తాడేపల్లి: భారతదేశంలో సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అని, సామాజిక న్యాయం అనే పదానికి అసలు సిసలైన నిర్వచనాన్ని ఈ నాలుగున్నరేళ్ల పాలనలో చాటిచెప్పారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఈనెల 26వ తేదీ నుంచి మూడు ప్రాంతాల్లో ప్రారంభం కాబోతున్న సామాజిక సాధికార యాత్ర వివరాలను మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, పార్టీ ముఖ్య నేతలు వివరించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక సాధికార యాత్ర వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ ఏం మాట్లాడారంటే.. జగనన్న పరిపాలన జనం మెచ్చిన పరిపాలన. 77 సంవత్సరాల స్వతంత్య్ర భారత దేశ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా సామాజిక ధర్మాన్ని పాటించలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక ధర్మం పాటించిన ఏకైక నాయకుడు సీఎం వైయస్ జగన్. ముఖ్యమంత్రి నాయకత్వాన్ని పటిష్టపరుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి పేదలకు – పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధంలో గొంతు గొంతు కలిపి ఏకమై జగనన్నకు అండగా నిలుద్దాం. సామాజిక న్యాయాన్ని ఆచరణలో చేసి చూపించిన జగనన్నకు అండగా నిలబడదాం. టీడీపీ హయాంలో బీసీ అంటే బిజినెస్క్లాస్.. వైయస్ జగన్ పాలనలో బీసీలను సమాజానికి బ్యాక్‌బోన్ క్లాస్‌గా మార్చారు. అలాంటి జగనన్నకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి 175 నియోజకవర్గాల్లో సామాజిక భేరి మోగించబోతున్నాం. మూడు విడతల్లో బస్సు యాత్ర ఉంటుంది. మొదటి విడత ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమల మూడు చోట్ల కూడా రణభేరి మోగించబోతున్నాం. పెత్తందార్ల కోటలను బద్ధలు కొట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలమంతా సంఘటితంగా ముందుకు వెళ్తున్నాం. జగనన్న పాలనలో కేబినెట్ కూర్పు దగ్గర నుంచి 68 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత కల్పించారు. స్పీకర్ స్థానం నుంచి మండలి చైర్మన్.. ఇలా ఒకటి రెండు కాదు.. జనరల్ స్థానాలను సైతం బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు ఇచ్చి గౌరవించిన జగనన్నకు జైజైలు పలుకుతూ సామాజిక సాధికార యాత్రను కొనసాగించనున్నాం. నిజం గెలవాలని చంద్రబాబు సతీమణి యాత్ర చేపడుతున్నారు. నిజం ఈరోజుకైనా గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. పాపం పండింది, అవినీతి బయటపడింది కాబట్టే బాబు రాజమండ్రి జైల్లో ఉన్నాడు. నిజం గెలవాలని కాకుండా చంద్రబాబు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుంటే బాగుండేది. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన పాపాలన్నీ పండాయి కాబట్టే అరెస్టు అయ్యాడు.. బోన్ ఎక్కాడు, బొక్కలోకి కూడా వెళ్లాడు. కాబట్టి పాప పరిహార యాత్ర అని పేరుతో భువనేశ్వరి యాత్ర చేస్తే బాగుంటుంది. భారతదేశంలో సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఏపీ సీఎం వైపు చూస్తున్నారు. రూ.2.31 లక్షల కోట్లు బటన్ నొక్కి లబ్ధిదారులందరి ఖాతాల్లో జమ చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, పార్టీలు లేకుండా ప్రతి గడపకూ సంక్షేమాన్ని అందించారు. జగనన్న బటన్ నొక్కితే ప్రతి గడపలో ఆనందం వెల్లివిరుస్తోంది. మంచి జరిగితేనే మద్దతుగా నిలవండి అని ధైర్యంగా అడుగుతున్నామంటే.. సామాజిక సాధికార యాత్ర బ్రహ్మాండంగా విజయవంతం కాబోతుంది’ అని మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు.