కృష్ణా: పామర్రు నిభానుపూడి మైనర్ బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. నిభానుపూడిలో బాలిక కుటుంబాన్ని హోంమంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మైనర్ బాలికపై అత్యాచారం జరగడం, ఆమె చనిపోవడం చాలా బాధాకరమన్నారు. బాలికపై అత్యాచారం చేసి ఆమె మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేశామని, వారిని కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేశారని చెప్పారు. బాలికపై అత్యాచారం, మృతి విషయాన్ని ఎమ్మెల్యే అనిల్ సీఎం దృష్టికి తీసుకువచ్చారని, సీఎం వెంటనే స్పందించి ఆ కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారన్నారు. మైనర్ బాలిక కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.