కౌలు రైతుకు మేలు చేసేలా చట్టం

సభలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్‌
 

 

అమరావతి: కౌలు రైతులకు అన్ని విధాలు మేలు చేసే చట్టాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ చెప్పారు. పాదయాత్రలో కౌలు రైతుల కష్టాలు తెలుసుకున్న సీఎం వైయస్‌ జగన్‌ భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టాన్ని రూపొందించారన్నారు. అసెంబ్లీలో కౌలు రైతులకు మేలు చేసే చట్టాన్ని ప్రవేశపెట్టిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడారు. రాష్ట్రంలో 15 ల‌క్ష‌లు మంది కౌలు రైతులు ఉన్నారు. వారందరికీ సహకారం అందించాలని ప్రభుత్వం కొత్త చట్టం ప్రవేశపెడుతుందని చెప్పారు. పాదయాత్రలో అనేక మంది కౌలు రైతులను కలుసుకున్న సీఎం వైయస్‌జగన్‌ వారి బాధలు విన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన కొత్త చట్టం మూలంగా కౌలు రైతు బ్యాంకు నుంచి డైరెక్ట్‌గా రుణం తీసుకునే సౌకర్యం, భూమి యజమాని హక్కులను ధారాదత్తం చేయకుండా, భూ రికార్డుల్లో కౌలుదారు పేరు నమోదు కాకుండా, వారి హక్కులను పరిరక్షించడం కూడా చట్టంలో ఉందన్నారు. మంచి చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు ప్రతిపక్షం వినే ఆలోచన కూడా చేయకపోవడం దురదృష్టకర సంఘటన అన్నారు. భూ యజమానులు, సాగుదారులకు మధ్య సులభకర ఒప్పందం తీసుకువచ్చామని, సాగుదారులు పంటలపై మాత్రమే హక్కు ఉంటుందన్నారు. అదే విధంగా కౌలురైతులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల ప్రోత్సహకాలు అందుతాయని, పంటపై తీసుకున్న రుణానికి భూయజమానికి సంబంధం లేదన్నారు. భూ యజమానికి పంటపై రుణం తప్ప ఏ విధమైన రుణమైనా తీసుకోవచ్చన్నారు. రైతు, సాగుదారుల ప్రయోజనాల కోసం చట్టాన్ని తీసుకువచ్చామన్నారు.

Back to Top