మత్స్యకారులపై టీడీపీ, జనసేనది కపట ప్రేమ

   రాష్ట్ర పశు సంవర్థక, పాడి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

టీడీపీకి బీ టీమ్‌గా జనసేన, చంద్రబాబు దత్తపుత్తుడుగా పవన్‌ కళ్యాణ్‌ పనిచేశారు తప్ప స్వతంత్రంగా వ్యవహరించట్లేదు

ఏటా రూ. 10 వేలు చొప్పున మత్స్యకార భరోసా శ్రీ జగన్ ఇస్తున్నారు. మత్స్యకారులకు చంద్రబాబు చేసిందేమిటి?

మత్స్యకారుడికి నేరుగా డీజిల్‌ సబ్సిడీ ఇస్తున్నాం. ప్రమాదవశాత్తూ మత్స్యకారుడు చనిపోతే. రూ.10 లక్షల పరిహారం అందిస్తున్నాం 

మత్స్యకారులంటే బాబుకు ఎప్పుడూ చులకనే. అందుకే పవన్‌ కళ్యాణ్‌ను ముందుకు నెట్టి డ్రామాలు ఆడిస్తున్నారు

మత్స్యకారులకు చంద్రబాబు చేసిన మోసాన్ని, హేళనగా మాట్లాడిన మాటల్ని మర్చిపోం. ఏనాడూ మత్స్యకారులకు బాబు మేలు చేయలేదు

బాబు హయాంలో మత్స్యకారులకు ఏం చేయలేదని, ఇప్పుడు మేలు జరుగుతోందని తెలిసి కూడా ఈ డ్రామాలు ఏంటి పవన్‌?

పవన్ కళ్యాణ్‌ వస్తే రాష్ట్రంలో నిర్మిస్తున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లను చూపిస్తాను. లేదంటే నాదెండ్ల మనోహరే వెళ్లి పరిశీలించవచ్చు 

మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అందుకే ఫిష్‌ రిటైల్ ఔట్‌లెట్లు, ఫిష్‌ ఆంధ్రా బ్రాండెడ్ ఔట్‌లెట్లు

మత్స్యకార మహిళలకు గౌరవం దక్కేలా చేపల అమ్మకానికి రిటైల్‌ ఔట్‌లెట్లు, మార్కెటింగ్‌ అవకాశాలు కల్పిస్తే జనసేన నేతలు అవహేళనలా? 

నవరత్నాల ద్వారా ప్రతి మత్స్యకార కుటుంబాన్ని ఆదుకునేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారు 

ప్రతి మత్స్యకారుడు చదువుకునేలా, వారికి సొంత ఇల్లు ఉండేలా ప్రభుత్వం చేస్తోంది

మత్స్యకార మహిళలకు గౌరవం వచ్చేలా.. వారి కాళ్లపై నిలబడేలా రిటైల్ ఔట్‌లెట్ ఏర్పాటు చేస్తే అవహేళనలా? 

మత్స్యకారుల కష్టాలు తెలుసు కాబట్టే… మత్స్యకారులకు అన్నివిధాలా అండగా సీఎం వైఎస్‌ జగన్‌

 విశాఖ‌: మత్స్యకారులపై టీడీపీ, జనసేనది కపట ప్రేమ అని రాష్ట్ర పశు సంవర్థక, పాడి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిప‌డ్డారు. మత్స్యకారుల సమస్యల మీద అవగాహన లేకుండా.. ఉన్నట్లుగా జనసేన నాయకులు హడావుడి చేయటాన్ని మంత్రి సీదిరి అప్పలరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పవన్‌ కళ్యాణ్‌ చెప్పాడని కాకినాడలో నాదెండ్ల మనోహర్ సీఎం గారిపై విమర్శలు చేయటంపై మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు.

 గతంలో టీడీపీ హయాంలో మత్స్యకారులకు అన్యాయం జరిగినప్పుడు కానీ, మత్స్యకారులను తోలు తీస్తామని, ఫినిష్‌  చేస్తామని చంద్రబాబు అన్నప్పుడు ఏనాడూ పవన్ కళ్యాణ్‌ స్పందించలేదు. కానీ, ఇవాళ మత్స్యకారులపై జనసేన నాయకులకు ఉన్నట్టుండి ప్రేమ, వాత్సల్యం ఎక్కడ నుంచి వచ్చిందో ఏమిటో అర్థం కావట్లేదని ఈ డ్రామాలు ఏంటని మంత్రి ఎద్దేవా చేశారు. 

 చంద్రబాబుకు మత్స్యకారులతో మాట్లాడటానికి మొహం చెల్లటం లేదు. ఎందుకంటే చంద్రబాబును ఎన్నడూ మత్స్యకారులు నమ్మరు. మత్స్యకారులను చంద్రబాబు దూషించారు. మత్స్యకారుల అభివృద్ధి పట్ల చంద్రబాబు నిర్లక్ష్యం చూపించటంతో ఎవ్వరూ నమ్మటంలేదు. చంద్రబాబు మాటలు గుర్తు వచ్చినప్పుడల్లా బాధ, ఆవేదన కలుగుతోంది. మత్స్యకారుల ముందుకు రావటానికి చంద్రబాబుకు ముఖం చెల్లక జనసేన నాయకులను పంపించారేమో. అది వాస్తవం కూడా. ఇన్నిరోజులు లేని ప్రేమ హఠాత్తుగా ఎలా పుట్టుకొచ్చింది. ఈ ఆలోచన రావటానికి కూడా చంద్రబాబే కారణమని అనుకుంటున్నాము.

 గత చరిత్ర ఒకసారి గమనించినా జనసేన పెట్టినప్పటి నుంచి టీడీపీకి అనుబంధ సంస్థగానే పనిచేసింది. టీడీపీకి బీ టీమ్‌గానే, చంద్రబాబు దత్తపుత్తుడుగా పవన్‌ కళ్యాణ్‌ పనిచేశారు తప్ప ఏ రోజూ కూడా స్వతంత్రంగా వ్యవహరించలేదు. చంద్రబాబు ఆలోచనలే పవన్ చెప్పారు తప్ప ఏరోజు కూడా తన ఆలోచనల్ని ధైర్యంగా చెప్పలేదు. 

 పవన్‌ కళ్యాణ్‌ స్వతంత్రంగా వ్యవహరిస్తే మత్స్యకారులకు ఈ ప్రభుత్వంలో జరిగే మంచిని కూడా గ్రహించాలి. మత్య్సకారులు వెనుకబాటుతనానికి ప్రధాన కారణం విద్యలేక పోవటం. ఈరోజు శ్రీ జగన్ ప్రభుత్వంలో నవరత్నాల వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు. ముఖ్యంగా విద్యావ్యవస్థలో సీఎం తీసుకువచ్చిన మార్పులు వల్ల ప్రతి మత్స్యకారుడు కుటుంబంలోని విద్యార్థినీ విద్యార్థులు బడికి వెళ్తున్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇంగ్లీషు మీడియం వంటివి ప్రవేశపెట్టారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. మిడ్‌ డే మీల్స్‌ ద్వారా చక్కటి భోజనం అందుతోంది. గతంలో మేం అందరం ఎటువంటి వాతావరణంలో పెరిగామో తెల్సు. ఈరోజు స్కాలర్‌షిప్‌లు ఇచ్చి మత్స్యకార పిల్లల్ని సీఎం శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి చదివిస్తున్నారు.

 మత్స్యకారులకు పక్కా ఇళ్లు లేవు. గత ప్రభుత్వాలు గొప్పులు చెప్పుకోవటం తప్ప ప్రతి మత్స్యకారుడుకు ఇల్లు కట్టించాలని ప్రయత్నం చేయలేదు. సీఎం వైఎస్.జగన్ వచ్చిన తర్వాత 32 లక్షల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రతి మత్స్యకారుడు ఇల్లు లేదనే పరిస్థితుల్లో ఉండరు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్‌ గమనించాలి. ఇలా ఒకటేమిటి.. మహిళల అభ్యున్నతి కోసం చేయూత, ఆసరా వంటి పథకాలు అమలవుతున్నాయి. 

  ఏప్రిల్ - మే వస్తే మత్స్యకారులు వేట ఆపేయాలి. గతంలో వేట ఆపేస్తే బోటుకు రూ.4,000 ఇస్తామని అనేవాళ్లు తప్ప ఇవ్వలేదు. ఆ డబ్బుల కోసం మత్స్యకారులు ఎంతో ఆశగా ఎదురు చూసేవాళ్లు. మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఎందుకివ్వలేదని ఏనాడూ చంద్రబాబును  పవన్‌ కళ్యాణ్‌ అడగలేదు. నేడు సాంప్రదాయ మత్స్యకారుడుకు రూ.10,000 ఇస్తుంటే జనసేన నాయకులకు ఎందుకు అంత బాధ, కోపం కలుగుతోందో అర్థం కావటం లేదు. ప్రతి మత్స్యకారుడుకు ఈ ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ అందజేస్తోంది. 

  స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లైనా, రాష్ట్రంలో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్నా ఇప్పటికీ మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. దీనికి కారణం రాష్ట్రంలో ఉన్నది రెండే రెండు హార్బర్లు. ఇది ఏనాడైనా పవన్ గమనించాడా? మత్స్యకారుల కోసం హార్బర్లు నిర్మించమని చంద్రబాబును ఏనాడైనా అడిగారా. అడగలేదు. ఈరోజు మత్స్యకారుల కోసం జిల్లాకో హార్బర్లు కడుతున్నారు. ఇప్పటికే నాలుగు హార్బర్లు పనులు మొదలయ్యాయి. మరో నాలుగు టెండర్‌ ప్రక్రియలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌ వస్తే హార్బర్ పనులు చూపిస్తాను. 

 నాదెండ్ల మనోహర్ కాకినాడ ప్రాంతంలోనే ఉన్నారు కాబట్టి పక్కనే ఉప్పాడ అనే మత్స్యకార గ్రామం ఉంది. అక్కడ హార్బర్ పనులు ఎలా జరుగుతున్నాయో తనిఖీకి వెళ్లండి. పనులు ఎలా జరుగుతున్నాయో తెలుస్తాయి. జనసేన పార్టీ వారు నరసాపురంలో మత్స్య వికాస అనే కార్యక్రమం పెట్టారు. అదే నరసాపురం నియోజకవర్గంలోని బియ్యపుదిబ్బ దగ్గర హార్బర్, ఆక్వా యూనివర్శిటీ కడుతున్నాం. వీటిపై జనసేన నాయకులకు ఏమైనా అవగాహన ఉందా అని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు.

 మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది. ఎవరైనా మత్స్యకారుడు వేటకు వెళ్లి చనిపోతే రూ.10 లక్షలు పరిహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. ఈ విషయమైనా జనసేన నాయకులకు తెల్సా?

  సీఎం వైయ‌స్‌.జగన్‌ మోహన్ రెడ్డి చేపలు అమ్ముకుంటున్నారంటూ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు తక్షణం వెనక్కి తీసుకోవాలని మంత్రి సీదిరి అప్పల్రాజు డిమాండ్ చేశారు. ఈ విషయంలో అనుచితంగా మాట్లాడితే.. మత్స్యకారులను అవమానిస్తున్నట్లు అనుకోవాల్సి వస్తుందని మంత్రి అన్నారు. మత్స్యకారులు ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెల్సు. ఏ గ్రామం, పట్టణానికి వెళ్లినా మత్స్యకార మహిళలు నేల మీద కూర్చొని చేపలు, రొయ్యలు అమ్ముతారు. అపరిశుభ్రమైన వాతావరణంలో చేపలు అమ్మకం సాగించటం చూస్తున్నాం. ఎప్పటికీ ఆ అపరిశుభ్రమైన వాతావరణంలోనే ఉండిపోవాలా? మత్స్యకారులంటే చిన్న చూపేనా? ఎవరో ఒకరు రాకపోరా? మా జీవితాల్లో వెలుగులు నింపకపోతారా అని ఎదురు చూస్తున్న జీవితాలు మావి.అలాంటి సమయంలో సీఎం శ్రీ జగన్ మత్స్యకార మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.  

  చేపలు పట్టేవారికో కార్యక్రమం, చేపలు అమ్మేవారికో కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌.జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చారు. చేపలు అమ్మే మత్స్యకార మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్స్‌ చేయాలని రిటైల్ ఔట్‌లెట్ల నుంచి హబ్స్‌ వరకు ఏర్పాటు చేస్తున్నారు. వారికి సబ్సిడీలు, బ్యాంకుల నుంచి రుణాలు, మార్కెటింగ్ ఎలా చేయాలో ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతోంది. ఇవేమీ పవన్‌ కళ్యాణ్‌కు కనిపించటం లేదా అని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. 

  ఫిష్‌ రిటైల్ ఔట్‌లెట్లు, ఫిష్‌ ఆంధ్రా బ్రాండెడ్ ఔట్‌లెట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని పనికిమాలిన వారని అనుకోవాల్సి వస్తుంది. మత్య్సకార మహిళలు వ్యాపారవేత్తలు కావటం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే ఇష్టంలేదని చెప్పండి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలపై పవన్‌ కళ్యాణ్‌ అవగాహన చేసుకొని స్వతంత్రంగా వ్యవహరించాలని మంత్రి సీదిరి సూచించారు.  

 శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఆషామాషీగా సీఎం కాలేదు. ఊరూవాడా తిరిగి ప్రజల సమస్యలే అజెండాగా, పేద ప్రజల గుండెచప్పుడు విని ఆయన సీఎం అయ్యారు. ప్రతి ఒక్కరి సమస్యా సీఎం వైఎస్.జగన్‌కు తెల్సు. అందుకే సీఎం గారు మత్స్యకారుల కోసం చక్కనైన ప్రణాళికలు రూపొందించారు. శ్రీ జగన్ మోహన్ రెడ్డి వెంట మత్స్యకారులు నడిచారు. దాని ప్రతిఫలం కూడా ఈరోజు మేమంతా పొందుతున్నాం. 

 మత్య్సకారుల అభివృద్ధికి అవసరమైన ప్రతి ప్రణాళికను అమలు చేస్తున్నాం. జనసేనకు వీలైతే మంచి సలహాలు ఇవ్వాలి తప్ప.. సీఎం వైయ‌స్‌.జగన్‌ మోహన్ రెడ్డిని దూషిస్తామంటే ఏ మత్స్యకారుడు కూడా స్వాగతించడు. శ్రీ వైయ‌స్ జగన్ గారిని దూషించటం ద్వారా ఓటమికి చేరువ అవుతారు. అసలు పవన్ కళ్యాణ్‌ గాజువాకలో ఎందుకు ఓడిపోయారో తెల్సుకుంటే మంచిది. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరించటం వల్లే ఆనాడు గాజువాకలో ఉన్న మత్స్యకారులు ఓడించారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

Back to Top