హైపవర్‌ కమిటీ సూచనల మేరకు తుది నిర్ణయం

బీసీజీ సంస్థ నివేదిక వచ్చిన వెంటనే.. రెండు రిపోర్టులపై హైపవర్‌ కమిటీ

ప్రజా సంక్షేమం పక్కనబెట్టి కలల రాజధాని నిర్మించాలా..? 

సీఆర్‌డీఏ అవినీతి, కుంభకోణాలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చింది

న్యాయనిపుణుల సలహా మేరకు లోకాయుక్త లేదా సీబీఐ లేదా సీఐడీతో విచారణ

రాష్ట్రంలో 341 శాశ్వత పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం

రాయచోటిలో 4 ఎకరాలు వక్ఫ్‌బోర్డుకు కేటాయింపు

108, 104 నూతన వాహనాల కొనుగోలుకు నిర్ణయం, నిధులు కేటాయింపు

సీఐపీఈటీకి గన్నవరంలో 6.4 ఎకరాల స్థలం కేటాయింపు

పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్యాలకు ఏటా మద్దతు ధర ప్రకటన

మంత్రిమండలి తీర్మానాలను వెల్లడించిన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

సచివాలయం: జీఎన్‌రావు కమిటీ రిపోర్టు అందించింది. బోస్టన్‌ గ్రూప్‌ (బీసీజీ) సంస్థ నివేదిక రావాల్సి ఉంది. ఈ రెండు రిపోర్టులపై నిపుణులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో కూడిన ఒక హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తాం. హైపవర్‌ కమిటీ సూచనల మేరకు రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటామని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. ప్రజా సంక్షేమం, విద్యార్థులు, రైతులు, శుద్ధ జలాలు, ప్రాజెక్టులు, ఇళ్ల నిర్మాణం, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి వంటి అనేక కార్యక్రమాలకు ఇప్పటికే రూ. వేల కోట్లు వెచ్చిస్తున్నామని, ఇవి పక్కనబెట్టి రాజధానిపై ఖర్చు చేస్తే హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్‌ లాంటి ప్రాంతాలతో ఎప్పటికి పోటీపడే పరిస్థితి వస్తుందని మంత్రిమండలిలో చర్చించడం జరిగిందన్నారు. అంతేకాకుండా గత ఐదేళ్లు సీఆర్‌డీఏ పరిధిలో జరిగిన అవినీతిపై మంత్రిమండలి ఉపసంఘం ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రిమండలి ఉపసంఘం గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై సీఎంకు నివేదిక అందించడం జరిగిందన్నారు. 2014 డిసెంబర్‌ 30 రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబు, గత మంత్రులు, శాసనసభ్యులు, బినామీలు, కారు డ్రైవర్లు, ఇంట్లో పనిచేసే వారిపై భూములు కొనుగోలు చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేసేందుకు న్యాయనిపుణుల సలహా తీసుకుంటామన్నారు. లోకాయుక్తాకు ఇవ్వడమా.. సీబీఐ లేదా సీబీ సీఐడీ ఇవ్వడమా అనేది న్యాయ నిపుణుల సలహా మేరకు విచార‌ణ చేస్తాం. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే మమ్మల్ని జైల్లో పెట్టండి అన్న వారి కోరిక తీరుస్తామన్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 

1. జరగబోయే పంచాయతీ రాజ్‌ ఎన్నికల కొరకు 2011 జనాభా గణన ఆధారంగా ఎస్టీ రిజర్వేషన్‌ 6.77 శాతంగానూ, ఎస్సీ రిజర్వేషన్‌ 19.08 శాతంగా, వెనుకబడిన కులాల కోసం 34 శాతం జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ పాటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ చట్టం 1994 ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఏపీ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. 

2. ఎవరైనా ప్రమాదాలకు గురైతే క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం లేకపోవడంతో మరణాలు సంభవించేవి. వాటిని అరికట్టాలని, ఏదైనా ప్రమాదం జరిగిన 20 నిమిషాల్లోపు అంబులెన్స్‌ పంపించి ఆ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి చేర్చడం ద్వారా ప్రాణాన్ని నిలపొచ్చు అనే ఆలోచనతో నాడు ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 108 అంబులెన్స్‌ సర్వీస్‌ను దేశంలోనే ప్రప్రథమంగా ప్రవేశపెట్టారు. గత ఐదు సంవత్సరాల్లో 108 అంబులెన్స్‌లన్నీ మూలనపడి టైర్లు, టైర్లలో గాలి లేక, ఇంజన్‌లో ఆయిల్‌ లేక, బండి కాలం తీరిపోయి తగలబడిపోవడం, జీతాలు లేక డ్రైవర్‌లు సమ్మెలోకి వెళ్లడంతో ఎంతోమంది ప్రాణాలు నిలపాల్సిన 108 వాహనాలకు కష్టాలు గురిచేసిన పాలన చూశాం. మళ్లీ వైయస్‌ఆర్‌ ఆలోచన ద్వారా వేలాది మంది ప్రాణాలు కాపాడేందుకు 412 కొత్త 108 వాహనాలు 2020 మార్చి 31 లోపు కొనుగోలు చేయడం కోసం రూ.71.48 లక్షలు కేటాయిస్తూ కొనుగోలుకు అనుమతి మంజూరు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. 
అలాగే ఆరోగ్య పరీక్షలు నిర్వహించే 104 నూతన వాహనాల కోసం రూ.60.51 లక్షలతో 656 వాహనాలు 2020 మార్చి 31 లోపు కొనుగోలు చేసేందుకు తీర్మానం చేయడం జరిగింది.

3. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు కొత్త విధానాన్ని ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో 191 మార్కెట్‌ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా, 150 ఉప మార్కెట్‌ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా మొత్తం 341 శాశ్వత కొనుగోలు కేంద్రాలను నడపాలని, కేవలం పంట కోతల సమయంలో కాకుండా 365 రోజులు కూడా 341 శాశ్వత కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉండేలా తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా కనీస మద్దతు ధరకు నోచుకొని పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్యాలæ కొరకు మద్దతు ధర ప్రతి సంవత్సరం ముందే ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది.

4. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కేంద్ర ప్రభుత్వ సంస్థకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో సర్వే నంబర్‌ 377/3లో 6 ఎకరాల 4 సెంట్లను రూ.43 లక్షల మార్కెట్‌ వాల్యూ ఉన్నప్పటికీ ఎకరా రూ. లక్ష చొప్పున కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది. 

5. వైయస్‌ఆర్‌ కడప జిల్లా రాయచోటి గ్రామంలో 4 ఎకరాలను రాష్ట్ర వక్ఫ్‌ బోర్డుకు కేటాయిస్తే మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. 

6. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రైట్స్‌ నిర్మాణ సంస్థకు బాధ్యతలను అప్పగిస్తూ ఇన్‌క్యాప్స్‌ సీఎండీ తీసుకున్న నిర్ణయాన్ని ర్యాటిఫై చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడం కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ఏర్పాటు కొరకు కూడా ఇన్‌క్యాప్స్‌ సీఎండీకి అనుమతిని మంజూరు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. 

7. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న కృష్ణపట్నం పోర్టు సముద్ర ముఖ పరిధిని కుదిస్తూ రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది. రామాయపట్నం పోర్టుకు పాతరోజుల్లో ఉన్న జీవో అడ్డంకిగా ఉన్న దృష్ట్యా  సముద్ర ముఖ పరిధిని కుదించడం ద్వారా పోర్టు నిర్మాణ అడ్డంకి తొలగుతుంది. పోర్టు నిర్మాణానికి ఇదొక ముందడుగా భావిస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. 

8. క్యాపిటల్‌ రీజన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి, కుంభకోణాల పరిశీలనకు ఏర్పాటుకు చేయబడిన మంత్రిమండలి ఉప సంఘం సీఎంకు నివేదికను సమర్పించింది. నివేదికలో గత ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పులు కనిపిస్తున్నాయి. నైతిక విలువలు దిగజార్చే విధంగా, అనైతికంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పులు కమిటీ కనుగొనడం జరిగింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయడం కోసం న్యాయనిపుణుల సలహా తీసుకొని వారి సలహా మేరకు సమగ్ర దర్యాప్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 

మంత్రిమండలి ఉప సంఘం ఇచ్చిన నివేదికలో సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రికి వాటాలు ఉన్న ఓ కంపెనీ.. 2014 జూలై మాసంలో భూమి కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్‌ స్టాంపులతో సహా, ఏ స్టాంపు ఏ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్రకారం కొనుగోలు చేసింది. అలా శాసనసభ్యులు, మంత్రివర్గ సభ్యులు, కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏ తారీఖున కొనుగోలు చేశారో అన్నీ ఉన్నాయి. 2014 డిసెంబర్‌ 30న అంటే రాజధాని ప్రకటన కంటే ముందు ఎవరెవరు భూములు కొనుగోలు చేశారో మంత్రిమండలి ఉప సంఘం పరిశీలనతో తేలింది. 

గడిచిన మూడు నాలుగు మాసాలుగా బాగా భోజనం చేసిన కోడి ఇంటి చూరు ఎక్కి బాగా అరుపులు అరిచినట్లుగా టీడీపీలోని చాలా మంది పెద్దలు, భూములు కొనుగోలు చేసిన వారు, కుటుంబ సభ్యులు, కారు డ్రైవర్లు, తెల్లకార్డు ఉన్న ఇంట్లో పనిచేసే వ్యక్తుల ద్వారా ఆస్తులు కొనుగోలు చేసిన వారు.. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే మమ్మల్ని జైల్లో వేయడం అని మాట్లాడుతున్నారు. పాపం పండే రోజు వచ్చేనప్పుడు ఎక్కడ దాక్కోలేరు. ఇవన్నీ ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. న్యాయనిపుణుల సలహా మేరకు లోకాయుక్తా, సీబీఐ, సీబీ సీఐడీకి ఇవ్వడమా అనేది న్యాయ నిపుణుల సలహా మేరకు దమ్ముందా అని మాట్లాడిన వారి కోరికను నెరవేరుస్తాం. 

సమగ్ర రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం అంశాలను పరిశీలన కోసం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు కమిటీ రిపోర్టును మంత్రిమండలికి ప్రభుత్వం అందజేసింది. కమిటీలో జీఎన్‌రావు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, వారితో పాటుగా అర్బన్‌ డెవలప్‌మెంట్‌లో, మాస్టర్‌ ప్లాన్‌ తయారు, నగరాలను రూపొందించడంలో నిపుణులను కమిటీలో సభ్యులుగా ఏర్పాటు చేసుకొని అధ్యయనం చేయడం జరిగింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంచే ప్రపంచ ప్రఖ్యాత గాంచిన కంపెనీల్లో ఒకటైనా బోస్టన్‌ గ్రూపుతో కమిటీ వేయడం జరిగింది. ఆ సంస్థ  రిపోర్టు ఇంకా ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. ఆ రెండు రిపోర్టులను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేలా ప్రభుత్వంచే హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాన్ని మంత్రిమండలి నిర్ణయించింది. 

మంత్రిమండలిలో చాలా చర్చలు జరిగాయి. ప్రధానంగా 2015లో అప్పటి ప్రభుత్వం ఒక ఊహాజనితమైన రాజధాని నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన శివరామకృష్ణ కమిటీ రిపోర్టు కంటే నారాయణ కాలేజీ వ్యవస్థాపకులు, అప్పటి మంత్రి నారాయణ వారి బృందం ఇచ్చిన రిపోర్టు శివరామకృష్ణ కంటే మేలైందని అప్పటి ప్రభుత్వం ఆమోదించింది. విశాలమైన ఊహాజనితమైన కలల రాజధానిని నిర్మించాలనే నిర్ణయం తీసుకొని 2015–16లో 33 వేల ఎకరాల రైతుల భూమిని, ప్రభుత్వ భూమి అంటే పూర్వపు అసైన్డ్‌ భూమి, పూర్వపు బంజర భూమిని 20 వేల ఎకరాలు కలిపి మొత్తం సుమారు 54 వేల ఎకరాల్లో ప్రపంచంలో ఎక్కడా లేని, అంతా ఈర్ష్యపడే రాజధాని నిర్మాణం చేయాలని, నారాయణ మేధావుల కమిటీ రిపోర్టు ఆధారంగా 54 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం కోసం రాజధానిలో మౌలిక సదుపాయల ఏర్పాటుకు ఎకరాకు రూ. 2 కోట్ల చొప్పున సుమారు రూ.లక్షా 10 వేల కోట్ల పైచిలుకు నిర్మాణ వ్యయం అవుతుందని అంచనాకు వచ్చింది. పరిపాలన దక్షత, ముందుచూపుతో అన్నిరకాల బలాబలాలను ప్రయోగించి భాగస్వామిగా ఉన్న కేంద్రం ప్రభుత్వం నుంచి పలుకుబడి ఉపయోగించి ఏ రాష్ట్రానికి రానటువంటి పెద్ద నిధులు రూ.1,500 కోట్లు రాజధాని నిర్మాణానికి తీసుకురావడం, మరో రూ.4 వేల కోట్లను రూపాయి పది పైసలు, రూపాయి 15 పైసలకు నెలసరి వడ్డీ ప్రకారం తీసుకువచ్చి సుమారు శాయశక్తులా చమటోడ్చి ఐదేళ్లలో విశాలమైన రూ.5,400 కోట్లతో నిర్మాణాన్ని ఐదేళ్లలో తయారు చేశారు. 

40 ఏళ్ల అనుభవం, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్న పరిస్థితుల్లో నాడు 2014 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు రుణాలు మాఫీ చేయలేనని చెప్పారు. కానీ రైతు రుఫమాఫీ చేస్తానని ప్రకటిస్తే.. వైయస్‌ జగన్‌తో తిరిగే నాలాంటి వ్యక్తి ఓ పార్టీ అధ్యక్షుడు సాధ్యం కాని ఎన్నికల వాగ్దానాలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని  ఎన్నికల కమిషన్‌కు ఉత్తరం రాశారు. నా అనుభవంతో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు.. రాజధాని నిర్మాణానికి రూ. లక్షా 10 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళికలు రచించుకొని 2019 నాటికి అనుభవంతో తీసుకువచ్చిన డబ్బు రూ. 5400 కోట్లు.

అయితే.. మనకు ఉన్న కొద్దిపాటి అనుభవంతో మిగిలిన రూ.లక్షా 5 వేల కోట్లతో ఈ రాజధాని నిర్మాణం చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. బాగా అయితే అనుభవంతో పోటీ పడి మనం రూ.5–6 వేల కోట్లు ఖర్చుపెట్టగలిగే పరిస్థితి వస్తే ఈ రాజధాని ఎప్పటికి కలల సహకారం అయ్యే పరిస్థితి ఉంటుంది. లేదూ.. అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చే మేలైన సలహాలు తీసుకొని ఇంకా ఎక్కువగా అప్పు తీసుకువద్దామంటే.. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల గడిచిన ఆరు మాసాల క్రితం.. తేగలిగినంత అప్పు మొత్తం మేమే తెచ్చాం. ఇంకా వీరికి ఎవరు ఇస్తారని మాట్లాడారు. 

చంద్రబాబు అనుభవం, సలహాలను వెంబడి పెట్టుకొని వెళ్లి రూ.25 నుంచి 50 వేల అప్పు తెస్తే.. నాడు వైయస్‌ఆర్‌ నుంచి నిన్నటి చంద్రబాబు వరకు ఈ రాష్ట్రంలో ప్రారంభించబడి కొనసాగుతున్న ఇరిగేషన్‌ ప్రాజెక్టుల అవసరాలను తీర్చడం కోసం రూ. 25 వేల కోట్ల ఆర్థిక అవసరం. స్కూల్స్‌ మరమ్మతుల కోసం రూ.12 వేల కోట్లు, ఆస్పత్రుల బాగుచేయడానికి రూ.14 వేల కోట్లు, ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రూ.3,150 కోట్లు, పోలవరం నిర్మాణం, ఉత్తరాంధ్ర స్రుజల స్రవంతికి, రాయలసీమకు సమగ్రంగా సాగునీరు అందించేందుకు వీటన్నింటికీ మరో రూ. లక్ష కోట్లు అవసరం, అమ్మ ఒడికి రూ. 6 వేల కోట్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించేందుకు మరో రూ. 45 వేల కోట్లు అవసరం. ఇళ్ల నిర్మాణానికి సంవత్సరానికి రూ. 9 వేల కోట్ల అవసరం ఉంటే.. గుక్కెడు నీళ్లు తాగుదాం.. గొంతు తడుపుకుందాం అనే చాలా ప్రాంతాల ప్రజలకు ఆ గుక్కెడు నీళ్లు యమపాశాలై ప్రాణాలు హరిస్తున్నాయి. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో మంచినీరు తాగడం ద్వారా కిడ్నీలు చెడిపోయి మరణాలు సంభవిస్తున్నాయి. వారి ప్రాణాలు నిలబెట్టేందుకు శుద్ధి చేసిన మంచినీరు ఇవ్వడానికి వాటర్‌ గ్రిడ్‌ కోసం రూ. 40 వేల కోట్లు అవసరం. సాంఘిక, గిరిజన, బీసీల సంక్షేమం కోసం సంవత్సరానికి రూ. 35 వేల కోట్లు అవసరం. పేదలకు బియ్యం ఇవ్వడానికి సంవత్సరానికి రూ. 10 వేల కోట్లు, ఫీజు రియింబర్స్‌మెంట్‌కు సంవత్సరానికి రూ. 6 వేల కోట్లు అవసరం. పేద కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగుకావాలంటే కేవలం చదువు ద్వారా మాత్రమే. రైతులకు పెట్టుబడి నిధులు కేంద్రం వాటా పోను రాష్ట్ర వాటా ఏటా రూ. 7 నుంచి 8 వేల కోట్లు, రోడ్లు నిర్మాణం చేయాలి. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన ఆశ్యకత ఉంది. కొత్తగా ఈ ప్రభుత్వం రైతుకు ఉచితంగా 9 గంటల విద్యుత్‌ పగటి పూట అందజేయడం కోసం రూ. 3 వేల కోట్లు అవసరం అయ్యాయి. ఇలా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను మంత్రిమండలి చర్చించుకున్న విషయాలు. 

ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమం, ప్రజల అవసరాలు, అభివృద్ధి, భవిష్యత్తు చూడాలా..? ఊహాజనితమైన కలల రాజధాని ఇక్కడ ఎప్పటికి నిర్మాణం చేయగలం. లేదా ప్రజల బాగోగులను, చదువు, ఆరోగ్యం ప్రతీది పక్కకుపెట్టి రాజధాని నిర్మాణం చేస్తే హైదరాబాద్, మద్రాస్, బెంగళూరుతో ఎప్పటికి పోటీపడే పరిస్థితి వస్తుందనేది మంత్రిమండలి చర్చించడం జరిగింది. జీఎన్‌రావు కమిటీ, బీసీజీ అధ్యయన కమిటీలపై హైపవర్‌ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో నిపుణులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను నియమిస్తాం. రెండు రిపోర్టులను అధ్యయనం చేసి హైపవర్‌ కమిటీ రిపోర్టు అందించేందుకు మంత్రిమండలి మార్గదర్శకాలను ఏర్పాటు చేసుకుంది. జీఎన్‌రావు కమిటీ శివరామకృష్ణ కమిటీ రిపోర్టును కూడా అధ్యయనం చేసింది అని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 
 

Back to Top