సీఎం కుటుంబ స‌భ్యులను విమ‌ర్శిస్తే నాలుక కోస్తాం..

ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా హెచ్చ‌రిక‌

రాజ‌మండ్రి : ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని, ఆయ‌న కుటుంబ స‌భ్యులను విమ‌ర్శించే వారి నాలుక కోసి.. ఉప్పూ, కారం పెడ‌తామ‌ని ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా హెచ్చరించారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హ‌త టీడీపీకి లేద‌న్నారు. రాష్ట్రంలో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘ‌న‌త వైయ‌స్ఆర్ సీపీదేన‌ని గుర్తుచేశారు. 

టీడీపీ సీనియ‌ర్ నేత అయ్య‌న్న‌పాత్రుడు ఒక సైకో మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మంత్రి ఆర్కే రోజా విమ‌ర్శించారు. అలాంటి నేత‌ల‌ను త్వ‌ర‌లో పిచ్చాసుప‌త్రిలో చేర్చ‌క‌పోతే ప్ర‌జ‌లే రాళ్ల‌తో కొట్టి చంపేస్తార‌న్న విష‌యాన్ని టీడీపీ నేత‌లు గుర్తించాల‌న్నారు. అయ్య‌న్న వ్యాఖ్య‌లు చూస్తే.. ఆయ‌న వ‌య‌సుకు గానీ, ఆయ‌న చేప‌ట్టిన ప‌ద‌వుల‌కు గానీ గౌర‌వం ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని ఆమె అన్నారు. రాజ‌కీయంగా స‌మ‌స్య‌లేవి దొర‌క‌లేద‌ని, చివరకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్, ఆయ‌న కుటుంబంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారని, ఇక‌పై స‌హించ‌బోమ‌ని ఆమె హెచ్చ‌రించారు.

రాజమండ్రిలో 'దసరా' మహిళా సాధికారత ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు తానేటి వ‌నిత‌, ఆర్కే రోజా పాల్గొన్నారు. ఆర్ట్స్ కాలేజి నుంచి `దిశ` బైక్ ర్యాలీని ఎంపీ మార్గాని భ‌ర‌త్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో మ‌హిళ‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రి రోజా, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, అరకు పార్లమెంటు సభ్యురాలు మాధవి, రుడా చైర్‌ప‌ర్స‌న్ షర్మిల బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మహిళలు ఏర్పాటు చేసిన 15 స్టాల్స్ ను మంత్రులు తానేటి వ‌నిత, రోజా, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, ఎంపీ మాధవి ప్రారంభించి సంద‌ర్శించారు. 

Back to Top