రాష్ట్రాన్ని అభివృద్ది చేయడానికి కావాల్సింది నలభై ఏళ్ళ అనుభవం కాదు.. మంచి మనసు 

మంత్రి విడ‌ద‌ల ర‌జిని

ప‌ల్నాడు: రాష్ట్రాన్ని అభివృద్ది చేయడానికి కావాల్సింది నలభై ఏళ్ళ అనుభవం కాదు, మంచి మనసు...పట్టుదల, ఇవి మా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఉన్నాయ‌ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని అన్నారు.  పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్ధ ఏర్పాటుచేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి విడదల రజిని మాట్లాడారు. ఆమె ఏమ‌న్నారంటే..
అందరికీ నమస్కారం, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దికి బాటలు వేసిన ముఖ్యమంత్రిగారికి, ఇతర ప్రముఖులకు స్వాగతం. మన రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా అభివృద్దిలో, ఇతర రంగాలలో ముందుంది. దీనికి కారణం మన సీఎంగారు, నా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఐటీసీ సంస్ధ  గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ ప్రారంభిచడం శుభ పరిణామం. ఇందులో స్ధానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడం, అందులో 70 శాతం మహిళలకు అవకాశం ఇవ్వడం మరో మంచి విషయం. ఈ సందర్భంగా దివంగత సీఎం వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డిగారిని మనం గుర్తుచేసుకోవాలి, ఈ ప్రాంతానికి స్పైసెస్‌ పార్క్‌ రావడానికి కేంద్రాన్ని ఒప్పించి సాధించిన ఘనత ఆయనది. ఆయన అడుగుజాడల్లోనే జగనన్న రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి కృషిచేస్తున్నారు. వైద్య, ఆరోగ్యరంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం, అంతేకాదు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో కూడా ముందువరసలో ఉన్నాం, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారు. ఐటీసీ సంస్ధ ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఐటీసీ సంస్ధ రైతుల కోసం ఇతర రాష్ట్రాలలో ప్రవేశపెట్టిన పథకాలను ఇక్కడ కూడా ప్రారంభించాలని వారిని కోరుతున్నా, ఐటీసీ, ఏపీ ప్రభుత్వం మధ్య రానున్న రోజుల్లో మరింత బలమైన బంధం ఏర్పడుతుందని భావిస్తున్నాను. సీఎంగారు పేదరిక నిర్మూలన, నిరుద్యోగంపై ప్రత్యేక దృష్టి సారించారు. జగనన్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. రైతుల సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు విఫలమయ్యారు, అంతేకాదు పారిశ్రామిక అభివృద్దికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని రాష్ట్ర అభివృద్దిని అడ్డుకుంటున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయడానికి కావాల్సింది నలభై ఏళ్ళ అనుభవం కాదు, మంచి మనసు...పట్టుదల, ఇవి మా ముఖ్యమంత్రికి ఉన్నాయి. అందరికీ ధన్యవాదాలు.

Back to Top