చరిత్రలో నిలిచిపోయేలా వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ

మూడేళ్లలో డీబీటీ ద్వారా 1.50 లక్షల కోట్లను నిరుపేదలకు అందించాం

ప్రజల నమ్మకాన్ని మరింత పెంచేలా ఈ రెండేళ్ల పాలన ఉంటుంది

సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

తాడేపల్లి: చరిత్రలో నిలిచిపోయే విధంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామని చెప్పారు. 4 లక్షల మందికిపైగా ప్లీనరీ సమావేశాలకు వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. పేదవారి జీవితం మార్పు కోసం 2017లో ప్లీనరీ నిర్వహించామని, ప్లీనరీ వేదికగానే నవరత్నాల మేనిఫెస్టోని ప్రకటించామన్నారు. 2019లో 151 స్థానాల్లో వైయస్‌ఆర్‌ సీపీ విజయం సాధించిందని, గడిచిన మూడేళ్లలో 95 శాతం హామీలను నెరవేర్చామన్నారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. మూడేళ్లలో నేరుగా లబ్ధిదారులకు 1.50 లక్షల కోట్లను డీబీటీ ద్వారా సీఎం వైయస్‌ జగన్‌ అందించారని గుర్తుచేశారు. ప్రజల నమ్మకాన్ని మరింత పెంచేలా ఈ రెండేళ్ల పాలన ఉంటుందన్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ ఉంటుందన్నారు. 

రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశాడని మంత్రి వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. చంద్రబాబుకి స్కూళ్లు అంటే నారాయణ, శ్రీచైతన్య మాత్రమే గుర్తుకువస్తాయన్నారు. నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలని చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచన చేశారా..? అని ప్రశ్నించారు. సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలన చూసి ప్రతిపక్షాలు వణుకుతున్నాయని, ఒంటరిగా పోటీ చేయలేక గుంపుగా ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. 
 

Back to Top