సంక్షేమ పథకాల్లో 75 శాతం వాటా మహిళలదే

మ‌హిళ‌ల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

చంద్రబాబు మహిళల కోసం ఒక్క పథకమైనా తెచ్చారా?

చీరలు కట్టుకోవాల్సింది చంద్రబాబు, లోకేశ్‌లే 
 

పచ్చ చీర కావాలా? పసుపు చీర కావాలా?
 

అలాగే అసలు చీర కావాలా? లేక చుడీదారా?
 

ఆ విషయాన్ని టీడీపీ ఆలోచించుకోవాలి
 

పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా

 

 తాడేపల్లి: సంక్షేమ పథకాల్లో 75 శాతం వాటా మహిళలదే అని పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా సాధికారత దిశగా సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ మహళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు. 

ప్రెస్‌మీట్‌లో రోజా ఇంకా ఏం మాట్లాడారంటే..:
ఈరోజు రాష్ట్రంలో శ్రీ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి పరిపాలనలో అన్ని వర్గాల వారు, అన్ని కులాలు వారు, అన్ని ప్రాంతాల వారు సుఖంగా, సంతోషంగా ముందుకు వెళ్తుంటే అది చూసి సహించలేని టీడీపీ నాయకుడు చంద్రబాబు, ఆయన అనుచరులు ఫ్రస్టేషన్‌తో ఊగిపోతున్నారు. ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా రాజకీయంగా వాడుకోవటానికి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. 

14 ఏళ్లుగా సీఎంగా, 13 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు చేస్తున్న ప్రతి కార్యక్రమం, హావభావాలు పెద్ద చర్చకు దారి తీసింది. విజయవాడ ఆసుపత్రిలో ఓ బాధితురాలు ఉంటే ఆవిడ్ని ఎలా పరామర్శించాలి. ఆవిడకు భరోసా ఎలా ఇవ్వాలి, అండగా నిలబడాలనే విషయం తెలియకుండా వ్యవహరించారు. పబ్లిసిటీ పిచ్చితో కెమెరాలు వేసుకొని, రౌడీ మూకల్ని తీసుకొచ్చి ఆసుపత్రిలో హడావుడి చేశారు. బాధితురాలిని పరామర్శించటానికి వచ్చిన శ్రీమతి వాసిరెడ్డి పద్మను గౌరవించకుండా దగ్గరుండి దాడి చేయించారో మనం చూశాం. 

ఇకనుంచి ఎవరైనా బాధితురాలికి అండగా ఉండకుండా.. రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకున్న వారిని కూడా ఐపీసీ సెక్షన్‌ కింద శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాలని మేం కోరుకుంటున్నాం. గత మూడేళ్లుగా శ్రీ జగన్‌ మోహన్‌ రెడ్డి మహిళా సాధికారిత దిశగా ప్రతి సంక్షేమ పథకాన్ని, పాలసీని మహిళల కోసం చేస్తూ.. మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిగా, ప్రభుత్వంగా పేరుతెచ్చుకొని ముందుకెళ్తున్నారు. 

రాష్ట్రంలో సంక్షేమ పథకాల్లో 75% వాటా మహిళలకు ఇచ్చారంటే.. మహిళలపై ఆయనకు ఉన్న గౌరవం, అభిమానం తెలుస్తోంది. ఈ మూడేళ్లలో రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఏ రాష్ట్రంలో, ఏ సీఎం చేయని విధంగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపి.. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగటానికి అండగా ఉన్నారు. 

మహిళా వివక్ష నిర్మూలనలో దేశంలో ఐదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉందని నీతి అయోగ్‌ ప్రశంసించింది. మహిళా భద్రత కోసం జగనన్న దిశ పోలీస్‌ స్టేషన్ల పనితీరును పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ప్రశంసించింది. సంక్షేమ పథకాలో, పదవులు ఇచ్చింది మాత్రమే కాకుండా.. మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని, దిశ యాప్‌ను, దిశ పోలీస్‌ స్టేషన్లు తీసుకురావటం జరిగింది. చంద్రబాబు మహిళా రక్షణ, సంక్షేమం కోసం ఒక్క పథకమైనా తీసుకొచ్చారా? ఒక్క ఆలోచనైనా చేశారా? ఏదీ చేయకుండా మహిళా ద్రోహి పార్టీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మహిళల గురించి గొప్పగా మాట్లాడుతున్నామని చెత్తగా మాట్లాడుతున్నారు. 

ఈరోజు ఏ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా శ్రీ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్నారు కాబట్టే ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ సీఎం గారని మహిళలు చెప్పుకుంటున్నారు. ఈరోజు చంద్రబాబు నిరసనలు చేస్తున్నారని తెల్సింది. ఆయన నిరసనలు ఎందుకు చేస్తున్నారో.. రాష్ట్ర మహిళలు అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. టీడీపీ వాళ్లు ఊరికో ఉన్మాది అని పుస్తకం వేశారంట. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదులు కల్లా.. దేశంలో ఎక్కడైనా ఉన్మాదులు ఉన్నారా అని రాష్ట్రంలో మహిళలు అంతా అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ సిగ్గుతో తలవంచుకోవాలి. 

గతంలో విజయవాడలో టీడీపీ నేత వినోద్‌ జైన్‌ 12 ఏళ్ల అమ్మాయిని సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ చేస్తే.. ఆ అమ్మాయి సూసైడ్‌ చేసుకుంటే చంద్రబాబు  ఎక్కడకి వెళ్లారు. లోకేశ్‌ పీఏ టీడీపీలో మహిళలను వేధిస్తున్నారని వారు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే.. ఆరోజు చంద్రబాబు నిరసనలు చేయలేదు. ఎందుకు చంద్రబాబు యాక్షన్‌ తీసుకోలేదు. ఎమ్మార్వో వనజాక్షిని ఇసుకలో పడేసి చింతమనేని ప్రభాకర్‌ కొట్టినప్పుడు, కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌లో ఆడవాళ్ల జీవితాల్ని నాశనం చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల ముందు ఆరోజు ఎందుకు చంద్రబాబు నిరసనలు తెలియజేయలేదు. 

ఈరోజు చంద్రబాబును మహిళలు ఛీ కొట్టి.. చీదరించుకొని పట్టించుకోవటం లేదని శ్రీ జగన్‌ గారి ఇమేజిని దిగజార్చాలని బూతు పురాణాన్ని టీడీపీ నేతలు ఎత్తుకుంటున్నారు. ప్రెస్‌మీట్లలో టీడీపీ వాళ్ల మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. శ్రీ జగన్‌ మోహన్‌ రెడ్డి లాంటి దమ్మున్న నాయకుడు గురించి చెడుగా మాట్లాడుతూ చీరలు పంపిస్తామని అంటున్నారు. భారతమ్మ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. భారతమ్మ గురించో, శ్రీ జగన్‌ గారి గురించో తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు. చర్యలు తీసుకుంటామని శ్రీమతి ఆర్కే.రోజా హెచ్చరించారు.  చీరలు కట్టుకోవాల్సిన నాయకత్వం చంద్రబాబుది. దొంగలా కరకట్టలో దాక్కున్న చంద్రబాబు చీరకట్టుకోవాలి. దమ్మున్న నాయకుడుగా విజయవాడ నడిబొడ్డులో ఇళ్లు కట్టుకొని ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తోంది శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు. ప్రజలకు కష్టకాలం వస్తే.. కరోనా, వరదలు వస్తే సహాయాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివద్ధి నడిపిస్తున్న నాయకుడు శ్రీ జగన్‌ గారిని విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదు.

సొంత పార్టీ పెట్టుకోలేని, సొంతంగా ఎన్నికలకు వెళ్లలేని చంద్రబాబే.. చీర కావాలా? చుడీదార్‌ కావాలా అన్నది ఆలోచించుకోవాలి. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.14,500 కోట్లు రుణమాఫీ ఎగ్గొట్టిన చంద్రబాబుకే చీరలు పంపించటానికి డ్వాక్రా సంఘాల వారు సిద్ధంగా ఉన్నారు. కరకట్టకు పంపించమంటావా? హైదరాబాద్‌ ఇంటికి పంపించాలా చంద్రబాబు. కొడుకు లోకేశ్‌ను కనీసం ఎమ్మెల్యేగా కూడా చంద్రబాబు గెలిపించుకోలేపోయాడు. అందుకు చంద్రబాబు, లోకేశ్‌లు చీరలు కట్టుకోవాలి. పట్టుచీర, పసుపు చీర కావాలంటే పంపిస్తాం. 

80 లక్షల డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.3,400 కోట్ల సున్న వడ్డీని చంద్రబాబు ఎగ్గొట్టారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలు వాళ్ల పాత చీరలు పంపిస్తారంట. అడ్రస్‌ చెబితే పంపిస్తాం. మీరు మాట్లాడితే మాట్లాడటానికి చాలా మంది ఇక్కడ ఉన్నారు. సభ్యత, సంస్కారం ఉండాలి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది కూడా లేదు. ఊరికో ఉన్మాది టైటిల్‌ ఏంటి? తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా వేరే రాష్ట్రంలో, దేశంలో ఉన్నారా? అందరికన్నా పెద్ద ఉన్మాది చంద్రబాబు. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌లో 200పైగా సీడీలు దొరికాయి. అందులో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారని తెల్సి కూడా వారిని రక్షించి ఆడవారికి అన్యాయం చేసిన ఉన్మాది చంద్రబాబు. రుషితేశ్వరిని ర్యాగింగ్‌ చేసి చంపేస్తే ఆ తల్లిదండ్రులు చెప్పులు అరిగేలా తిరిగితే ఆ ప్రిన్సిపల్‌ను కాపాడటం కోసం అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి ధూళిపాళ్ల లాంటి వారు ఉన్మాదులు. జానీమూన్‌ అనే జడ్పీ ఛైర్మన్‌ రావెల కిషోర్‌ అనే మంత్రి నా ప్రాణానికి హాని ఉందని కన్నీరు మున్నీరుగా ఏడిస్తే.. ఆమంత్రిని శిక్షించకుండా ఆ అమ్మాయిని బాధ పెట్టిన ఉన్మాది నువ్వు కాదా?. బండారు సత్యనారాయణ మహిళలు ఒక దళిత మహిళను వివస్త్ర చేసి కొట్టింది టీవీల్లో చూసి కూడా వారిపై యాక్షన్‌ తీసుకోకుండా ఆ దళిత మహిళకు అన్యాయం చేసిన ఉన్మాది నువ్వు కాదా?  

నారాయణ కాలేజీలు, స్కూల్స్‌లో ఆత్మహత్యల పేరుతో హత్యలు జరుగుతుంటే.. వాటి మీద ఎంక్వైరీలు లేకుండా బిడ్డ ఎందుకు చనిపోయిందో తెలియకుండా ఆ చావులు మీడియాకు రాకుండా ఎలా కవర్‌ చేశారో ఎవ్వరూ మర్చిపోలేదు. నిజమైన ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే టీడీపీలో మొదట ఉన్మాది చంద్రబాబు. ఆ తర్వాత లోకేశ్‌. ఆయన ఫొటోలు, ఆయన డ్యాన్స్‌లు.. ఆయన ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో చూశాం. ఆయన వియ్యంకుడు బాలకష్ణ ఆడపిల్ల కనిపిస్తే చాలు.. కౌగిలించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, కమిట్‌ అయిపోవాలని మెసేజ్‌ ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బూటు కాలుతో మహిళను కొడతాడు. వీళ్లు కాదా.. ఉన్మాదులు. వైయస్‌ఆర్‌సీపీలో ప్రతి ఒక్కరూ మహిళల్ని గౌరవించి.. మహిళాభివద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్న వైయస్‌ఆర్‌సీపీని విమర్శించే అర్హత టీడీపీకి లేదు. ఈ ప్రభుత్వం మహిళల కోసం సంక్షేమం, పాలసీలు తెచ్చారు.  ఈ ప్రభుత్వంలో మహిళా మంత్రిని అయినందుకు గర్వపడుతున్నా. ఈరోజున దురదష్టకరమైన సంఘటనలు జరగకుండా ప్రయత్నిస్తున్నాం. ఏవైనా జరిగినా.. 24 గంటల్లోపు తప్పులు చేసిన వారిని అరెస్టు చేసి త్వరితగతిన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నాం. ఆసుపత్రిలో సిబ్బందిని అరెస్టు చేసి దర్యాప్తును వేగవంతం చేస్తున్నాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్‌ఐని సస్పెండ్‌ చేయటం జరిగింది. ఆ బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించటమే కాకుండా ఒకరికి ఉద్యోగం కల్పించటం జరుగుతోంది. ఎక్కడైనా ఏవైన ఘటనలు జరిగితే వెంటనే యాక్షన్‌ తీసుకోవటం అనేది శ్రీ జగన్‌ ప్రభుత్వంలోనే ఉన్నది. దేశంలో ఏ రాష్ట్ర సీఎం ఇలాంటి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు తన జీవితకాలంలో ఎప్పుడూ చర్యలు తీసుకోలేదు.  

రాష్ట్రంలో 1.20 కోట్ల మంది దిశ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. దిశ యాప్‌ ఉపయోగిస్తున్న వారికి 5–10 నిమిషాల్లోపు పోలీసులు రక్షణ కల్పించారు. కావాలంటే రికార్డులతో సహా చూపిస్తానని రోజా అన్నారు. గతంలో సైబర్‌ క్రై మ్, సోషల్‌ మీడియాలో మహిళల్ని సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ చేసిన 2 లక్షల మందిని గుర్తించి నిరంతరం పోలీసులు ట్రాకింగ్‌ చేస్తున్నారు. వారి వల్ల ఏ ఆడపిల్లకు అన్యాయం జరగకూడదని పోలీసులు గమనిస్తున్నారు. ఇలా అనేక కార్యక్రమాల్ని సొంత కుటుంబంలో ఆడబిడ్డలకు చేస్తున్నట్లు మహిళలకు శ్రీ జగన్‌ గారు అందజేస్తున్నారు. అయితే, టీడీపీ నాయకులు, మహిళలు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కరెక్టు కాదు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇలాగే టీడీపీ నాయకులు మాట్లాడితే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. బాధితులతో ఎలా మాట్లాడాలో, ఎలా అండగా నిలబడాలో శ్రీ జగన్‌ గారిని చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి. దమ్ము గురించి టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. శ్రీ జగన్‌ గారి దమ్ముంటో 12 ఏళ్లుగా చూస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యేతో స్టార్ట్‌ అయి 151 ఎమ్మెల్యేలకు చేరిన దమ్మున్న నాయకుడు శ్రీ జగన్‌ గారు. 224 ఎమ్మెల్యేలతో ఉన్న టీడీపీని వెన్నుపోటు పొడిచి లాక్కున్న మీరు.. ఈరోజు 23 ఎమ్మెల్యేకు పరిమితం అయ్యారు. దీనికి దమ్ములేని నాయకుడు చంద్రబాబే కారణం. 

మహిళలందరి ఆశీస్సులతో స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారు. కుప్పంలో మహిళలు కూడా టీడీపీని ఓడించి.. శ్రీ జగన్‌ గారికి జేజేలు పలికారు. ఇకపై చంద్రబాబు ఎన్నికల్లో నిల్చోవటం కూడా వేస్టే. ఏ ఎన్నికలు వచ్చినా ఒంటరిగా పోటీ చేయలేని దమ్ములేని నాయకుడు చంద్రబాబు. ఎవరితో పొత్తులు పెట్టుకొని నీతిమాలిన రాజకీయాలు చేసి ఎన్నికల్లో గెలుద్దామని ఆలోచిస్తావు. ప్రజలకు మంచి చేసి ఓటేయండని ప్రజల్లోకి వెళ్లలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. ఈరోజున ఏ ఎన్నికలు వచ్చినా సింగిల్‌గా వచ్చి పోటీ చేసి.. రాష్ట్ర ప్రజలు, మహిళల ఆశీర్వాదంతో తిరుగులేని విజయాలతో ముందుకు సాగుతున్న శ్రీ జగన్‌ గారిని దమ్ముందా, ధైర్యముందా, ఆలోచన ఉందా? పరిపాలన చేతనవుతుందా అనే పనికిమాలిని ప్రశ్నలు వేసి చులకన అవ్వొద్దు. 

రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు, బూతు ప్రెస్‌మీట్ల ద్వారా శ్రీ జగన్‌ గారిని, వైయస్‌ఆర్‌సీపీని రెచ్చగొట్టాలనుకోవటం టీడీపీ పిచ్చి. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం, అభివద్ధి కోసం ఎన్నుకోబడ్డాం కాబట్టి శ్రీ జగన్‌ గారి వెంట నడుస్తున్నాం. ప్రజలు, మహిళలు టీడీపీ వారిని తరిమితరిమి కొడతారు. భారతమ్మ, విజయమ్మ గురించి లేనిపోని విధంగా మాట్లాడితే సహించేది లేదు. 40 ఇయర్స్‌ అని చెప్పుకునే చంద్రబాబుది 420 హిస్టరీ. అందులో ఏమీ లేదు. పిల్లను ఇచ్చిన మామ నుంచి ఓటేసిన ప్రజలకు వెన్నుపోటు పొడవటం తప్ప మంచి చేసిన దాఖలాలు లేవు.  

శ్రీ జగన్‌ గారు, దివంగత వైయస్‌ఆర్‌ గారు ఆ కుటుంబం మొత్తం ప్రజల కోసం తమ జీవితాలను అంకితం చేశారు. ప్రజల గుండెల్లో గుండెలు కట్టుకొని ఉన్నారు. ప్రజల ఆశీర్వాదంతో విజయవంతంగా ముందుకెళ్తున్నారు. అలాంటి బూతు పురాణాల్ని ప్రసారం చేయటం ద్వారా రెచ్చగొట్టినట్లు అవుతుంది. శాంతిభద్రతల సమస్యను తీసుకురావటం అవుతుంది. అటువంటి రెచ్చగొట్టే స్టేట్‌మెంట్లు చూపించొద్దని మీడియాకు మంత్రి శ్రీమతి ఆర్కే.రోజా విజ్ఞప్తి చేశారు.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
టీడీపీ హయాంలో బాధితులకు అన్యాయం చేశారు. కానీ శ్రీ జగన్‌ ప్రభుత్వంలో దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ యాప్‌లు పెట్టి రక్షిస్తున్నాం. 24 గంటల్లో అరెస్టులు చేసి, దర్యాప్తును వేగవంతం చేసి శిక్షలు వేయిస్తున్నాం. ఎక్కడైనా వైయస్‌ఆర్‌సీపీ నేరస్తుడికి అండగా ఉందని ఒక్క కేసు చూపించండి. టీడీపీ హయాంలో వారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అండగా ఉన్నారని మీడియాలో చూపించారు. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్న చంద్రబాబును రాష్ట్రమంతా గమనించింది. అందుకే వారికి ఉప్పూ, కారం పెట్టి ఇంటికి పంపించారు.

తాజా వీడియోలు

Back to Top