విజయవాడ: ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మడానికి జనం పిచ్చోళ్లు కాదన్నారు మంత్రి ఆర్కే రోజా. తమతో ఉంటున్నదెవరో.. తమ సమస్యల కోసం పోరాడిందెవరు.. అధికారంలోకి వచ్చాక పరిష్కరించిందెవరో ప్రజలకు తెలుసు. ఇచ్చిన హమీలు నెరవేర్చిన నేతలు వైఎస్సార్, వైఎస్ జగన్ అని రోజా పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. ఇక్కడే ఓటు.. ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజల మధ్య ఉంటున్న ప్రజా నాయకుడు జగనన్న’’ అని ఆమె కొనియాడారు. ‘‘రాజన్న రాజ్యం తెస్తానని పావురాల గుట్టలో జగనన్న తన తండ్రికి ప్రామిస్ చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. కేసులు పెట్టి జైల్లో పెట్టినా.. ఏరోజు తలొగ్గలేదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఏ పార్టీలో విలీనం చేయలేదు. అదీ నాయకుడి లక్షణం. పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి.. ప్రజలు ఛీ కొడితే.. ఇక్కడకొచ్చి కాంగ్రెస్‌లో చేరి మాట్లాడితే ప్రజలు నమ్మరు’’ అంటూ రోజా దుయ్యబట్టారు. ‘‘కాంగ్రెస్‌కు ఏపీలో ఓటు అడిగే అర్హత లేదు. బాగున్న రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పార్టీ కాంగ్రెస్. రెండు సార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్ పేరును ఆయన చనిపోయాక ఎఫ్ఆఐర్‌లో పెట్టి అవమానించిన పార్టీ కాంగ్రెస్. వైయస్సార్ లేని సమయం చూసి ఆయన కుటుంబాన్ని రోడ్డుకీడ్చింది కాంగ్రెస్. ఆ పార్టీలోకి వచ్చి ఎవరు విమర్శలు చేసినా జీరోలే అవుతారు. సామాన్య కార్యకర్తను కూడా తన కుటుంబ సభ్యుడిగా చూసే వ్యక్తి సీఎం వైయస్ జగన్. ఇష్టానుసారంగా మాట్లాడే నోర్లకు 2024 సమాధానం చెబుతుంది’’ అని మంత్రి రోజా పేర్కొన్నారు.