ఫ్యాన్ గాలికి సైకిల్ కొట్టుకుపోవాల్సిందే

మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌

ప్రశాంతంగా ఉన్న విజయవాడను నాశనం చేయడానికి చంద్రబాబు, టీడీపీ కంకణం 

ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు చంద్రబాబు

తెలుగు తమ్ముళ్లు.. విజయవాడలో ఉన్నది ఆ నలుగురే

నిన్న వాళ్లంతా నిజాలు మాట్లాడి.. పోట్లాడి.. మధ్యాహ్నానికి ప్యాకేజీతో ఒక్కట‌య్యారు

తాడేపల్లి:  మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు ముందు సైకిల్‌, ఇత‌ర పార్టీలు కొట్టుకుపోతాయ‌ని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న విజయవాడను నాశనం చేయడానికి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు.  ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు చంద్రబాబు. గత 20 నెలలుగా  విజయవాడలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నార‌ని చెప్పారు. సీఎం వైయస్‌ సంక్షేమ పథకాలు, పరిపాలనా విధానంతో పాటు, నగరంలో రూ.600 కోట్లకు పైగా నిధులతో శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నామ‌ని తెలిపారు. వాటిని చూడలేక అటు టీడీపీ నాయకులు, ఇటు చంద్రబాబునాయుడు కళ్లుండి కూడా కబోధిలాగా మాట్లాడుతున్నారని దుయ్య‌బ‌ట్టారు. ఆదివారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడారు.

ఏ ముఖం పెట్టుకుని..:
‘ఎప్పుడు కూడా అమరావతి, రాజధాని అని చెప్పి విజయవాడ నగరంతో పాటు, ఇక్కడి ప్రజలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబునాయుడు. ఇవాళ ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓటు అడగడానికి వస్తున్నారు?. కానీ మేము ఇప్పటి వరకు ఏయే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేశామన్నది ప్రస్తావిస్తూ, ఇంకా ఏమేం చేయబోతున్నామో చెప్పి సగౌరవంగా మేం ఓటు అడుగుతున్నాం. జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు వీళ్లంతా తెలుగుదేశం పార్టీతో కలిసిన దొంగల ముఠా. వీరంతా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంతో కలిసి పని చేసిన వాళ్లే. అందుకే వారికి కూడా ఈ ఎన్నికల్లో విజయవాడలో ఓటడిగే నైతిక హక్కు లేదు’.

ఆ నలుగురు.. ఒక ప్యాకేజీ:
నిన్న చూశాం తెలుగు తమ్ముళ్లు. విజయవాడలో ఉన్నది ఆ నలుగురే. నిన్న వీళ్లంతా నిజాలు మాట్లాడారు. బుద్దా వెంకన్న, బోండా ఉమ, నాగుల్‌మీరా ఫస్ట్‌ టైం నిజాలు మాట్లాడారు అని అనుకున్నా. తెలుగుదేశం పార్టీలో బీసీలు, కాపులు, ఎస్సీలు, మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి , బీసీలను తొక్కేస్తున్నారని చెప్పిన నాగుల్‌ మీరా కానీ, ఇక్కడ కాపులని పక్కన బెట్టి తమ సామాజిక వర్గానికి చెందిన వారికే పెద్ద పీట వేస్తారని చెప్పిన బొండా ఉమా కానీ, రా సెంటర్లో తేల్చుకుందాం అని చెప్పి కేశినేని నాని ఆకారం మీద బుద్దా వెంకన్న మాట్లాడారు. మరలా ఈ దొంగలంతా కలిసి మధ్యాహ్నానికి ప్యాకేజీ మాట్లాడుకుని ఒక్కటై పోయారు. అంటే ప్రజలను అయోమయం చేస్తున్నారా? లేక మీరు అయోమయంలో ఉన్నారా? లేదా ప్రజలను ఇంకా మభ్య పెట్టాలని చూస్తున్నారా?.’
 
ఒక సామాజిక వర్గానికే!:

ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు దుర్మార్గాల గురించి స్వయంగా టీడీపీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఒకే సామాజిక వర్గం నాయకులకు తప్ప, మిగతా వాళ్లకు తెలుగుదేశం పార్టీలో స్ధానం లేదు. దానికి నిదర్శనమే విజయవాడ మేయర్‌ అభ్యర్ధి కేశినేని శ్వేతా చౌదరి కావచ్చు, గుంటూరు మేయర్‌ అభ్యర్ధి కావచ్చు. కేవలం తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లకే చంద్రబాబు టిక్కెట్లు ఇస్తారని స్వయంగా టీడీపీ నాయకులే చెబుతుంటే, దానికి చంద్రబాబు  విజయవాడ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?’.

సమాధానం చెప్పాలి:
నిన్న బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా, బొండా ఉమా విమర్శలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. టిడీపీలో బీసీలను తొక్కేస్తున్నరన్న దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. అలా సమాధానం చెప్పకుండా ఏవో కబుర్లు చెప్పి విజయవాడ ప్రజలను మోసం చేస్తామనుకుంటే... ఇక్కడ ప్రజలు చాలా విజ్ఞులు, చాలా జ్ఞానులు. కాబట్టి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు ఈనెల 10న తప్పకుండా తిప్పి కొడతారు. ఇప్పటికే చాలా మంది చెబుతున్నారు విజయవాడలో మీరు కోట్ల రూపాయలు డంప్‌ చేశారని, కానీ నువ్వు ఎన్ని డబ్బులిచ్చినా లాభం లేదు. నీ సైకిల్‌కు పంక్చర్‌ అయింది. ఫ్యాన్‌ గాలి ముందు సైకిల్‌తో పాటు, ఏ సింబల్‌ను కూడా ప్రజలు గుర్తించరు’.

ఏ ఎండకు ఆ గొడుగు:
చంద్రబాబు ఒకసారి వెనక్కి చూసుకో. నీ చుట్టు ఉన్న వాళ్లకి కూడా జగనన్న సంక్షేమ పథకాలు అందాయి. ఏ ఒక్కరూ నీ మీద అభిమానంతో రావట్లేదు. నీ చుట్టూ ఉన్న వాళ్లు కూడా జగనన్నను ప్రేమించే వాళ్లే అని గుర్తుపెట్టుకో. ఇవాళ రాష్ట్రం యావత్తు కూడా జగనన్నను చూస్తుంటే.. నిన్న విశాఖ వెళ్లి అక్కడో దిక్కు మాలిన డైలాగ్‌లు. ఇవాళ విజయవాడ వచ్చి ఇక్కడో రకమైన మాటలు. ఇంతకు ముందు తెలంగాణాలో ఉన్నప్పుడు జై తెలంగాణా అన్నారు. అంతే కాకుండా తెలంగాణా బిల్లు మీరు పెడతారా?. లేక మీ మెడలు వంచి బిల్లు పెట్టమంటారా? అని కూడా అన్నారు’.

నిన్ను నమ్మే పరిస్థితి లేదు:
విశాఖను అభివృద్ధి చేసింది తానే అని చంద్రబాబు చెబుతాడు. కానీ చంద్రబాబు మోసపూరిత మాటలు ఎవరూ నమ్మరు. ఆయన నీచ రాజకీయాలను సహించే పరిస్ధితి లేదు. విజయవాడలో చిన్న దుర్గమ్మ ఫ్లైఓవర్‌ నిర్మించలేని అసమర్ధుడవి, చేత గాని మనిషివి నీవు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నావు. దుర ్గగుడి ఫ్లైఓవర్‌ మా హయాంలోనే శరవేగంగా నిర్మించాం. అన్ని విధాలుగా దాన్ని హంగులతో ఓపెన్‌ చేశాం. నువ్వున్న 5 ఏళ్లలో ఏం చేశావు?’.

నీ టైమ్‌లో అంతా బాదుడే:
అప్పుడు నువ్వున్న టైంలో నీటి పన్నును పెంచుకోవడానికి ఆదేశాలు ఇచ్చారు. 2018లో 40 నుంచి 100 శాతం పెంచుకోవడానికి జీవో ఇచ్చిన ఘనుడవి నువ్వు. అప్పుడున్న పన్నులు కూడా వంద శాతం పెంచిన ఘనుడవి నువ్వు. ప్రభుత్వంలో నువ్వున్నప్పుడు పన్నులు పెంచుతావా? ప్రతిపక్షంలోకి వచ్చినప్పటికి మేనిఫెస్టో రాస్తావా? నీ దిక్కుమాలిన మేనిఫెస్టో చదివే పరిస్ధితి ఉందా ఇప్పుడు? కుప్పంలో నిన్ను ఛీకొట్టి పొమ్మంటే విశాఖపట్నం, విజయవాడ గల్లీ, గల్లీ తిరుగుతున్నావు. ఒకప్పుడు ఢిల్లీ స్థాయి నాయకుడివి అని చెప్పుకున్న నీవు ఇవాళ గల్లీ నాయకుడిగా కూడా పనికి రాకుండా పోయావు.

ఇంటిని చక్కదిద్దుకో..:
ముందు నీ పార్టీ నాయకుల్ని అదుపు చేసుకో. నీ పార్టీలో నాయకుల్ని కంట్రోల్‌లో పెట్టుకో, మీ కేశినేని నాని నిన్ను ఉతికి ఆరేస్తున్నాడు చూసుకో. కేశినేని నానికి భయపడి ఈ రోజు నువ్వు పార్టీని నడుపుతున్నావు. ఒక ఎంపీకి భయపడి పార్టీని నడుపుతున్న నువ్వు రెండు రాష్ట్రాలకు అధ్యక్షుడివా! అసలు నీకు సిగ్గు లేదా? మరలా ఈరోజు విజయవాడ వచ్చి ప్రచారం చేస్తావా?’.

మా విజయం తథ్యం:
రేపు మార్చి 10న జరిగే ఎన్నికల్లో నగరంలోని మొత్తం 64 డివిజన్లు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం కాబోతున్నాయి. మేయర్‌ పీఠాన్ని కూడా వైయస్సార్సీపీ దక్కించుకోబోతోంది. మీ తెలుగుదేశం నాయకులకు అడ్రస్‌ లేక చివరకు బీఫామ్‌లు కూడా తీసుకునే వాళ్లు లేక ఎక్కడెక్కడివాళ్లనో తీసుకొచ్చి, ఎక్కడెక్కడో నిలబెట్టావు. గత సంవత్సర కాలంలో నువ్వు గానీ, లోకేష్‌ కానీ, చివరకు మీ అభ్యర్ధులు కానీ కరోనా కాలంలో ఎప్పుడైనా ప్రజలను కలిశారా? కరోనా కష్టకాలంలో కనీసం ఒక్కరినైనా ఆదుకున్నారా? సహాయం చేశారా? హైదరాబాద్‌లోని మీ రాజభవనంలో కూర్చుని జూమ్‌ మీటింగ్‌లకే పరిమితం అయ్యారు.

పీకడానికి ఇంకా ఏముంది?:
రేపు మార్చి 10 ఎన్నికల్లో విజయవాడ నగరంలోని మొత్తం 64 డివిజన్లు వైయస్సార్‌సీపీ కైవసం కాబోతున్నాయి. మేయర్‌ పీఠాన్ని కూడా మా పార్టీ కైవసం చేసుకోబోతుంది. మాట్లాడితే చాలు ఏం పీకుతారని అంటావు!. ప్రజలు ఇప్పటికే నిన్ను పీకేశారు. రాష్ట్రంలోనే కాదు, చివరకు నీ సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా తీసి పడేశారు. ఇక మీ అబ్బాయిని కూడా మంగళగిరిలో పీకేశారు. అలా రాష్ట్రమంతా మీ ఉనికి లేకుండా అన్ని చోట్లా జనం మిమ్మల్ని పీకేశారు. అయినా ఇంకేం పీకాలి? ఇంకా పీకడానికి ఏం ఉందక్కడ?. 

నగర జనం భయపడుతున్నారు:
మీ పర్యటన విజయవాడ ప్రజలకు చేదు అనుభవం అనుకోవాలి, ఎందుకంటే చంద్రబాబు అడుగుపెడితే అక్కడ నాశనం అయిపోతుంది.  ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే కరువు వస్తుంది. అటువంటి చంద్రబాబు ఈరోజు విజయవాడ నగరంలో అడుగుపెడుతున్నాడంటే ప్రజలంతా హడలిపోతున్నారు. విజయవాడ నగరానికి ఏ అరిష్టం వస్తుందా అని చెప్పి భయపడుతున్నారు. చంద్రబాబూ విజయవాడలో అశాంతి సృష్టించడానికి కానీ, ప్రజలను బాధపెట్టే పనులు కానీ పొరపాటున కూడా చేయవద్దని విజయవాడ నగర ప్రజల తరపున కోరుకుంటున్నాను. 

మీ రాకతో ఒరిగేదేమీ లేదు:
మీ విజయవాడ నగర పర్యటన అంతా కూడా శూన్యం. మీకు ప్రజలు ఎక్కడా మద్దతు పలికే పరిస్ధితి లేదు. ప్రజలంతా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వైపే ఉన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ ప్రజలు మీకు గుణపాఠం చెప్పడం ఖాయం. మీ పర్యటన వల్ల తెలుగుదేశం పార్టీకి ఒరిగేదేమీ లేదు. ఇప్పటికైనా బొండా ఉమ, నాగుల్‌ మీరా, బుద్దా వెంకన్న విమర్శలకు, వారు చేసిన ఆరోపణలకు మీరు సమాధానం చెప్పాలి. అదే విధంగా నగర వాసులకు కూడా మీరు క్షమాపణ చెప్పాలి.
2018లో నీటి పన్నును 40 నుంచి 100 శాతం పెంచుకోమని ఆనాడు చంద్రబాబు ఇచ్చిన జీవోను మా ప్రభుత్వం పక్కన పెట్టింది. శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. చంద్రబాబులా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా మాట్లాడే రకం కాదు’.. అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

Back to Top