చంద్రబాబు దీక్ష ఎందుకు, ఎవరి కోసం..?

బూతులను సమర్థిస్తూ బాబు దీక్ష చేస్తున్నారా..?

ఎన్ని కుట్రలు పన్నినా జనహృదయాల్లోంచి సీఎంను తొలగించలేరు

తెలుగుదేశం పార్టీని ముంచడానికి లోకేశ్‌ చాలు

చంద్రబాబు నిలువెళ్లా కుట్రలు, కుతంత్రాలు, దోపిడీ, దగా..

ప్రజల్లో బాబు పరపతి చనిపోయిందనడానికి నిన్నటి బంద్‌ నిదర్శనం 

టీడీపీలో పయ్యావుల కేశవ్‌ కంటే బద్మాష్‌ ఎవరుంటారు..?

ఇప్పటికైనా దొంగ దీక్షలు పక్కనబెట్టి ఇంటికెళ్లండి..

చంద్రబాబుకు మంత్రి పేర్ని నాని హితవు

తాడేపల్లి: చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలు, మోసం, దోపిడీ, దగా, దౌర్జన్యంతో నిండిపోయిందని, ఎంతటి నీచానికైనా ఒడిగట్టే మనస్తత్వం చంద్రబాబుదని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు దీక్ష ఎందుకు, ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. బూతులను సమర్థిస్తూ దీక్ష చేస్తున్నారా..? అని నిలదీశారు. నక్క వినయాలు, కొంగ జపాలు, దొంగ మాటలు చాలించమని 40 ఏళ్ల ఇండస్ట్రీ అని డబ్బాలు కొట్టుకునే చంద్రబాబుకు హితవుపలుకుతున్నామన్నారు. 

ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అసభ్యపదజాలంతో తిట్టిస్తున్నాడని, పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టేనని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని ముంచడానికి ఎవరూ అక్కర్లేదని, చంద్రబాబు తనయుడు లోకేశ్‌ చాలని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

74 ఏళ్ల చంద్రబాబు జీవితంలో కుట్రలు, కుతంత్రాలు, ఏమార్చడాలు, మనుషులను కొనుగోలు చేయడాలు, చెప్పిన అబద్ధం చెప్పకుండా నమ్మించి మోసం చేయడం, కనురెప్ప వేసి తెరిచేలోపు ఆకృత్యాలు చేయడం, రాజకీయంగా అనేక దుర్గుణాలు కలిగిన చరిత్ర చూస్తే.. ఏ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోలేని దుర్మార్గమైన చరిత్ర కనిపిస్తుంది. 36 గంటల దీక్ష అని దొంగ జపాన్ని మొదలుపెట్టాడు. ఆ దీక్ష ఎందుకు.. ఎవరి కోసం. పట్టాభి అనే వ్యక్తికి స్క్రిప్టు రాసిచ్చి.. ప్రెస్‌మీట్లు పెట్టించి బూతులు మాట్లాడిస్తున్నారు. 

జనం గుండెల్లో స్థానాన్ని ఏర్పరుచుకుని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మునుపెన్నడూ చూడనంతగా, ప్రజలు ఆరాధించే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని, ఆయన తల్లిని తద్వారా వారి జన్మను హేయ్య పదజాలంతో మాట్లాడటం కంటే దౌర్భాగ్యం ఏ రాజకీయ నాయకుడికి పట్టకూడదు. ఆ మాటలను, ఆ బూతులను సమర్థిస్తూ చంద్రబాబు దీక్ష చేస్తున్నారా..? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక కాబడిన ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగిస్తుంది కాబట్టే మీ తండ్రీకొడుకుల ఆగడాలు యధేశ్చగా సాగిపోతున్నాయి. ఇది వాస్తవమా.. కాదా..? 

సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో మాట్లాడించి.. అల్లరు, అలజడులను సృష్టించింది చాలక ఆర్టికల్‌ 356 ఏర్పాటు చేయాలని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఎవరి కాళ్లు పట్టుకోవడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడో.. అదే అమిత్‌షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జెడ్‌ ప్లస్‌ కేటగిరితో తిరుపతి వస్తే ఆయన కారును అల్లరిమూకలతో ధ్వంసం చేయించినప్పుడు 356 పెట్టాలని గుర్తురాలేదా..? రాష్ట్రంలో 356ను అమలు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని అప్పుడు ఎందుకు మోడీని అడగలేదు. ఆ రోజు పోలీస్‌ వ్యవస్థ ఏమైంది..? చంద్రబాబు ఒకవేళ అమిత్‌షా దగ్గరకువెళ్తే ఇవన్నీ అడగడా..? ఫినాయిల్‌ వేసి కడిగి పంపించడా..? నోట్లో గడ్డిపెట్టడా..?  ముసలి జంబూకం లాంటి చంద్రబాబు సిగ్గు, శరం వదిలేసి మాట్లాడుతున్నాడు. 

కాంగ్రెస్‌ పార్టీ వినాశనమే లక్ష్యంగా ఉద్భవించిన తెలుగుదేశం పార్టీని, ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చిన నాటి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని.. ఇవాళ చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు, అబద్ధాలకు, బూతులకు పెద్దఫ్యాక్టరీగా తయారు చేశాడు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు, అవినీతి, వెన్నుపోటు, దగా, మోసం, దౌర్జన్యం, వంచన. కాలిగోటి దగ్గర నుంచి తలవరకు ఆయన జీవితమంతా అదే పరిస్థితి. 

పయ్యావుల కేశవ్‌ గొంతు చించుకొని మాట్లాడుతున్నాడు. బ్రిటీష్‌ వారు గుజరాత్‌లో వారిని అమాయకుడా అనేందుకు బద్మాష్‌ అని వాడేవారు.. మీరు బాధపడకండి అని చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీలో పయ్యావుల కేశవ్‌ లాంటి బద్మాష్‌ ఎవరుంటారు..? (మీ భాష‌లోనే..)

చంద్రబాబు దగ్గర జీతానికి పనిచేసే ఒక వ్యక్తితో స్క్రిప్టు రాసిచ్చి అతి హేయమైన మాటలతో సీఎం వైయస్‌ జగన్‌ను తిట్టించి.. నాకేం తెలియదు అని మాట్లాడాడు. దొంగ దీక్షలో పక్కన కబ్జాకోరు, రౌడీని కూర్చోబెట్టుకొని మళ్లీ అదే భాష మాట్లాడించి శునకానందం పొందుతున్నాడు. చంద్రబాబు లాంటి దగుల్భాజీతో ప్రత్యర్థి రాజకీయాలు చేసే కర్మ ఏ రాజకీయ నాయకుడికి రాకూడదు. 

2016లో ప్రజాసంఘాలన్నీ కలిసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని బందు ప్రకటిస్తే.. రాష్ట్రంలో ఉత్పాదకత తగ్గిపోతుంది.. మన రాష్ట్రం మీద చెడు ముద్రపడుతుంది. బంద్‌ అని ప్రజలు వస్తే జైళ్లో పెట్టండి అని చంద్రబాబు మాట్లాడాడు. ఇలాంటి నీతి సూక్తులు ఇప్పుడు ఏమయ్యాయి..? ఆ రోజు నోరు ఏమైంది ఇవాళ..?  

2019లో చంద్రబాబును ప్రజలు ఛీ కొట్టి 23 సీట్లకు పరిమితం చేశారు. ఎంసీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాల్చివాతపెట్టారు. మున్సిపాలిటీల్లో తెడ్డుకాల్చి వాతపెట్టి పంపించారు. తిరుపతి ఉప ఎన్నికలో వి్రరవీగితే అట్లకడతో వాతపెట్టారు. ఇవాళ బంద్‌కు పిలుపునిస్తే కనీసం ఒక్క సానుభూతిపరుడు కూడా కొట్టు మూసివేయలేదు. ఆఖరికి చంద్రబాబు సొంత వ్యాపార సంస్థ  హెరిటేజ్‌ కూడా మూయకపోవడం...  ప్రజల్లో నీ పరపతి చనిపోయిందని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి. 

వెనుకబడిన తరగతులకు సీఎం వైయస్‌ జగన్‌  వెన్నుముకగా.. సీఎంకు వారు వెన్నుముకగా నిలబడ్డారు. 2024లో కూడా చంద్రబాబుకు ఇదే దుస్థితి దాపరించబోతుందని నిన్న బంద్‌లో ప్రజలు తేటతెల్లం చేశారు. ఏదైనా రాజకీయ పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాంతాలు లేని దిక్కుమాలిన రాజకీయాలు చేసేది చంద్రబాబు తప్ప మరొకరు లేరు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి లాక్కున్నతరువాత నీ పార్టీలో ఉన్నదంతా దెయ్యాలే కదా.. 

టీడీపీ కార్యాలయం ఉన్నది ప్రజల ఆస్తి. అక్రమంగా ప్రజలు అనుభవించే ఒక చెరువు మీద అవినీతి సొమ్ముతో ఆఫీస్‌ కట్టారు కాబట్టే నలుగురు కు్రరాళ్లు వచ్చి తొయ్యంగానే గేటు తునా తునకలు అయిపోయింది. ఇకనైనా కొంగజపాలు, దొంగ దీక్షలు పక్కనబెట్టి ఇంటికి వెళ్లాలి’ అని మంత్రి పేర్ని నాని చంద్రబాబుకు సూచించారు. 

 

Back to Top