పురంధేశ్వరి చంద్రముఖిలా మారిపోయారు

మంత్రి అప్పలరాజు 

అమూల్ గ్రాండ్ సక్సెస్..అందుకే పాలవెల్లువపై నాదెండ్ల, ధూళిపాళ ఆరోపణలు 

పార్టీని పవన్‌ అమ్మేశాడని జనసైనికులు గుర్తించాలి

జనసేన పరిస్థితి విచిత్రంగా ఉంది

బీజేపీలో ఉన్న కేడరే పురంధేశ్వరితో విభేదిస్తున్నారు

ఏపీలో మద్యం అక్రమాలు ఉన్నట్లుగా అనిపిస్తే సీబిఐతో విచారణ చేయించుకోవాలి

 తాడేపల్లి:  బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి చంద్ర‌ముఖిలా మారిపోయార‌ని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు విమ‌ర్శించారు. బీజేపీలో ఉన్న కేడ‌రే ఆమెను విభేదిస్తుంద‌ని చెప్పారు.ఏపీలో మ‌ద్యం అక్ర‌మాలు ఉన్న‌ట్లుగా అనిపిస్తే సీబీఐతో విచార‌ణ చేయించుకోవాల‌ని సూచించారు. నాదెండ్ల మనోహర్, ధూళిపాళ నరేంద్ర కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తున్నారు అంటూ   మంత్రి సిదిరి అప్పలరాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు మీడియాతో మాట్లాడారు. 

 మంత్రి  సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే...

కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్న విపక్షాలుః
పశువులు, మిల్క్‌ యూనియన్‌ డైరీల గురించి గత నాలుగైదు రోజులుగా ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏమీలేనిదాన్ని తెరమీదికి తెచ్చి కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇది గత నాలుగున్నరేళ్లుగా జరుగుతున్నదేనని చెప్పుకోవచ్చు. ప్రతిపక్షాలు అదేపనిగా ఒక అబద్ధాన్ని సృష్టించడం.. దాన్ని వారి పచ్చమీడియా పేపర్లు, ఛానెళ్ల ద్వారా విస్తృతప్రచారంలోకి తేవడాన్ని అందరూ గమనిస్తున్న విషయమే. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశామనేది చెప్పుకోలేని విపక్ష పార్టీలు.. ప్రజల్లో ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో భాగంగానే ప్రభుత్వంపై బురదజల్లే విధంగా ఈ అబద్ధాల ప్రచారశైలిని వాడుకుంటున్నారు. టీడీపీ నేతలు గానీ.. జనసేన అధినాయకత్వం ఆరోపించే విషప్రచారాన్ని, వారి ప్రయత్నాల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 

- ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా పశువుల ఆరోగ్యాన్ని చూసి ఆ ప్రాంత అభివృద్ధిని నిర్ధారించవచ్చునని మహాత్మా గాంధీ గారు చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 2019–20 మొదటి బడ్జెట్‌ సమావేశంలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రసంగంలో మహాత్ముని సూచనను గుర్తుచేసి తన విధానాన్ని స్పష్టం చేశారు. ఆమేరకు రాష్ట్రంలో పశుసంవర్థక శాఖను బలోపేతం చేయడంతో పాటు, ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత జగన్‌ గారికే దక్కుతోంది. 

డెయిరీలను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చిన నీచుడు బాబుః
ఈ రాష్ట్రంలో జగన్‌ గారి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కో ఆపరేటివ్‌ డెయిరీలు దాదాపూ నిర్వీర్యమైపోయాయి. దీనికి ప్రధాన కారణం ఆనాటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలేనని ప్రతీ ఒక్కరూ బహిరంగంగా చెబుతారు. టీడీపీ హయాంలో ఈ రాష్ట్రంలో కో ఆరేటివ్‌ డెయిరీలు అసలు ఉన్నాయా..? లేదా..? అన్నట్లు పరిస్థితి ఉండేది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కో ఆపరేటివ్‌ మిల్క్‌ యూనియన్లను చంద్రబాబు పనిగట్టుకుని ఒక్కొక్కటిగా దెబ్బతీశాడు. గుంటూరు, కృష్ణా, విశాఖ మిల్క్‌ యూనియన్‌ల డెయిరీలన్నింటినీ 1996 వరకున్న కో ఆపరేటివ్‌ యాక్ట్‌ స్థానంలో మ్యాక్స్‌ యాక్ట్‌ పరిధిలోకి తెచ్చాడు. ఆయా యూనియన్లకు తన మనుషులనే ఛైర్మన్‌లుగా నియమించి.. వాటిని తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇదే చంద్రబాబు అ మిల్క్‌ యూనియన్‌ డెయిరీలన్నింటినీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలుగా మార్పు చేసుకునేందుకు సులువైన మార్గాన్ని కల్పించాడు. దీంతో చాలా డెయిరీలను కంపెనీ చట్టంలోకి తీసుకెళ్లి తమ సొంత ఆస్తుల్లా గుత్తాధిపత్యం చెలాయించుకునేలా చేశాడు.  

చిత్తూరు డైరీని దెబ్బతీసిన పాపం బాబుదేః
రాష్ట్రంలోని అనేక మిల్క్‌ యూనియన్‌ డైరీలను తాను నియమించిన జిల్లా అధ్యక్షులతోనే ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీలుగా మారిస్తే.. చిత్తూరు జిల్లా విషయానికొస్తే చంద్రబాబు తనదైన మార్కు ప్రతిభను ప్రదర్శించాడు. చిత్తూరు డిస్ట్రిక్‌ మిల్క్‌ యూనియన్‌ పేరిట ఉన్న డెయిరీ దేశంలోనే పేరెన్నిక కలిగినది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికే 5 లక్షల లీటర్ల కెపాసిటీ గల డెయిరీ అది. అలాంటి డెయిరీ ఇప్పుడు ఏమైంది..? అలాంటి పెద్ద డెయిరీని చంద్రబాబు తన స్వార్థానికి బలి చేశాడు. చిత్తూరు డెయిరీని దశలవారీగా దెబ్బతీసే క్రమంలోనే తన సొంత కంపెనీ హెరిటేజీ డెయిరీని అక్కడ నెలకొల్పాడు. చిత్తూరు డెయిరీని నిర్వీర్యం చేస్తూ లిక్విడేషన్‌కు తీసుకొచ్చి పూర్తిగా దెబ్బతీశాడు. ఇది చంద్రబాబు కుట్ర కాదా..? ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వాధినేతలుగా ఉండి.. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజల ఆస్తుల్ని తన స్వప్రయోజనాల కోసం వాడుకుంటారా..? ఇంతకంటే రాజకీయ పాపం మరొకటి ఉండదని చంద్రబాబునాయుడుకు గుర్తుచేస్తున్నాను. 

సంగం డెయిరీ ప్రభుత్వానిదేః
సంగం డెయిరీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఎలా వచ్చింది..? ఆ డెయిరీ ఎవరిది..? అది ప్రభుత్వానిది కాదా..? 1973లో ప్రభుత్వమే స్థాపించింది. ఆ తర్వాత  కో ఆపరేటివ్‌ చట్టం కింద 1977లో గుంటూరు, ప్రకాశం మిల్క్‌ యూనియన్‌ ఏర్పడింది. ఆ సమయంలోనే ప్రభుత్వం సుమారు రూ.57 లక్షలు ప్రజాధనాన్ని ఆ యూనియన్‌కు ఖర్చు చేసింది. 1978లో ఆంధ్రప్రదేశ్‌ మిల్క్‌ డెయిరీ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ కోసమని సుమారు 14.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇదే సంగం డెయిరీకి అప్పగించింది. 1980కి వచ్చేసరికి సంగం డెయిరీకి సంబంధించిన సుమారు 73 ఎకరాలు మిల్క్‌ కమిషనర్‌ పేరిట ఉండేవి.

‘సంగం’ను మింగేసిన ధూళిపాళ్ల నరేంద్రః 
 సంగం డెయిరీ అనేది ఖచ్చితంగా ప్రభుత్వ డైరీ. ధూళిపాళ్ల నరేంద్ర అనే దొంగ సంగం డైరీని అక్రమంగా కబ్జా చేశాడు. సంగం మిల్క్‌ యూనియన్‌లోకి ధూళిపాళ్ల నరేంద్ర వచ్చే అర్హతలు, అవకాశాలే లేవు. ఎందుకంటే, ఆయన పేరిట అప్పటికే ఒక ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఉంది. అలాంటి వ్యక్తి ప్రభుత్వ మిల్క్‌ యూనియన్‌లోకి ఒక సభ్యుడిగా ప్రవేశించే అర్హతేలేదు. కానీ, ఎలాంటి అర్హతలు లేకుండానే ప్రభుత్వ కో ఆపరేటివ్‌ సొసైటీ యూనియన్‌కు అధ్యక్షుడయ్యాడు. తర్వాత జిల్లా మిల్క్‌ యూనియన్‌లో డైరెక్టర్‌ అయ్యాడు. ఆ తర్వాత డిస్ట్రిక్‌ మిల్క్‌ యూనియన్‌కు చైర్మన్‌ అయ్యాడు. చైర్మన్‌ హోదాలో ఉండి కో ఆపరేటివ్‌ యాక్టు కిందనున్న సంగం డెయిరీని మ్యాక్స్‌ యాక్ట్‌లోకి కన్వర్ట్‌ చేశాడు. ఆ తర్వాత సమయం చూసి ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీగా మార్చుకున్నాడు. వాళ్ల నాన్న ధూళిపాళ్ల వీరయ్యచౌదరి పేరిట ఒక ట్రస్టు పెట్టి.. దానికి 10 ఎకరాల డెయిరీ భూమిని బదలాయించుకున్నారు. ఇదే ప్రభుత్వ భూముల్ని బ్యాంకులకు తనఖా పెట్టి రూ.100 నుంచి రూ.150 కోట్లు వరకు రుణాలు తెచ్చుకున్నారు. మరి, ఇంత కుట్ర చేసి ప్రభుత్వ సంస్థ ఆస్తిగా ఉన్న సంగం డెయిరీ.. ధూళిపాళ్ల నరేంద్రకు ఎలా వచ్చింది..? అని అడుగుతున్నాను. చంద్రబాబు సొంత మనిషిగా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర ప్రభుత్వ ఆస్తిగా ఉన్న సంగం డెయిరీని కబ్జా చేశాడు. కనుక, మళ్లీ సంగం డైరీని ప్రజల ఆస్తిగా తీసుకునేందుకు న్యాయపోరాటం చేస్తున్నాం. 

సంగం ఎలా వచ్చిందో సమాధానం చెప్పు..?
సంగం డెయిరీకి సంబంధించి ధూళిపాళ్ల నరేంద్రపై ఏసీబీ కేసులున్నాయి. గౌరవ న్యాయస్థానాలు సంగం డెయిరీని ధూళిపాళ్ల నరేంద్ర ఆస్తిగా డిక్లరేమీ చేయలేదు. అసలు, ప్రభుత్వ భూములపై ప్రభుత్వం ఖర్చు పెట్టి ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ పెట్టి నడుస్తోన్న సంగం డెయిరీ ధూళిపాళ్ల నరేంద్ర సొంత ఆస్తిగా ఎలా మారిందో ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాం. అక్రమాలు, కుట్రలకు పాల్పడిన నేరస్తుడైన ఈ పెద్ద మనిషి తగుదునమ్మా అంటూ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ బురదజల్లుతాడా..? 

హెరిటేజ్‌ను ఆ యాక్ట్‌ పరిధిలోకి తెచ్చే దమ్ముందా..?
ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా కొల్లగొట్టే నైపుణ్యం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులున్నంతగా మరెవరికీ ఉండదు. చంద్రబాబు నేర్పిన విద్యతో ఆ పార్టీ నాయకులంతా ప్రభుత్వ ఆస్తుల కబ్జాల్లో ఆరితేరారు. అమూల్‌ సంస్థ గురించి ఏం తెలుసని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తారు..? ఆమూల్‌ సంస్థకు జగన్‌ గారి ప్రభుత్వం ఎందుకు సపోర్టు చేస్తుందనేది గతంలో అనేకమార్లు చెప్పాం. మరలా సందర్భం వచ్చింది కనుక మేం ప్రభుత్వం తరఫున ఒక మాట చెబుతున్నాం. రాష్ట్రంలోని ప్రయివేటు డెయిరీలతో పాటు చంద్రబాబు హెరిటేజ్‌ కంపెనీకి కూడా ఒక ఛాలెంజ్‌ విసురుతున్నాం. మీరు మీ డెయిరీలను ప్రయివేట్‌ చట్టం నుంచి  కో ఆపరేటివ్‌ యాక్ట్‌లోకి మార్చుకుని వస్తే ప్రభుత్వం తరఫున మీతో ఎంఓయూ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ద్వారా మాకు సపోర్టు చేయాలని మీరు అప్లికేషన్‌లు పెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలనలోకి తీసుకుంటారు. చంద్రబాబుతో పాటు మిగతా ప్రైవేటు డెయిరీలకు ఆ దమ్ముందా..? 

అమూల్‌ గ్రాండ్‌ సక్సెస్‌ ప్రాజెక్టుః
మహిళా సాధికారతకు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇదే విషయాన్ని మేం పదేపదే చెబుతున్నా.. చంద్రబాబుతో పాటు ప్రయివేటు డెయిరీలు, పచ్చమీడియాలో ప్రధానంగా ఈనాడు దినపత్రిక ఇష్టానుసారంగా రాతలు రాస్తుంది. రకర కాల హెడ్డింగులతో పచ్చమీడియా అదేపనిగా ఊదరగొడుతుందంటే, అమూల్‌ డైరీ వలన మహిళా పారిశ్రామికవేత్తలకు మేలు కలుగుతుందనేది అర్ధమౌతుంది. అమూల్‌తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. 

జగనన్న పాలవెల్లువ వచ్చాకే రైతులకు మేలుః
జగనన్న పాలవెల్లువ కార్యక్రమంతో అమూల్‌ రాష్ట్రానికి రాకముందు సంగం డెయిరీ వాళ్లు గేదెపాలు లీటరుకు రూ.58.90 రైతుకిచ్చేవారు. అదే హెరిటేజ్‌ డెయిరీ రూ.58.43లు ఇచ్చేది. ఇప్పటి పరిస్థితి చూస్తే (జగనన్న పాలవెల్లువతో అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం తర్వాత..) సంగం డెయిరీ రూ.69.35పైసలిస్తుంది. హెరిటేజ్‌ డెయిరీ రూ.66.50 పైసలిస్తున్నారు. మిల్క్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ధరల్ని అమూల్‌ రాకముందు ఏడాది, రెండేళ్లకోమారు పెంచేవారు. రైతులు తమ హక్కుల కోసం నిరసన తెలిపే పరిస్థితి కూడా అప్పట్లో లేదు. అప్పట్లో రైతులకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆయా డెయిరీలు ఏది చెబితే అదే శాసనంగా నడిచేది. 

- 2020 నవంబర్‌ 20న ప్రభుత్వం జగనన్న పాలవెల్లువతో అమూల్‌తో ఒప్పందాన్ని అమలు చేస్తే.. అప్పట్నుంచీ రెగ్యులర్‌గా పాల ఉత్పత్తిదారుల కు పాలసేకరణ ధరల్ని పెంచుతూనే ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మిగతా డైరీలు కూడా రైతులకందించే పాల సేకరణ ధరల్ని పెంచక తప్పడం లేదు. అంటే, 2020 నుంచి 2023 నవంబర్‌ మాసం వరకు ఈ మూడేళ్లల్లో 8 సార్లు పాలు సేకరణ ధరల్ని అమూల్‌ సంస్థ పెంపుదల చేసింది. ఇన్నిసార్లు పాలు ప్రొక్యూర్‌మెంట్‌ ధరల్ని రివైజ్‌ చేసిన దాఖలాలు జగనన్న పాలవెల్లువ కార్యక్రమానికి ముందు ఏనాడైనా జరిగిందా..? అని అడుగుతున్నాను. ఇందుకు నారా చంద్రబాబు, నాదెండ్ల మనోహర్‌తో పాటు ధూళిపాళ్ల నరేంద్ర సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాను. 

పాడి రైతులంతా అమూల్ వైపే మొగ్గుః
జగనన్న పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా అమూల్‌ సంస్థ మొదట్నుంచీ ఇప్పటి వరకూ రైతులకు పాల సేకరణకు సంబంధించి అత్యధిక ధరల్ని అందించింది. అమూల్‌ స్థాపనప్పుడు గేదె పాలు లీటరుకు రూ.71.47పైసలు, ఆవుపాలు రూ.34.20పైసలిచ్చాం. అదే ఇప్పుడు గేదెపాలకు రూ.89.76పైసలిస్తున్నాం. ఆవుపాలకు రూ.43.69 పైసలిస్తున్నాం. ఇవి రాష్ట్రంలోని ఇతర ప్రైవేటు డైరీలతో పోల్చితే అమూల్‌ ధరలనేవి అత్యధిక ధరలుగా ఉన్నాయి. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. రైతులంతా అమూల్‌ సంస్థ పట్ల ఆనందంగా ఉన్నారు. ఎలా చూసినా.. హెరిటేజ్‌, ఇతర డెయిరీలు గేదె, ఆవుపాలకు లీటరుకు రూ.5 నుంచి రూ.20ల వరకు అమూల్‌ కన్నా తగ్గించి ఇస్తున్నారు. అందుకే, రైతులంతా అమూల్‌ డెయిరీ వట్ల మొగ్గుచూపుతున్నారు. 

పాడి రైతులకు రూ.4,940 కోట్లు అదనపు లబ్ధిః
రాష్ట్రంలో ఇప్పటివరకు 3.73 లక్షల మంది మహిళా రైతులుండగా,  4,113 మహిళా కో ఆపరేటివ్‌ సొసైటీల నుంచి సగటున రోజుకు 2.73 లక్షల లీటర్లు పాలు అమూల్‌ ద్వారా సేకరిస్తున్నాం. దీనికి సంబంధించి మహిళా రైతులకు ఇప్పటి వరకు రూ.511 కోట్లు చెల్లింపులు చేశాం. అమూల్‌తో పాటు మిగతా ప్రైవేటు డెయిరీలు పాల సేకరణ ధరల పెంపుదలతో రైతులకు కలిగిన అదనపు లబ్ధి రూ.4,940 కోట్లుగా ఉంది. అంటే, అమూల్‌ సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం విజయవంతమైనట్లే కదా..? రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రభుత్వం ఈమేరకు కృషిచేస్తుంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు టీడీపీ, జనసేన కళ్లల్లో ఎందుకు నిప్పులు పోసుకుంటున్నట్లు..? అని ప్రశ్నిస్తున్నాను.

సొంత బ్రెయిన్ వాడితే నిజాలు తెలుస్తాయిః
నాదెండ్ల మనోహర్‌ పేరుకు జనసేన పార్టీలో ఉన్నప్పటికీ.. ఆయన రిలీజ్‌ చేసే ప్రకటనలేమో టీడీపీ నుంచి అందుతున్నాయేమో. ఒకపక్కన తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు అంటారు. మరో వైపు ఆంధ్రకొచ్చేసరికి టీడీపీ నుంచి వచ్చిన స్క్రిప్టును బట్టీబడుతూ వారి చేతుల్లోనే ఇమిడిపోతున్నారు. నాదెండ్ల మనోహర్‌ సొంత బ్రెయిన్‌ వాడితే నిజాలు తెలుస్తాయి. జగన్‌ గారు ముఖ్యమంత్రిగా ఒక యజ్ఞంలా కొనసాగిస్తోన్న సంక్షేమ కార్యక్రమాల్లో ఆసరా, చేయూత  విజయవంతంగా అమలవుతూ మహిళా సాధికారతకు బాటలు వేస్తోంది. జగనన్న చేయూత కింద ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,92,911 పశువులను మహిళలతో కొనుగోలు చేయించడం జరిగింది. ఈ వాస్తవాన్ని గమనించాలని, మహిళలకు పశుసంవర్ధక శాఖ నుంచి ఏమీ అందలేదంటున్న మనోహర్‌కు ఈ విషయాన్ని గుర్తుచేస్తున్నాను. మహిళా సాధికారత విషయంలో మీ మాటలు మహిళల్ని, ప్రభుత్వాన్ని అవమానించే విధంగా ఉన్నాయని.. కనుక మీ మాటల్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. 

పవన్ సెన్స్ బుల్ పర్సన్ కాదుః
 పవన్‌కళ్యాణ్‌ రాజకీయంగా సెన్స్ బుల్‌ పర్సన్‌కాదు. పూటకో మాట రోజుకో నాటకంలా.. ఆయన వ్యవహరించడం ప్రజలంతా చూస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఆనాడు ఐవైఆర్‌ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి..?’ పుస్తకాన్ని ఆవిష్కరించింది పవన్‌కళ్యాణ్‌ కాదా..? గూగుల్‌లో వెదికితే అసలు నిజం తెలుస్తోంది. మరి, ఈరోజు అదే అమరావతి పవన్‌కళ్యాణ్‌కు ముచ్చటైన వేదికగా కనిపిస్తుందా..?. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు.. ఆయన చేసిన పాపాలే ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌నూ చుట్టుముడుతున్నాయి. ఈరోజు చంద్రబాబు మీద ఈగ వాలనీయకుండా.. సొంతకొడుక్కి లేని నొప్పి పవన్‌కళ్యాణ్‌కు కలుగుతుంది కనుకే ఆయన్ను దత్తపుత్రుడు అని మేం అంటున్నాం.పార్టీని పవన్  అమ్మేశాడని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తించాలి. 

చంద్రముఖిలా పురంధేశ్వరిః
ఏపీలో మద్యం బ్రాండ్లను పురంధేశ్వరి టేస్ట్ చేస్తున్నారమే తెలియదు గానీ.. ఇప్పుడు ఉన్న బూమ్ బూమ్ .. గవర్నర్ చాయిస్ ఇవన్నీ చంద్రబాబు పర్మిషన్ తో వచ్చినవే. కాబట్టి, పురంధేశ్వరి వెళ్ళి చంద్రబాబునే ప్రశ్నించాలి. ఆమె చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును పట్టుకుని రాజకీయాలు చేయకూడదు. ఆమె బీజేపీలోకి వచ్చి, చంద్రబాబుకు వంత పాడటం మొదలెట్టాక ఆమె పరువు దిగజారిపోయింది. బీజేపీలో ఉన్న క్యాడరే పురంధేశ్వరితో విభేదిస్తున్నారు. పురంధేశ్వరికి టీడీపీపై మమకారం ఉంటే.. ఆమె ఆ పార్టీలో వెళ్లి చేరవచ్చు. పురంధేశ్వరి మాటలు చూస్తే.. ఆమె  పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిందనిపిస్తుంది. దాంతో ఆమె విలువ పోయింది.  

Back to Top