సీఎం వైయస్‌ జగన్‌ దళిత పక్షపాతి

తొలి ఏడాదిలోనే దళితుల కోసం రూ.11,205 కోట్లు ఖర్చు చేశాం

చంద్ర‌బాబుకు కేటాయింపులు, ఖ‌ర్చుల‌కు తేడా తెలియ‌దా..?

ఎస్సీల అభ్యున్నతిపై వర్ల రామయ్య సవాల్‌ను స్వీకరిస్తున్నా..

సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌

విజయవాడ: దళిత సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని, వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఎస్సీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ అన్నారు. ఎస్సీల సంక్షేమంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎస్సీల సంక్షేమంపై టీడీపీ నాయకుడు వర్ల రామయ్య సవాల్‌ను స్వీకరిస్తున్నానని, ఎవరొచ్చినా దళిత సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.  గత రెండ్రోజుల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మంత్రి విశ్వరూప్‌ తీవ్రంగా ఖండించారు. విజయవాడలో మంత్రి విశ్వరూప్‌ మీడియాతో మాట్లాడుతూ.. దళిత సంక్షేమాన్ని విస్మరించిన నాయకుడు చంద్రబాబు అని, తన ఐదేళ్ల పాలనలో సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించాడని, దళిత జాతి అభ్యున్నతిని గాలికి వదిలేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటాయింపులకు, ఖర్చులకు తేడా తెలియకుండా చంద్రబాబు మాట్లాడడం దురదృష్టకరమన్నారు. 2015 నుంచి 2018 వరకు చంద్రబాబు ఎస్సీలకు పెట్టిన ఖర్చు రికార్డులతో సహా ఉందన్నారు. 2015–16లో 5,181 కోట్లు, 2016–17లో 7,314 కోట్లు, 2017–18లో 9,627 కోట్లు, 2018–19 ఎన్నికల సంవత్సరంలో కేవలం 8,888 కోట్లు ఖర్చు చేశాడన్నారు. చివరి సంవత్సరంలో రూ.11,228 కోట్లు కేటాయించి రూ.8,888 కోట్లు ఖర్చు చేసి ఇవాళ రూ.11,288 కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 

గత సంవత్సరం కాలంలో ఆర్థికంగా ఎన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ రూ.11,205.40 కోట్లు సీఎం వైయస్‌ జగన్‌ దళిత సంక్షేమానికి ఖర్చు చేశారని మంత్రి విశ్వరూప్‌ చెప్పారు. నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాలుగు డిజిట్‌లకే పరిమితమయ్యాడని, మొదటి సంవత్సరంలోనే సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఐదు డిజిట్‌లు ఖర్చు చేసిందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఎస్సీల పక్షపాత ప్రభుత్వమన్నారు.  

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 650 ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉండే సంక్షేమ హాస్టళ్లను రద్దు చేశాడని మంత్రి విశ్వరూప్‌ ఫైరయ్యారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే హాస్టళ్లపై సమీక్ష చేసి రూ.300 కోట్లు కేటాయించి స్థితిగతులు మార్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో ఎస్సీల పట్ల టీడీపీ చేసిన వ్యాఖ్యలను ప్రజలెవరూ మర్చిపోలేదని, ఎస్సీలపై టీడీపీ నేతలు చేసిన దాడులను దళిత సమాజం మర్చిపోలేదన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును విశ్వసించే పరిస్థితి లేదన్నారు. 

Back to Top