జనవరి నాటికి రామతీర్థం కొండపై ఆలయ నిర్మాణం

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయనగరం: వచ్చే ఏడాది జనవరి నాటికి రామతీర్థం కొండపై శ్రీరాముల వారి ఆలయం నిర్మిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. రామతీర్థం కొండ‌పై కొలువుదీరిన‌ శ్రీరాముడి ఆలయాన్ని మంత్రి వెల్లంపల్లి సందర్శించారు. ఈ సందర్భంగా రామతీర్థం ఆలయ నమూనా చిత్రాన్ని విడుదల చేశారు. కొండపైన ఆలయ నిర్మాణానికి అవసరమైన వసతులు సమకూర్చి అనుకున్న సమయానికి ఆలయం పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఆగమ శాస్త్ర ప్రకారం పలువురు పండితులు, స్వామీజీలను సంప్రదించి వారి సూచనలు, సలహాలు మేరకు శాస్త్రోక్తంగా రూ. 3 కోట్ల వ్యయంతో ఆలయాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పునర్నిర్మాణం చేస్తున్నాం అని చెప్పారు.  అనంతరం అధికారుల‌తో క‌లిసి ఆలయ ప్రాంగణాన్ని, పరిసర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు,  అధికారులు పాల్గొన్నారు. 

Back to Top