అన్ని వ‌ర్గాల‌కూ అండ..జగనన్న సురక్ష 

 రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు 

శ్రీ‌కాకుళం: అన్ని వర్గాలకూ అండగా ఉండేందుకు జగనన్న సురక్ష కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌ని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ప్ర‌జ‌ల‌ జీవన ప్రమాణాల పెంపుదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆర్థికంగా పేదలకు చేయూతనిస్తున్నామ‌న్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మండలంలోని సతివాడ గ్రామంలో 549 మందికి వివిధ ధ్రువీకరణ పత్రాలు అందించారు. జిల్లా మొత్తం మీద 2.5 లక్షల ధ్రువీకరణలు ఇవ్వనున్నామని మంత్రి ధర్మాన చెప్పారు. సతివాడ సచివాలయం, కొర్లాం సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు.కొర్లం సచివాలయం పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమం లో 703 వివిధ ధృవీకరణ పత్రాలు అందజేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ధ‌ర్మాన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పేదలకు భూమి ఇచ్చారు. 1977 లో పీఓటీ యాక్ట్ పేరిట ఒక్క చట్టం తీసుకు వచ్చాం. ఆ చట్టం ప్ర‌కారం..పట్టా పొందిన వారు భూమిని అమ్ముకోవాలి అంటే వెసులుబాటు అయ్యేది కాదు. ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. రైతుల సాగులో ఇరవై ఏళ్లు ఉన్న అసైన్డ్ ల్యాండ్-కు హక్కులు కల్పించాం. సీఎం జగన్ ఆ రోజు రెవెన్యూ మంత్రి సారథ్యంలో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ కర్ణాటక,తమిళ నాడు  రాష్ట్రాలను క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించి అధ్యయనం చేసి,సీఎంకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను అమలు చేస్తూ..ఇరవై ఏళ్లు సాగుబడిలో ఉన్న అసైన్డ్ ల్యాండ్ ను అమ్ముకునే హక్కు రైతుల‌కు కల్పిస్తూ..క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. అలానే ఇవాళ మత్స్యకారులకు ఏ ప్రభుత్వం చేయనంత మంచి కార్యక్రమాలు చేపట్టింద‌ని  రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

  అభివృద్ధి,సంక్షేమం అమలులో సీఎం వైయ‌స్ జగన్, విపక్ష నేత చంద్రబాబుకూ మధ్య ఉన్న తేడా తెలుస్తుంది కదా ! విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు..చేస్తున్నాం. బుక్స్, షూస్, యూనిఫాం,బెల్ట్ ఇలా అన్నింటినీ ఇచ్చి మీరు ప్రపంచంతో పోటీ పడి,మీ కుటుంబ ప్రమాణాలు పెంచాలనే విధంగా పని చేస్తున్నాం. అలానే తమ పిల్లలను బడికి పంపే తల్లులకు భారం కాకూడదు అని అమ్మ ఒడి ప‌థ‌కం అమలు చేస్తున్నాం. జగనన్న గోరుముద్ద పేరిట నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం అమలులో భాగంగా  చిన్నారులకు పోషకాహారాన్ని అందిస్తున్నాం.

వ్యవసాయానికి పెద్ద ఎత్తున సాయం చేస్తున్నాం. రూ.13,500 పెట్టు బడి సాయంగా ప్రతి ఏటా అందిస్తున్నాం. అలానే ఆ రోజు బ్యాంకులలో మీకు ఉన్న బాకీలు తీర్చేస్తాం అంటే రైతులందరూ విప‌క్ష నేత చంద్రబాబును నమ్మారు. 2014లో టీడీపీకి ఓటు వేశారు. అలానే డ్వాక్రా సంఘాలకు రుణ మాఫీ చేస్తా అని చెప్పారు. కానీ ఆయన అటు రైతులనూ,ఇటు మహిళలనూ అందరినీ మోసం చేశారు. కానీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి మాత్రం ఇచ్చిన మాట ప్రకారం పాదయాత్రలో చెప్పిన విధంగా న‌డుచుకున్నారు. నాలుగు విడతల్లో డ్వాక్రా రుణాలు చెల్లిస్తానని అన్నారు. ఆ రోజు హామీ ఇచ్చిన విధంగా అధికారంలోకి రాగానే డ్వాక్రా,రైతు రుణాల చెల్లింపు విష‌య‌మై ఇచ్చిన హామీలు నెరవేర్చారు. మాట ఇచ్చి తప్పింది చంద్రబాబు. ఇచ్చిన మాట నిల బెట్టుకున్నది వైయ‌స్‌ జగన్. ఈ మార్పు అందరూ గమనిస్తున్నారు.

ప్రజా జీవితాన్ని లోతుగా పరిశీలిస్తేనే తెలుస్తుంది. పై పైన చూస్తే తెలియదు. అలానే వలంటీర్లని విమర్శిస్తున్న వారికి కూడా చెబుతున్నా వీరిపై నిరాధార ఆరోపణలు చేయ‌డం త‌గ‌ద‌ని విన్నవిస్తున్నాను. ఇవాళ సంక్షేమ పథకాల అమలులో అవినీతి లేకుండా చేశాము.  ప్రజలందరినీ సమానంగా చూడాలన్న లక్ష్యంతో అమ‌ల్లోకి వచ్చిన కార్యక్రమం జగనన్న సురక్ష. నిస్సహాయులుగా ఉన్న వారికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున అండగా ఉండాలని భావించి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. అలానే ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌తో సంబంధిత శిబిరాల నిర్వ‌హ‌న‌ణ‌తో పాలనను గ్రామ సచివాలయం నుంచి ఇంటి గుమ్మం వద్దకే తీసుకు వచ్చాం.

మీరు ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వానికి నాలుగేళ్లు అవుతోంది. ఎన్నికల ముందు చెప్పినవన్నీ చేస్తామని రుజువు చేశాము. నిరంతరం పౌరుల కోసం పనిచేసేందుకు మీ గ్రామంలోనే సచివాలయం,వెల్నెస్ సెంటర్లు,ఆర్బీకే-లు ఏర్పాటు చేశాం. గ్రామ సచివాలయంలో వివిధ శాఖల‌కు సంబంధించి పౌర సేవ‌లు అందించేందుకు 15 మంది సిబ్బందిని నియమించాం. కడుపున పుట్టిన బిడ్డలా వలంటీర్లు ఇవాళ మీకు సేవలు అందిస్తున్నారు. కరోనా సమయంలో వారి సేవలు అమూల్యమైన‌వి. ప్రపంచం మొత్తం గడగడలాడిన కరోనా వేళల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే ధైర్యంగా ఉన్నారు. అందుకు కారణం వైద్య వ్యవస్థ బలోపేతం చేయడమే. అలానే నిత్యావసర సరకులను ఉచితంగా ఇంటింటికీ చేరవేయడమే...

రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్స్ నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఇందులో ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం,బుడగట్లపాలెంలో ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కింద రూ.10 వేలు,వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు అందిస్తోంది. అంతేకాకుండా అనేక సంక్షేమ పథకాలతో ప్రణాళికలతో సంబంధిత కార్యక్రమాలతో తోడుగా ఉంటున్నాం. మాట తప్పని,మడమ తిప్పని నాయకుడు సీఎం వైయ‌స్ జగన్ అని ఇవాళ నిరూపణ అయింది. వీటిని మీరు గమనించి,మీ చుట్టూ ఉన్న పరిసరాలలో,మీ గ్రామాలలో జరిగిన అభివృద్ధిని గుర్తించి మేలు చేసే ప్రభుత్వానికి మ‌రోసారి మద్దతు ఇవ్వండి అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.

కార్య‌క్ర‌మంలో ఎంపీపీ గోండు రఘురాం, ఎంఆర్వో రామారావు, బొడ్డేపల్లి పద్మజ, మాజీ డిసీఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణ, నాటక అకాడమీ డైరెక్టర్ ముంజేటి కృష్ణ, యాల్లా నారాయణ, పీస శ్రీహరి, సుగ్గు మధు రెడ్డి, కొయ్యాన నాగభూషణం, గోండు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top