ఆవగింజ అంత సిగ్గు కూడా లేదా చంద్ర‌బాబూ..?

రాజ్యాంగం చెప్పినదానికి మించి ఏపీలో సామాజిక న్యాయం

సోషల్ ఇంజినీరింగ్‌కు నిజమైన అర్థం చెప్పిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

ఓట్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీలు.. పదవులకు అగ్రవర్ణాలు.. ఇదీ బాబు నైజం

బీసీల పార్టీ అని చెప్పి బీసీలను బాబు దారుణంగా మోసం చేశాడు

5 ఏళ్ల‌లో ఒక్క రాజ్యసభ స్థానం కూడా బాబు బీసీలకు ఇవ్వలేదు

చంద్రబాబు "జామాత దశమ గ్రహం" అని ఎన్టీఆర్ ఆనాడే సర్టిఫికేట్ ఇచ్చారు

ఖాకీ యూనిఫామ్‌ నిఖార్సుగా పని చేస్తున్నది సీఎం వైయ‌స్ జగన్‌ ప్రభుత్వంలోనే

రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని నాని

తాడేప‌ల్లి: దేవినేని ఉమాపై కేసు పెట్టడం దుర్మార్గం అంటున్నచంద్రబాబుకు ఆయనపై ఎందుకు కేసు పెట్టారో తెలియదా..? అని రాష్ట్ర రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. దేవినేని ఉమా ఇంట్లో పడుకుంటేనో లేక బాబు వెన‌క సంచులు మోస్తుంటేనో కేసులు పెట్టలేదని, దళితులపై దాడి చేసి, ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి, అలజడి సృష్టించినందుకే కేసు పెట్టారన్నారు. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు, దేవినేని ఉమాలు కొండలను పిండి చేసి తినేశారో.. శాటిలైట్‌ గూగుల్ మ్యాప్‌లే చెబుతున్నాయని, ఇవాళ డ్రామాలకు తెరలేపి రాజకీయాలు చేద్దామంటే ఎవరూ ఊరుకోరు అని తేల్చి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు అధికారంలో ఉండగా ఏం చేశాడని మంత్రి పేర్ని నాని నిలదీశారు. అధికారం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు.. అధికారంలోకి రాగానే అగ్ర‌వ‌ర్ణాల‌కు సీట్లు.. ఇదే చంద్ర‌బాబు సిద్ధాంత‌మ‌న్నారు. అధికారంలో ఉన్న గత 5 ఏళ్ల‌లో చంద్రబాబు బీసీలకు ఏనాడైనా రాజ్యసభలో స్థానం కల్పించాడా అని ప్రశ్నించారు. 

తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్ని నాని విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏం మాట్లాడారంటే.. ``వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘడియ నుంచి ప్రతి ఆలోచనా, ప్రతి సంతకం సామాజిక సమతుల్యత, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు ఆలోచన చేయడమే కాకుండా, వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గం దగ్గర నుంచి ఎన్నికల ముందు తాను చెప్పిన మాటకు కట్టుబడి అన్నింటా 50శాతం పైబడి  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగ భాగాన్ని, అందులో మహిళలకు 50 శాతం పదవులు పంచడం అనేది రాష్ట్ర చరిత్రలో ముందెన్నడు జరగలేదు. కేవలం మంత్రివర్గమే కాకుండా, శాసనసభ స్థానాల కేటాయింపు, ఆఖరికి మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్ల ఎంపిక చూసినా  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 70శాతం మేరకు కేటాయించారు. డిప్యూటీ మేయర్ల పదవుల విషయంలోనూ 56-60 శాతానికి  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సభ్యులకు పదవీ బాధ‍్యతలు అప్పచెప్పారు. కార్పొరేషన్‌ చైర్మన్లకు 57 శాతం  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కేటాయించడం చూస్తే భారతదేశంలోనే ఓ వినూత్నమైన రాజకీయ విధానానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నాంది పలికారు.  

2019 నుంచి చెప్పిన ప్రతి మాటను వాస్తవం చేస్తూ.. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ ఇంజినీరింగ్‌ అనే పదానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అర్థం చూపించిన వ్యక్తి వైయ‌స్ జగన్‌. ఈ రకంగా ప్రతి అంశంలోనూ రాజ్యాంగం చెప్పినదాని కంటే అధికంగా సామాజిక సమతుల్యతను పాటించడం కేవలం ఏపీలో మాత్రమే జరుగుతోంది. అటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని ప్రజలు గర్వంగా చెప్పుకునేలా సీఎం వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు. అణగారిన వర్గాలు, పేదలు,బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు జగన్‌గారిని సంపూర్ణంగా అభినందిస్తున్నారు. అలాంటి నాయకుడికి చేదోడుగా, ఆయన కేబినెట్ మంత్రిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా.

వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పిన మాటకు కట్టుబడే విధానాన్ని మనం కళ్ళారా చూస్తునే ఉన్నాం. అదే బీసీల పార్టీ అని నోటీతో చెప్పి నొసటితో వెక్కిరించే చంద్రబాబు మాటలు, చేతలను చూస్తే.. రాజ్యసభ స్థానాలను ఎవరితో నింపారో తెలిసిందే. చంద్రబాబు మాటలు నమ్మి అధికారం ఇస్తే.. అధికారంలోకి వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆయన కళ్లకు కనిపించలేదు. అయిదేళ్లలో ఆ వర్గాలకు ఎంత అన్యాయం జరిగిందో తెలిసిందే.

చంద్రబాబు తన అయిదేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఒక్క రాజ్యసభ సీటు ఇవ్వడానికి కూడా మనసు రాలేదు. ప్రతి రాజ్యసభ స్థానాన్ని అగ్రవర్ణా కులాలతో నింపారు. ఎన్నికలప్పుడు మాత్రం సీటు ఇస్తామంటూ తన అనుకూల పేపర్లలో రాయిస్తారు. చివరకు వారికి మొండిచేయి చూపిస్తారు. ఓట్లు అడుక్కునేటప్పుడు మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చంద్రబాబుకు కనిపిస్తారు. గతంలో కేంద్రంలో భాగస్వామిగా ఉండి,  సెంట్రల్‌ క్యాబినెట్‌తో పాటు రాజ్యసభలోనూ వారికి అవకాశం కల్పించలేదు. సిగ్గులేకుండా జనాల్లో తిరుగుతూ మళ్లీ వారి గురించి ఎలా మాట్లాడతారు. బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీల గురించి చంద్రబాబుది మొసలి కన్నీరు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోరు. అధికారం పోగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గుర్తుకు వస్తారు.

ఈ రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పరిపాలన గురించి ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గురించి, సంక్షేమ ఫలాల పంపిణీ విధానాలు, ఎంపిక చేసిన పథకాలు పట్లగానీ, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద కానీ ఒక్క మాట మాట్లాడే అవకాశం చంద్రబాబు నాయుడుకు లేదు. ప్రభుత్వం మీద, ప్రభుత్వం చేస్తున్న పనులు మీద రాజకీయాలు చేసే అవకాశం లేక ఇవాళ చంద్రబాబు దేవినేని ఉమా లాంటి వాళ్ళను అడ్డంపెట్టుకుని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. 

ఎన్టీఆర్‌ చనిపోయే ముందు చంద్రబాబుకు ఓ సర్టిఫికేట్‌ ఇచ్చారు.. ‘జామాత దశమ గ్రహం’ అని. "శనిలాంటి నా అల్లుడు కుట్రలు, కుతంత్రాలకు పుట్టినిల్లు లాంటివాడు. తండ్రిలాంటి నన్ను ఔరంగజేబు కంటే ఘోరంగా అతి నీచంగా వెన్నుపోటు పొడిచాడు" అంటూ..ఆవేదన చెందారు.  అలాంటి కుట్రలు, కుతంత్రాలకు ఆలవాలం అయిన చంద్రబాబు ప్రభుత్వంపై బురద చల్లుతూ, లేనివాటిని ఉన్నట్లుగా భ్రమింప చేస్తున్నారు.  ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను తప్పుబట్టలేక ఏదొక సంఘటన సృష్టించి రాజకీయం చేసి లబ్ది పొందాలని తప్పుడు ఆలోచనలు చేస్తూ నాటకాలు, పబ్లిసిటీ స్టంట్‌ పేరుతో దుర్మార్గాలు చేస్తున్నారు.

ఎక్కడో అక్కడ ఒక సంఘటన సృష్టించడం, చంద్రబాబుకు వత్తాసు పలికే పేపర్లు, టీవీలు ఇక్కడేదో విలయం జరిగిపోతున్నట్లు వార్తలు వండి వారుస్తున్నాయి. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వ్యతిరేకంగా ఏమీ చేయలేని స్థితిలో కుట్రలు, కుతంత్రాలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం తండ్రీకొడుకులు ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని చంద్రబాబు కూడా గుర్తుపెట్టుకోవాలి.

చంద్రబాబుకు రాష్ట్రంలో ఏది జరిగినా.. దారుణాలు, దుర్మార్గాలుగానే కనిపిస్తాయి. దేవినేని ఉమాపై కేసులు ఎవరు పెట్టారు? ఏమీ లేని సంఘటనపై ఉందనే భ్రమ కల్పించి, మైలవరం నియోజకవర్గంలో ఒక అలజడి సృష్టించి, ప్రజలను రెచ్చగొట్టి, గొడవలకు ఉసిగొలిపి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని, డ్రామాకు తెరలేపారు. అక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా గాయాలు పాలైన దళిత వ్యక్తులు కేసు పెట్టారు. గొడవలు జరిగి ఎవరైతే గాయాలు పాలయ్యారో, కారులు ధ్వంసం అయ్యాయో, హత్యాయత్నం ఎవరైతే చేశారో.. ఆ కుట్రకు సూత్రధారి ఉమ కాబట్టి, అక్కడ ఉన్న క్షతగాత్రులు, గాయాలపాలైన బాధితుల ఫిర్యాదు మేరకు ఉమాను ముద్దాయిగా చేర్చారు. దేవినేని ఉమ ఇంట్లో పడుకుంటే కేసులు పెట్టారా? లేక చంద్రబాబు సంచులు మోస్తుంటే కేసులు పెట్టారా?

అయిదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో, దేవినేని ఉమ మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగిన ఘోరాలను, అన్యాయాలను వైయస్ఆర్ సీపీ నేతలపై రుద్దాలని చూస్తే అవి తప్పు అని చెప్పరా? దుర్మార్గాలు చేసింది ఎవరు? చంద్రబాబుకు సిగ్గు అనేది లేకుండా పోయిందా? అయిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మీరు ఇంత అసభ్యంగా, ఎబ్బెట్టుగా దొంగ మాటలు మాట్లాడటం సరైన పద్ధతేనా? ఈ ప్రాంతంలో క్వారీలు నడుపుకోవాలని జీవో వచ్చింది ఎవరి ద్వారా? స్టే ఇచ్చి క్వారీ మైనింగ్‌ జరుపుకోవాలని ఇచ్చింది మీ ప్రభుత్వం ద్వారానే కదా? బ్రోకరేజ్‌ చేసింది దేవినేని ఉమా కాదా? అనుమానాలు ఉన్నాయంటూ అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ ఇచ్చిన స్టేని కూడా నిలిపేసి అనుమతులకు ఉత్తర్వులు ఇచ్చింది మీరే కదా? చంద్రబాబుకు ఆవగింజ అంత సిగ్గు కూడా లేదా? కొండపల్లి భూములు రెవెన్యూ భూములు అంటూ ఉత్తర్వులు ఇచ్చి అప్పట్లో తప్పు చేసి, మళ్లీ పచ్చిగా మాపై నిందలు వేస్తారా? కొండపల్లి క్వారీలు రెవెన్యూ భూములు అంటూ మీ ప్రభుత్వ హయాంలో అనుమతి ఇచ్చి ఇప్పుడు పచ్చిగా మాట్లాడతారా? వైయ‌స్‌ జగన్ ప్రభుత్వంలో దళితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. కేసులు పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారే? మీ ప్రభుత్వంలో పెట్టిన కేసులన్నీ దురుద్దేశంతో పెట్టినవేనా? ఏబీ వెంకటేశ్వరరావును అడ్డుపెట్టుకుని పోలీసుల్ని మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోలేదా? 

వైయ‌స్ జగన్‌ ప్రభుత్వంలో పోలీసులు తలెత్తుకుని గర్వంగా పని చేస్తున్నారు. ఖాకీ యూనిఫామ్‌ నిఖార్సుగా పని చేస్తున్నది. మీ తప్పుడు డైరెక్షన్‌లో పోలీస్‌ స్టేషన్‌ దగ్గరకు వచ్చి ఉమా మూడు గంటలు డ్రామా ఆడితే.. మైలవరం డీఎస్సీ మూడు గంటల పాటు బతిమిలాడారు. అది వాస్తవం కాదా? ఆంధ్రజ్యోతి దగ్గర రికార్డింగ్‌లు లేవా? ఆఖరుకు కృష్ణా జిల్లా ఎస్పీ కూడా దేవినేని ఉమాకు ఫోన్‌చేసి మీరు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని చెప్పలేదా? ఇవన్నీ వాస్తవం కాదా? ఆఖరికి పోలీసులు, వీఆర్వో రిపోర్టు ఆధారంగా కేసులు నమోదు చేసింది వాస్తవమా కాదా? అక్కడ జరిగిందొకటైతే.. బయటకు మాత్రం వేరేలా చెబుతూ డ్రామాలు ఆడతారా?

టీడీపీ హయాంలో చట్టం ఎవరికైనా చుట్టంగా ఉండేది. అదే వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వంలో చట్టం ఎవరికైనా చట్టమే. తనవాడు అయినా, పరవాడు అయినా తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. చివరికి  పేర్ని నాని తప్పు చేసినా కూడా శిక్షకు అర్హుడే. బెజవాడలో మీ శాసనసభ్యుడు ఓ ఐపీఎస్‌ అధికారిని చొక్కా పట్టుకుని తోస్తేకేసు లేకుండా పంచాయితీలు చేసిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒక మహిళా ఎమ్మార్వోపై దాడి చేస్తే, ఆమెనే సచివాలయానికి పిలిచి బెదిరించి వార్నింగ్‌ ఇచ్చిన చరిత్ర మీది. ఇవాళ అధికారులు తలెత్తుకుని తిరుగుతున్న ప్రభుత్వం వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం. ఇప్పటికైనా తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు మాని, కుట్రలు, కుతంత్రాలు కట్టిపెట్టి మంచి రాజకీయ నాయకుడిగా ప్రవర్తించమని హితవు పలుకుతున్నాం. మా ప్రభుత్వం చంద్రబాబులా ధృతరాష్ట్ర పాలన లాంటిది కాదు. ఒక  ఎమ్మెల్యేగా మహిళా పార్లమెంట్‌ సమావేశానికి వస్తున్న రోజాగారిని గన్నవరం విమానాశ్రయంలో ఎందుకు అరెస్ట్‌ చేశారో చెప్పాలి.

పలు రాజకీయ పార్టీలు ఒకేచోటుకు రాజకీయ దురద్దేశ్యంతో వెళుతుంటే పోలీసులు చట్టరీత్యా అందర్నీ ఆపుతారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. కేవలం టీడీపీవాళ్లు నిజనిర్థారణ పేరుతో వెళుతున్నవారినే కాదు, వారికి కౌంటర్‌గా వెళుతున్న వైయస్ఆర్ సీపీ నేతలను నిర్బంధం చేశారు. మైలవరం శాసనసభ్యులను కూడా పోలీసులు అడ్డుకుని, నిర్బంధించడం జరిగింది. కేవలం రాజకీయ ఉద్రిక్తతలకు ఎవరు ప్రయత్నించాలని చూసినా పోలీసులు అడ్డుకుంటారు.

దేశ హోంమంత్రి హోదాలో అమిత్‌ షా విజయవాడ, తిరుపతి వస్తే ఆయన వాహనంపై పార్టీ కార్యకర్తలతో కోడిగుడ్లు వేయించి, నల్ల జెండాలు చూపించి నిరసన తెలపడమేనా.. లా అండ్‌ ఆర్డర్‌ను అమలు చేయడం అంటే? ప్రధాని మోదీ గుంటూరు వస్తే నల్ల జెండాలతో ఇసుక, రాళ్లు జనం మీదకు వేయించి, రెచ్చగొట్టేలా చేయడమా? ఇదేనా నిష్పక్షపాతంగా వ్యవహరించడం అంటే? ఎవరైనా సరే నిష్పక్షపాతంగా వ్యవహరించేది వైయ‌స్ జగన్‌ ప్రభుత్వమే. 

2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు, దేవినేని ఉమ కొండలను పిండి చేసి తినేశారో.. ఈ శాటిలైట్‌ మ్యాప్‌లు చెబుతున్నాయి. ఇవాళ డ్రామాలకు తెరలేపి రాజకీయాలు చేద్దామంటే ఎవరూ ఊరుకోరు. చంద్రబాబు చెప్పేంత దుర్మార్గపు ప్రభుత్వమే మాది అయితే హైదరాబాద్‌ నుంచి గొల్లపూడికి రాగలరా?  మీరు చెప్పేవి వాస్తవం అయితే ఈ రాష్ట్రంలో తిరగగలరా? ఏ రాజకీయ పార్టీ అయినా సమదృష్టితో చూసే ప్రభుత్వం మాది. మీకు ప్రజలు మరొకసారి తెడ్డు కాల్చి వాతపెట్టే రోజులు ముందున్నాయి`` అని చంద్ర‌బాబును మంత్రి పేర్ని నాని హెచ్చ‌రించారు. 

తాజా వీడియోలు

Back to Top