేదు, కాబట్టే మాట్లాడటం కూడా అనవసరం.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top