బాధ్య‌త‌లు స్వీక‌రించిన మంత్రులు మేరుగ నాగార్జున‌, విడ‌ద‌ల ర‌జిని

స‌చివాల‌యం: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా విడ‌ద‌ల రజిని సచివాలయంలోని వారివారి ఛాంబ‌ర్ల‌లో సోమ‌వారం ఉదయం బాధ్యతలు స్వీక‌రించారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన అనంత‌రం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంబేద్కర్‌ ఆలోచన, జగ్జీవన్‌రావు కాన్సెఫ్ట్‌తో పాలన చేస్తున్నారన్నారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయనని స్ప‌ష్టంచేశారు. దళితులు ఎవ్వరికీ అన్యాయం జరగకూడదని సీఎం ఆలోచన అని మంత్రి మేరుగ వివ‌రించారు. 

పేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషిచేస్తా : మంత్రి రజిని
సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంత‌రం వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రిగా విడ‌ద‌ల రజిని బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషిచేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వైద్య రంగాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. బీసీలకు సీఎం వైయ‌స్‌ జగన్.. ఎవ్వరు ఇవ్వనంత ప్రాధాన్యం ఇచ్చారని, బీసీలు ఎప్పటికీ సీఎం వెంటే ఉంటారని మంత్రి విడదల రజిని అన్నారు.

Back to Top