చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ప్రతిపక్ష పాత్ర పోషించడంలో టీడీపీ విఫలం

మీడియా పాయింట్‌ వద్ద మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

అమరావతి: చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. గోడవ చేయడమే టీడీపీ సభ్యుల ధ్యేయమని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో టీడీపీ విపలమైందన్నారు. ఉద్యోగాలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని హెచ్చరించారు. మీడియా పాయింట్‌ వద్ద మంత్రి మాట్లాడారు.

సభా సమయాన్ని టీడీపీ సభ్యులు వ్యక్తిగత ఎజెండా కోసం వినియోగించుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు సభకు రాకుండా వారి సభ్యులను పంపించి అల్లరి చేయిస్తున్నారు. సభ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నారు. జాబ్‌ల గురించి మాట్లాడేఅర్హత టీడీపీకి లేదు. 2014లో ఇంటింటికీ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా చంద్రబాబు ఇవ్వలేదు. అందుకే 2019లోచంద్రబాబును ఇంటికి పంపించారు. వైయస్‌ జగన్‌ మాటల మనిషి కాదు..చేతల్లో చూపించే ముఖ్యమంత్రి అని నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే 1.30 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 2.80 లక్షల మందిని వాలంటీర్లుగా నియమించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్‌చేశారు. చంద్రబాబు ఏ ఉద్యోగ కల్పన చేయకుండా యువతను మోసగించాడు. ఇవాళ వైయస్‌ జగన్‌ ఉద్యోగకల్పన చేసిన తరువాత సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం వైయస్‌ జగన్‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇది చూసి ఓర్వలేక టీడీపీ నేతలు సభను అడ్డుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని గ్రాఫిక్స్‌ చూపించారు. ఇవాళ సభ జరగకుండా చూడటమే చంద్రబాబు లక్ష్యం. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే సభకు వచ్చి సభాసాంప్రదాయాలు పాటించి సజావుగా జరిగేలా చూడాలి. శాసన సభ జరిగే సమయంలో ప్రజలు మాకు ఏమైనా ప్రయోజనాలు కలుగుతాయా అని ఆశగా ఉంటారు. వారి కోసం సభలో చర్చిస్తే బాగుంటుంది.
లోకేష్‌ దొడ్డిదారిలో అప్పట్లో మంత్రి అయ్యారు. మండలిలో అడుగు పెట్టారు. ఆయన టీడీపీని భూస్థాపితం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వింత దోరణి గమనిస్తే ప్రతిపక్ష పాత్ర పోషించడంలో టీడీపీ విఫలమైంది. మా ప్రభుత్వం బలహీనవర్గాలకు అనేక మేళ్లు చేస్తోంది. ప్రభుత్వం, సీఎం వైయస్‌ జగన్‌ ప్రోత్సాహకంగా ఉంటోంది. వైయస్‌ఆర్‌ చేదోడు, చేయూత వంటి పథకాల గురించి సభలో చర్చిస్తే టీడీపీ గల్లంతు అవుతుందని భయంతో ఇలా వ్యవహరిస్తున్నారు. టీడీపీ సభ్యుల తీరును పూర్తిగా ఖండిస్తున్నాను. సభా సాంప్రదాయాల గురించి చంద్రబాబు వారి సభ్యులకు చెప్పాలి. 

 

Back to Top