పార్టీలతో సహజీవనమే చంద్రబాబు విజన్‌

పొద్దున కాంగ్రెస్, మధ్యాహ్నం జనసేన, సాయంత్రం కమ్యూనిస్టులు, రాత్రి బీజేపీ

‘మా కులపోడు వ‌ల‌చింది రంభ.. మునిగింది గంగ’ ఇదే ఎల్లోమీడియా తీరు

సహకార డెయిరీలను నిర్వీర్యం చేసింది చంద్రబాబే..

పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

అసెంబ్లీ: హెరిటేజ్‌ అనేది ఒక కంపెనీ, అమూల్‌ అనేది ఒక సంస్థ అని చంద్రబాబు తెలుసుకోవాలని పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సహకార డెయిరీలను ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. అసెంబ్లీలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పుడు మత తత్వ పార్టీ బీజేపీతో పొత్తు మా కొంపముంచిందని, భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోమని చెప్పిన చంద్రబాబు.. 2014లో మళ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకున్నాడని, 2019 వచ్చేసరికి కాంగ్రెస్‌తో కునికాడని, 2019 ఎన్నికల తరువాత టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించాడన్నారు. 

పొద్దున కాంగ్రెస్, మధ్యాహ్నం జనసేన, సాయంత్రం కమ్యూనిస్టులు, రాత్రి బీజేపీతో సహజీవనం చేయడమే విజన్‌ అని చంద్రబాబు అనుకుంటున్నాడని, తాము మాత్రం ఇదొక విస్తరాకుల కట్ట అని అనుకుంటున్నామన్నారు. చంద్రబాబు ఎన్ని చేసినా సరే భుజనా మోయడానికి బలమైన మీడియా సపోర్టు ఉందన్నారు. ‘మా కులపోడు వ‌ల‌చింది రంభ.. మా కులపోడు మునిగింది గంగ’ అని నిరంతరం చంద్రబాబును మోస్తూనే ఉన్నారని మంత్రి అప్పలరాజు చెప్పారు. 

ఈ రాష్ట్రంలో ఉన్న డెయిరీలను పద్ధతి ప్రకారం చంద్రబాబు నిర్వీర్యం చేశాడని, కొన్ని డెయిరీలను ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలుగా మార్చాడని మంత్రి అప్పలరాజు ధ్వజమెత్తారు. విశాఖ డెయిరీ, కృష్ణా, సంగం సహకార డెయిరీలను ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చాడని, చిత్తూరు డెయిరీకి బాబు సొంత మనిషి రాజనర్సింహం అనే వ్యక్తిని చైర్మన్‌గా చేసిన ఆ డెయిరీనీ నిర్వీర్యం చేశాడని చెప్పారు. చిత్తూరు జిల్లా రోజుకు 30 లక్షల లీటర్ల పాల సేకరించే కెపాసిటీ ఉందని, వీటిలో 12 లక్షల లీటర్లను హెరిటేజ్‌ డెయిరీ కలెక్ట్‌ చేస్తుందన్నారు. సొంత డెయిరీ కోసం ప్రభుత్వ సహకార డెయిరీలను చంద్రబాబు నిర్వీర్యం చేశాడని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. 
 

తాజా ఫోటోలు

Back to Top