ఏపీఎస్‌ ఆర్టీసీలో 1800 కారుణ్య నియామకాలు 

మంత్రి పేర్ని నాని

  తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ ఆర్టీసీ)లో కొత్తగా కారుణ్య నియామకాలు చేస్తున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. మొత్తం 1800 పైచిలుకు ఉద్యోగుల కుటుంబాల వారికి కారుణ్య నియామకాలు చేస్తున్నామని పేర్కొన్నారు.  అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్‌లో మంత్రి మాట్లాడుతూ.. సంబంధిత జిల్లాలోనే ఉద్యోగం ఇస్తామని, కలెక్టర్లకు ఆదేశాలిచ్చి లిస్టులు పంపామని వెల్లడించారు. గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనని గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని చెప్పారు. కేంద్రం ఇచ్చే ఆయిల్ ధర కంటే బయట బంకుల్లో నాలుగు రూపాయలు తక్కువే వస్తుందని తెలిపారు. రోజుకు కోటిన్నర రూపాయల భారం ఆర్టీసీపై తగ్గుతుందని తెలిపారు. ఆర్టీసీకి నష్టాలు రాకూడదని తాము ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.

ఇప్పటివరకు 33.83 కోట్ల రూపాయలు సేవ్ చేయగలిగామని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. త్వరలోనే 40 బస్సులు  అందుబాటులోకి వస్తాయని, మిగతావి మరికొన్ని వారాల్లోనే అందుతాయని చెప్పారు. తిరుమల-తిరుపతికి యాభై బస్సులు నడుపుతామని, 60 సంవత్సరాల పైబడిన ప్రయాణికులకు రాయితీలు ఏప్రిల్ నాలుగు నుంచి అమలు చేస్తామని చెప్పారు.

గతంలో కరోనా వలన వాటిని నిలిపేశామని, తాజాగా ఇప్పుడు మళ్లీ పునరుద్దరిస్తున్నామని తెలిపారు.ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకోవటం వల్ల మూడు వేల కోట్ల పైబడి భారం పడుతోందని గుర్తు చేశారు. అయినాసరే ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాని మంత్రి పేర్ని నాని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top