ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దు

ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా మాటలు నమ్మి మోసపోవద్దు

దయచేసి ఇప్పటికైనా చర్చలతో సమస్యలు పరిష్కరించుకోండి

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులు ఒక అడుగు ముందుకేసి చర్చలకు వస్తే.. ప్రభుత్వం నాలుగు అడుగులు ముందుకేయడానికి సిద్ధంగా ఉందని, ఉద్యోగులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీలు, ఎల్లో మీడియా మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగమేనని, ర్యాలీలు నిర్వహించినంత మాత్రాన ఎవరూ ఎవరిపై పైచెయ్యి సాధించినట్లు కాదన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మనసుతో పనిచేసే నాయకుడని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధికారంలోకి రాగానే.. ఉద్యోగులకు ఐఆర్‌ 27 శాతం ఇచ్చి ఆదుకున్నారని గుర్తచేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం చేస్తున్న మంచిని గుర్తపెట్టుకోవాలన్నారు. 

ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఉద్యోగులను చూసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఒకటో తేదీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డాయని, వేతనాలు తగ్గినట్టు, ప్రభుత్వం వెనక్కు తీసుకున్నట్టు పే స్లిప్పులో ఉందా..? అని ప్రశ్నించారు. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయి ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గమనించాల్సిన బాధ్యత ఉద్యోగులపై కూడా ఉందని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబు.. నేడు మొసలి కన్నీరు కారుస్తున్నాడని ధ్వజమెత్తారు. 

కోవిడ్‌ ఆంక్షలు ఉన్నాయి.. ఎవరికీ ఇబ్బంది ఉండకూడదని ర్యాలీ వద్దని చెప్పామని, ప్రభుత్వం టైట్‌ చేస్తే ఇంత మంది ర్యాలీలో పాల్గొంటారా..? అని ప్రశ్నించారు. ఉద్యోగులను వేధించాలని, బాధ పెట్టాలని ఈ ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచన చేయదన్నారు. దయచేసి ఇప్పటికైనా చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని ఉద్యోగులను విజ్ఞప్తి చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top