కుప్పం అయినా, నగరిలో అయినా చర్చకు చంద్రబాబు సిద్ధమా..?

సెల్ఫీ నీతో దిగుతారో.. నాతో దిగుతారో తేల్చుకుందాం

చంద్రబాబుకు మంత్రి ఆర్కే రోజా బహిరంగ సవాల్‌

సెల్ఫీలతో చంద్రబాబు సెల్ఫ్‌ గోల్‌ వేసుకుంటున్నాడు

ప్రతి ఇంటి మీద జగనన్న స్టిక్కర్లు చూసి బాబుకు గుండె మీద ఎగేసి తన్నినట్టుంది

చంద్రబాబు ఫెయిల్యూర్‌ పొలిటీషియన్‌.. బాబు రాజకీయమతా వెన్నుపోటుతోనే

మెగా పీపుల్స్‌ సర్వే చేపట్టిన దమ్మున్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌

ఎన్నికల్లో ఇచ్చిన 98.4 శాతం హామీలను జగనన్న నెరవేర్చారు

ప్రజలంతా ‘జగనన్నే మా భవిష్యత్తు’ అని ముక్తకంఠంతో నినదిస్తున్నారు

తాడేపల్లి: ‘మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. మెగా పీపుల్స్‌ సర్వేకు ప్రజల నుంచి స్వచ్ఛందంగా మద్దతు లభిస్తోంది. ఇంటింటికీ జగనన్న స్టిక్కర్‌ చూస్తుంటే చంద్రబాబుకు గుండెల మీద ఎగేసి తన్నినట్టుగా ఉంది’ అని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సెల్ఫీలతో చంద్రబాబు సెల్ఫ్‌ గోల్‌ వేసుకుంటున్నాడన్నారు. ‘నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో ఎన్ని హామీలు నెరవేర్చావ్‌.. మా పార్టీ మేనిఫెస్టోలో ఎన్ని హామీలు నెరవేర్చామో చర్చించేందుకు చంద్రబాబు గెలిచిన కుప్పంలో అయినా సరే, నేను గెలిచిన నగరిలో అయినా సిద్ధమా’ అని సవాల్‌ విసిరారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఆర్కే రోజా మాట్లాడారు. 

‘‘మెగా పీపుల్స్‌ సర్వే చేపట్టేందుకు దమ్ముండాలి. దమ్మున్న నాయకుడు వైయస్‌ జగన్, ఆయన నేతత్వంలో ఉన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలను సీఎం వైయస్‌ జగన్‌ 98.4 శాతం అమలు చేశారు. నాలుగేళ్ల పాలన పూర్తయిన తరువాత.. ప్రజలు నా పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు.. వారు ప్రభుత్వం నుంచి ఇంకా కోరుకుంటున్నారు అని సీఎం వైయస్‌ జగన్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులకు చెప్పిన వెంటనే 7 లక్షల మంది జగనన్న సైనికులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని 1.60 కోట్ల ఇళ్లకు వెళ్తున్నారు. 

మెగా పీపుల్స్‌ సర్వే ఈనెల 7వ తేదీ ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగుతోంది. వారం రోజుల్లో 63,95,600 ఇళ్లకు వెళ్లడం జరిగింది. దాదాపుగా 50 లక్షల మంది జగనన్నకు మద్దతుగా మిస్డ్‌ కాల్స్‌ ఇచ్చారంటే జగనన్నను ప్రజలు ఎంత అభిమానిస్తున్నారో.. ఎలా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 

ఒక్కసారి ఆలోచన చేయండి.. ప్రజల ఇంటికే వలంటీర్‌ను పంపించి పెన్షన్‌ అందిస్తున్నారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లోకే సంక్షేమ పథకాల నగదు జమ చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థను పంపిస్తున్నారు. ఎమ్మెల్యేలను, మినిస్టర్‌లను పంపిస్తున్నారు. ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటీ అందుతుందా లేదా అని జవాబుదారీతనంతో సీఎం వైయస్‌ జగన్‌ ఇంటింటికీ పంపిస్తున్నారు. ప్రభుత్వం దగ్గర నుంచి మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారని ప్రజలను అడగడమే కాకుండా.. కోరుకున్న అనేకం గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా నెరవేరుస్తున్నారు. 

వలంటీర్లు సైనికుల్లా పనిచేస్తున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ వెళ్లి కావాల్సింది తెలుసుకొని నెరవేర్చిన ఘటనలు ఎక్కడా లేవు. అందుకే అందరూ జగనన్నే మా భవిష్యత్తు, జగనన్నే మా నమ్మకం అని అంటున్నారు. ‘ఏ ఆడపిల్ల అయినా, ఏ అవ్వ అయినా నా అన్న ఉన్నాడు, నా మనవడు ఉన్నాడు.. నా కుటుంబం చూసుకోకపోయినా నన్ను జగనన్న చూసుకుంటాడనే నమ్మకంతో ప్రతి అక్కచెల్లెమ్మ ఉంది. అలాగే చిన్న పిల్లలు మా అమ్మానాన్న చదివించకపోయినా మా జగన్‌ మామ ఉన్నాడు.. నాకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఇప్పిస్తున్నాడని పిల్లలు గర్వంగా చెప్పుకుంటున్నారు’. 

జగనన్న ధైర్యంగా తన సైనికులతో మెగా పీపుల్స్‌ సర్వే చేపట్టారు. దాదాపు 64 లక్షల ఇళ్లకు ఇప్పటికే మా సైనికులు వెళ్లి ప్రజా మద్దతు పుస్తకం ద్వారా సర్వే చేపడుతున్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఐదు ప్రశ్నలకు టిక్‌ పెట్టి 82960 82960 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి జగనన్నకు మద్దతుగా ఉన్నామని చెప్పడం చాలా సంతోషం. 

ప్రతి ఇంటి మీద జగనన్న స్టిక్కర్‌ చూస్తుంటే చంద్రబాబుకు గుండెల మీద ఎగేసి తన్నినట్టు అనిపిస్తోంది. అందుకే ఛీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తున్నాడు. పది స్టిక్కర్లు ఇచ్చి మా పార్టీ స్టిక్కర్ల మీద అంటించమంటున్నారు. ఇళ్లలోని వారు బయటకు వచ్చి టీడీపీ స్టిక్కర్లను పీకి పారేస్తున్నారు. పవన్‌ కల్యాణ్, చంద్రబాబుకు సూటిగా చెబుతున్నాను.. మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పి.. వారు సంతోషంగా స్టిక్కర్‌ వేయమంటే వేస్తే అది అక్కడుంటుంది కానీ, పోటీగా పది ఇళ్లకు స్టిక్కర్లు వేసి పచ్చ ఛానళ్లలో చూపిస్తే మీకు ఎలాంటి మద్దతు రాదు. 

ఈ మధ్య చంద్రబాబు సెల్ఫీలు తీసుకుంటున్నాడు. అవి సెల్ఫీలు కాదు చంద్రబాబూ.. నువ్వు వేసుకుంటున్న సెల్ఫ్‌ గోల్‌. ప్రజల దగ్గర డబ్బులు పిండి టిడ్కో ఇళ్లు కడతానని కట్టకుండా ఫెయిల్యూర్‌గా వెళ్లిపోయిన ముసలి నాయకుడివి నువ్వు. ముసలితనంతో మూలను కూర్చోకుండా నీతిమాలిన రాజకీయాలు చేస్తుంటే ఇదేం ఖర్మరా బాబూ అని ప్రజలు అనుకుంటున్నారు. ఆ టిడ్కో ఇళ్లను కూడా ఫ్రీగా పూర్తిచేసి ప్రజలకు అందిస్తున్న గొప్ప మనసున్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. అంతేకాకుండా రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి 22 లక్షల మందికి ఇళ్లు కూడా పూర్తిచేయించబోతున్నారు. ఇవి పూర్తయితే ఇక్కో అక్క చేతిలో రూ.5 నుంచి 10 లక్షల ఆస్తి రాబోతుంది. 

చంద్రబాబు నాయుడు ఎక్కడో కాదు నువ్వు గెలిచిన కుప్పంలో అయినా, నేను గెలిచిన నగరిలో అయినా రా చర్చకు.. నీ మేనిఫెస్టో తీసుకురా.. మా మేనిఫెస్టో నేను తీసుకువస్తా.. నీ మేనిఫెస్టోలోని 600 హామీల్లో ఎన్ని అమలు చేశావ్‌.. ఆ కుటుంబం, ఆ గ్రామం, మున్సిపాలిటీ, ఆ కార్పొరేషన్‌ లబ్ధి పొందిందా చూద్దాం. అలాగే  మా మేనిఫెస్టో తెస్తాం. ఎన్ని హామీల్లో ఎన్ని నెరవేర్చామో, ఇవ్వని హామీల్లో కూడా ఎన్ని అమలు చేశామో తెలియజేస్తాం. అప్పుడు సెల్ఫీ నీతో దిగుతారా.. నాతో దిగుతారా తేల్చుకుందాం. అది రియల్‌ సెల్ఫీ అవుతుంది. చంద్రబాబు ఫెయిల్యూర్‌ పొలిటీషియన్, బాబు రాజకీయం మొత్తం వెన్నుపోటుతో జరిగింది తప్ప.. ప్రజల ఆశీర్వాదంతో కాదు. 

Back to Top