రానున్నవి టీడీపీకి సమాధి కట్టే ఎన్నికలు

మంత్రి సీదిరి అప్పలరాజు

వెన్నుపోటు, నమ్మకద్రోహమే చంద్రబాబు పెట్టుబడి

చంద్రబాబు ఎన్ని డ్రామాలాడినా జనం నమ్మరు

చంద్రబాబులా వైయస్‌ జగన్‌ ఎప్పుడూ సానుభూతి రాజకీయం చేయలేదు

తాడేపల్లి: చంద్రబాబు తొలిసారి నిజం మాట్లాడారు..  2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు..టీడీపీని సమాధి కట్టే ఎన్నికలని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.
తులసీ తీర్థం పోస్తే తప్ప బతకను అన్నట్లుగా చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. పనిలో పనిగా తన భార్యను కూడా రాజకీయాల్లోకి లాగారు. భార్యను అడ్డం పెట్టుకుని సానుభూతి పొందాలనుకోవడం దారుణమన్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతాడని మండిపడ్డారు. చంద్రబాబు ఏడుపులు, గగ్గోలు చూసి జనం నవ్వుకుంటున్నారని చెప్పారు. వికేంద్రీకరణను పక్కదారి పట్టించేందుకే కర్నూలులో చంద్రబాబు పర్యటన చేశారని తప్పుపట్టారు. కర్నూలులో హైకోర్టుకు చంద్రబాబు వ్యతిరేకమా? కాదా?. హైకోర్టు కర్నూలులో పెట్టడానికి చంద్రబాబు వ్యతిరేకమన్నారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు.

 

టీడీపీకి సమాధి కట్టే ఎన్నికలవి:
            చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారిపై అనేక విమర్శలు చేశారు. కానీ ఆ పర్యటనలో అబద్ధాలే ఊపిరిగా బతికే చంద్రబాబు నాయుడు తన జీవితంలో మొట్టమొదటి సారిగా ఒక నిజాన్ని మాట్లాడారు. 2024 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబునాయుడు ఒప్పుకున్నారు. మేము కూడా అదే చెప్తున్నాము. 2024 ఎన్నికలు చంద్రబాబుకు చిట్టచివరి ఎన్నికలే. అవి తెలుగుదేశం పార్టీకి సమాధి కట్టే ఎన్నికలు. చంద్రబాబు అనే వ్యక్తికి ఈ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేసే ఎన్నికలని మేము కూడా భావిస్తున్నాం. "రాజకీయంగా నేను పాడె ఎక్కి ఉన్నాను..మీరు నాకు తులసి తీర్థం పోస్తే తప్ప నేను బతకను, నన్ను ఎలాగైనా బతికించండి.." అంటూ చంద్రబాబు కన్నీళ్లతో ప్రాధేయపడుతున్నాడు. 

కుటుంబసభ్యులైనా బాబును వారించాలిః
            ఇదే తడవుగా చంద్రబాబు సానుభూతి డ్రామా కోసం... తన భార్యను మళ్లీ రాజకీయాల్లోకి లాగుతున్నాడు. అనేక మంది, మీ ఆవిడకు అసెంబ్లీలో ఏం అన్యాయం జరిగింది అని అడిగనప్పుడు ఏమైనా చెప్పగలిగావా..?. మహిళల్ని అడ్డుపెట్టుకుని ఇంకా ఈ దిగజారుడు రాజకీయాలు చంద్రబాబు ఇంకెంతకాలం చేస్తాడు..?. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు అనే నానుడి ఎలాగూ ఉండనే ఉంది. దాన్ని ఆయన మరోసారి రుజువు చేశాడు. మళ్లీ తన భార్య భువనేశ్వరి గారిని మరో మారు రాజకీయాల్లోకి లాగి సానుభూతిని పొందాలని చూడటం మరింత దిగజారుడుతనం. అసలు చంద్రబాబును వారి కుటుంబ సభ్యులైనా వారిస్తారా లేదా? అనే అనుమానం  వస్తుంది.  అసెంబ్లీలో అసలు తన భార్యకు ఎటువంటి అవమానం జరగకపోతే.. ఏదో జరిగిందని,  ఎందుకు ప్రపంచమంతా పబ్లిసిటీ చేస్తున్నావంటూ వారి కుటుంబ సభ్యులు అయినా ఎందుకు వారించడం లేదో అర్ధం కావడం లేదు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు ఆపాలి. ఆయన నీచ రాజకీయాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మీ ఏడుపులు, మీ చేతకానితనం, మీ అసమర్థత, మీ ఫ్రస్టేషన్, మీ దిగజారుడుతనం చూసి.. వీధి రౌడీలు కూడా మాట్లాడలేని భాష మాట్లాడుతున్న మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారనేది చంద్రబాబు గుర్తించాలి. 

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బాబు వ్యతిరేకం:
        చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలోని అంతరార్ధం వికేంద్రీకరణకు-మూడు  రాజధానులకు వ్యతిరేకంగా చేస్తున్నదే. అమరావతిలో ఉన్న తన మనుషుల కోసం చంద్రబాబు చేస్తున్న పర్యటన ఇది. మొన్నటి వరకూ ఉత్తరాంధ్ర పై పడ్డాడు. భూకబ్జాలన్నారు.. భూకంపాలొస్తున్నాయి.. విశాఖ మునిగిపోతుంది.. అంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశాడు. విశాఖ రాజధానిగా పనికిరాదు.. అక్కడ అభివృద్ధి జరగకూడదు.. ఉత్తరాంధ్ర ఎప్పటికీ వెనుకబడిన ప్రాంతంగానే ఉండాలని విషప్రచారం చేశాడు. ఇప్పుడు రాయలసీమ వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నాడు.  కర్నూలుకు హైకోర్టు రానివ్వకుండా, సీమకు న్యాయ రాజధాని రానివ్వకుండా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే, కర్నూలులో హైకోర్టు పెట్టడానికి  అనుకూలమా.. వ్యతిరేకమా అనేది స్పష్టంగా అదే కర్నూలు జిల్లాలో చెప్పాలి. కర్నూలులో హైకోర్టు పెట్టడానికి చంద్రబాబు వ్యతిరేకం అనేది వాస్తవం. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే డొంకతిరుగుడు లేకుండా నేను కర్నూలులో హైకోర్టు పెట్టడానికి వ్యతిరేకం అని చెప్పాలి. అలా చెప్తే అక్కడి ప్రజలు చంద్రబాబును తన్ని తరిమేస్తారు.

బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో హైకోర్టు మారుస్తున్నపుడు ఇక్కడెందుకు మార్చకూడదు..?:
        బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఇటీవలే హైకోర్టును మార్చడానికి అసెంబ్లీలో తీర్మానం చేశారు. అక్కడ రాజధానిలో కాకుండా నైనిటాల్‌లో హైకోర్టు ఉంది. అక్కడి నుంచి హల్ద్వానికి మార్చుకోడానికి ఆ రాష్ట్రం ఇటీవల తీర్మానం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఉత్తరాఖండ్‌ చేసిన తీర్మానానికి మద్దుతు పలుకుతుంది. అక్కడ హైకోర్టు మార్చుకున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు మార్చుకోకూడదు..? కేంద్ర ప్రభుత్వం సైతం పలుమార్లు రాష్ట్ర రాజధాని విషయంలో..  కేంద్రం జోక్యం ఉండదు. మా పాత్ర శూన్యం అని స్పష్టంగా చెప్తూనే ఉంది.  ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ చెప్పినట్లు రాజధానుల వికేంద్రీకరణ కచ్చితంగా అమల్లోకి వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. చంద్రబాబు లాంటి వ్యక్తులు ఎన్ని సానుభూతి డ్రామాలు ఆడినా..  శ్రీ వైఎస్‌ జగన్‌ వెంట్రుక కూడా పీకలేరని స్పష్టంగా చెప్తున్నాను. 

చంద్రబాబు పుట్టుకే 420:
        ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి గారిని పట్టుకుని వీధి రౌడీలు కూడా మాడ్లాడలేని బాషను చంద్రబాబు మాట్లాడుతున్నాడు. మా నాయకుడు వైయ‌స్ జ‌గన్ మోహన్ రెడ్డిగారిని చంద్రబాబు ఏం పీకగలడు..?. శ్రీ వైయ‌స్‌ జగన్‌ గారి వ్యక్తిత్వానికి చంద్రబాబు వ్యక్తిత్వానికి చాలా తేడా ఉంది. వెన్నుపోటు, నమ్మకద్రోహమే పెట్టుబడిగా పెట్టి చంద్రబాబు రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చాడు. నమ్మిన వారిని అథఃపాతాళానికి తొక్కేసిన నైజం చంద్రబాబుది. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకి, తన మార్క్ గా చెప్పుకోడానికి ఒక్కటంటే ఒక్క పథకం కూడా లేదు. అవకాశం దొరికితే, మైకులు కనపడితే చాలు.. " సెల్‌ ఫోన్‌ నేనే కనిపెట్టాను...సత్యా నాదెళ్లకు నేనే ఉద్యోగం ఇప్పించాను.. సానియా మీర్జాకు, పీవీ సింధూకు నేనే ఆట నేర్పించాను" అంటూ చెప్పుకుంటూ తిరుగుతాడు. చంద్రబాబు పుట్టుకే ఒక 420. 

బాబే కాదు.. ఆయన బాబులు కూడా టచ్ చేయలేరు:
            కాంగ్రెస్-టీడీపీ ఏకమై కుట్రలుపన్ని జగన్ గారిపై అక్రమ కేసులు పెట్టినప్పుడు.. వాటన్నింటినీ జగన్‌ గారు ఒక సమర్థవంతమైన నాయకుడిలా ఎదుర్కొన్నారే తప్పితే చంద్రబాబులా అరచి గగ్గోలు పెట్టలేదు. మీడియా ముందుకు వచ్చి ఏడవలేదు. మరోవైపు పచ్చ మీడియా..  జగన్‌ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ అడ్డగోలు రాతలు రాసినా, చంద్రబాబులా ఎక్కడా బెంబేలెత్తిపోలేదు. తనపై తప్పుడు కేసులు పెట్టి, తన కుటుంబాన్ని వీధికి లాగినప్పుడు కూడా జగన్‌ గారు చంద్రబాబులా ఎప్పుడూ బేల మాటలు మాట్లాడలేదు. సానుభూతి కోసం చూడలేదు. వీటన్నిటినీ మించి సంతలో పశువుల్లా చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా, పార్టీని నిర్వీర్యం చేయాలని చూసినా,  ఏ రోజూ జగన్‌ గారు భయపడలేదు. అదే సహనం, అదే చిరునవ్వుతో జగన్ గారు హుందాగా రాజకీయం చేశారు. ఏ పార్టీతో పొత్తులు లేకుండా, ప్రజల కోసం ఒక్కడిగానే పోరాటం చేసి, ఒక్కడిగానే అధికారంలోకి వచ్చిన వ్యక్తి శ్రీ వైఎస్‌ జగన్‌. ఆయన వ్యక్తిత్వాన్ని సవాలు చేసే స్థాయి చంద్రబాబుకు లేదు. చంద్రబాబు కాదు కదా..  ఆయన బాబులు కూడా శ్రీ జగన్‌ గారిని టచ్ చేయలేరు. చంద్రబాబు పూర్తిగా మాటలపై నియంత్రణ కోల్పోయి ఏమి చేయాలో చేతకాక ఫ్రస్టేషన్‌లో నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నాడు. ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే.. కన్న కొడుకు పప్పులా తయారయ్యాడని, మరోవైపు పార్టీ భూస్థాపితం అయిపోతుందన్న బాధతో  మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. 

ముందే ఓటమిని అంగీకరించిన బాబుః
        ఎన్నికలకు ఏడాదిన్నర ముందే చంద్రబాబు తన ఓటమిని అంగీకరించాడు. 2024 ఎన్నికల యుద్ధంలో ముందే  కాడి పారేశాడు. ముమ్మాటికీ చంద్రబాబుకు ఇవే చిట్టచివరి ఎన్నికలు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఈ రాష్ట్రానికి ఫలానా మంచి చేశానని, ఫలానా వర్గాలకు మేలు చేసే పని ఒక్కటైనా చంద్రబాబు చెప్పగలడా..? . టీడీపీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతిని తొక్కిపెట్టి, కేవలం చంద్రబాబు తన సామాజిక వర్గానికి మాత్రమే మేలు జరిగేలా కృషి చేశాడు. 

175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పగలవా బాబూ..?:
            ప్రధాని నరేంద్రమోడీ తనను పొగిడారని సిగ్గులేని మాటలు చంద్రబాబు ఎలా మాట్లాడగలుగుతున్నారో ఆయనకే తెలియాలి. అసలు డ్వాక్రా సంఘాలను..  పీవీ నరసింహరావు ప్రవేశపెడితే, వాటికి రాష్ట్రంలో పునర్జీవం తీసుకొచ్చింది డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు మాత్రమే. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తానని, మహిళలు బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారాన్ని తిరిగి ఇంటికి తెచ్చిస్తానని, 2014 ఎన్నికల ముందు పదే పదే చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఒక్క డ్వాక్రా మహిళలనే కాకుండా వ్యవసాయాన్ని ముంచింది చంద్రబాబు. నిరుద్యోగులను, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మోసం చేసింది చంద్రబాబు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నది చంద్రబాబు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన వ్యక్తి చంద్రబాబు. ప్రాంతాలవారీగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది చంద్రబాబు. చంద్రబాబు ప్రజలకు ఏం మంచి చేశాడని ఆయనకు ఓటు వేయాలని నేను ప్రశ్నిస్తున్నా. ఇలాంటి వ్యక్తులకు రాజకీయాల్లో కొనసాగే అవకాశం ఇవ్వకూడదు. చంద్రబాబు తన హయాంలో, రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మంచి చేశానని నమ్మితే రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలి. పార్టీ లేదు. బొక్కా లేదన్న అచ్చెన్నాయుడు మాటలకు బలం చేకూరుస్తూ.. ఇవే చిట్టచివరి ఎన్నికలని చంద్రబాబు అంగీకరించాడు. 

పిచ్చిపిచ్చి మాటలు మానుకోకపోతే బాబుకు పుట్టగతులుండవ్..:
        చంద్రబాబునాయుడు హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలి. తిట్టడం మాకు రాదనుకోవద్దు... మేము తిట్టడమే కాదు.. తాట కూడా తీయగలం. 2024 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు గుండెల్లో గునపం దింపడం ఖాయమని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మానుకోవాలని హితవు పలుకుతున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారి గురించి చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. రాష్ట్రంలో ఎక్కడా పుట్టగతులు లేకుండా చేస్తాము. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబును చీదరించుకున్నారు. రాయలసీమలో ఎప్పుడో బిషానా ఎత్తేశాడు. ఇక శాసన రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా చంద్రబాబుకు ప్రజలు స్థానం లేకుండా చేస్తారు. కేవలం, తన సామాజికవర్గం వారి భూముల ధరల కోసం,  29 గ్రామాల కోసం గుంటూరు, విజయవాడ ప్రజలను కూడా చంద్రబాబు మోసం చేస్తున్నాడు. 

అది బాబుకే బాదుడు..!
             గడప గడపకు ప్రభుత్వం అనేది ఒక గొప్ప కార్యక్రమం. సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులు ప్రజల వద్దకు వెళ్తారు. ఆ సాంప్రదాయానికి భిన్నంగా మేము, ఎన్నికలకు సంబంధం లేకుండా ఇంటింటికీ వెళ్తున్నాం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభం నుంచీ ప్రజల మధ్య ఉన్న పార్టీ. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారు కూడా ప్రతి గడపకు వెళ్లి ప్రజల గుండె చప్పుడు విన్నారు. దానికి అనుగుణంగానే అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్నాం. రాజకీయాలకు, కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతోంది. దాన్ని తట్టుకోలేక చంద్రబాబు బాదుడే బాదుడు అనే కార్యక్రమం పెట్టారు కానీ, ఆ కార్యక్రమం ఆయనకే బాదుడే బాదుడు అవుతుందని గ్రహించలేకపోతున్నాడు. 

మెంటల్ గా బాబు నాట్ ఫిట్
        చంద్రబాబు శారీరకంగా ఫిట్‌గా ఉండటం కాదు... ఒక సారి ఆయన తన మానసిక స్థితిని చెక్‌ చేయించుకోవాలని నా మనవి. మెంటల్ గా ఆయన ఫిట్ గా లేడు అన్నది ఆయన మాటల్లోనే కనిపిస్తుంది.  మోదీ గారు డ్వాక్రా సంఘాలు భేష్‌ అన్నాడని తనకు తాను సర్టిఫికెట్‌ ఇచ్చుకుంటున్నాడు.. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడా ఆ మాట అనలేదు. ఎవరూ వినలేదు కూడా. దీన్ని బట్టే ఆయన మానసిక స్థితిని అర్ధం చేసుకోవాలి. ఒక రకమైన ఊహాజనితమైన ప్రపంచంలో ఉండే వారు మాట్లాడే మాటలు అవి. 

- వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారని ఎవరు చెప్పారు..? పచ్చ మీడియా ఎక్కడైనా దాక్కుని విన్నాదా..? మొన్నటి కార్యకర్తల మీటింగులో కూడా 16 నెలలల్లో ఎన్నికలని  ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌ చెప్పారు. ఇవన్నీ ఎందుకు,  ఎప్పుడు ఎన్నికలు జరిగినా 175 స్థానాల్లో పోటీ చేస్తానని, గెలుస్తానని చంద్రబాబును చెప్పమనండి. 

- చంద్రబాబును చూసి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ భయపడేదే లేదు. న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తే అక్కడికి వెళ్లి చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడితే... రాయలసీమ ప్రజలు ఊరుకోరు. రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తే ప్రజలు తీవ్రంగా స్పందిస్తారు. అక్కడ న్యాయ రాజధాని వద్దని చెప్పడానికి చంద్రబాబు ఎవరు...? ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు వెళ్లి రెచ్చగొట్టి,  తిరిగి నాపై రాళ్ల దాడి చేశారని సానుభూతి మాటలు మాట్లాడటం చంద్రబాబుకు మంచిది కాదని మంత్రి సీదిరి అప్పలరాజు వివరించారు. 

Back to Top