విజయనగరం: రామతీర్థంలో శ్రీరాములవారి విగ్రహం ధ్వంసం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, లభించిన కొన్ని ఆధారాలతో దోషులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు నాయుడు రామతీర్థానికి ఏ మొహం పెట్టుకొని వస్తున్నాడని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఆలయాలను దగ్గురుండి కూల్చివేసిన దుర్మార్గపు చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. రామతీర్థం రావడానికి ముందు తన హయాంలో జరిగిన తప్పును ఒప్పుకొని.. క్షమించమని ప్రజలందరినీ వేడుకోవాలన్నారు.
విజయనగరంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ బురదజల్లడానికే చంద్రబాబు రామతీర్థం వస్తున్నారని మండిపడ్డారు. రామతీర్థంలో ఆలయం కొండ కింద.. విగ్రహం కొండ మీద ఉంటుందని, అర్చకులు మాత్రమే వెళ్లి దీపారాధన చేసి.. నైవేద్యం సమర్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు బట్టి గత వారం రోజుల క్రితమే ఆ కొండపై విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు అమర్చే సమయంలో ఇలాంటి దురదృష్ట సంఘటన జరిగిందన్నారు. దీనిపై పూర్తిగా పోలీసుల విచారణ జరుగుతుంది. కేవలం రాజకీయం చేయడం కోసం.. ఇళ్ల పట్టాల పంపిణీని డైవర్ట్ చేయడానికి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తుందన్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయని, సెల్‌ఫోన్ నెట్‌వర్క్, డాగ్ స్క్వాడ్ అన్నీ చెక్ చేస్తున్నామని, పూర్తి ఆధారాలు లభించే సమయంలో చంద్రబాబు ఎందుకు హడావుడిగా చంద్రబాబు వస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు.